Share News

KTR : ‘స్థానికత’పై సర్కారు తీరు అనుమానాస్పదం

ABN , Publish Date - Aug 07 , 2024 | 04:48 AM

వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీకి స్థానికత విషయంలో ప్రభుత్వ తీరు అనుమానాస్పదంగా ఉందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

KTR : ‘స్థానికత’పై సర్కారు తీరు అనుమానాస్పదం

  • వైద్య విద్య ప్రవేశాల్లో తెలంగాణ విద్యార్థులకు నష్టం

  • సర్కారు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీకి స్థానికత విషయంలో ప్రభుత్వ తీరు అనుమానాస్పదంగా ఉందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. జీవో 33 ప్రకారం నిర్దేశించిన స్థానికతలోని అంశాల వల్ల తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని మంగళవారం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. 9 నుంచి 12 తరగతి వరకు తెలంగాణలో చదివిన విద్యార్థులే స్థానికులు అవుతారని ప్రభుత్వం చెబుతోందని, దీని ప్రకారం హైదరాబాద్‌లో విద్యాభ్యాసం చేస్తున్న ఇతర రాష్ట్రాల విద్యార్థులు చాలామంది తెలంగాణ లోకల్‌ అవుతారని తెలిపారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో చదివే మన విద్యార్థులు నాన్‌ లోకల్‌ అవుతారన్నారు. దీనివల్ల మన విద్యార్థులు వైద్య విద్య సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని, ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఇక అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడి అరెస్టు సరికాదని, ప్రజలు ఎనుకున్న ప్రజాప్రతినిధులను అవమానించేందుకు ఈ ప్రభుత్వం ప్రొటోకాల్‌ విధానాలను మార్చిందా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్‌ నాయకులను అధికారిక సమావేశాలు, కార్యక్రమాలకు ఎందుకు ఆహ్వానిస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.


ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల క్షీణత ఆందోళనకరం

తెలంగాణలో ఐటీ ఎగుమతులు, ఉద్యోగాలు క్షీణించడం ఆందోళన కలిగిస్తోందని కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐటీ రంగాన్ని పూర్తిగా విస్మరిస్తోందని విమర్శించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం నుంచి రూ.57,706 కోట్ల ఐటీ ఎగుమతులుంటే 2023-24లో రూ.26,948 కోట్లే జరిగాయని తెలిపారు. ఐటీ ఉద్యోగాల కల్పన భారీగా పడిపోయిందని, 2022-23లో 1,27,594 కొత్త ఉద్యోగాలు వస్తే.. 2023-24లో 40,285 ఉద్యోగాలే కల్పించారని పేర్కొన్నారు. యువ పారిశ్రామికవేత్తలకు, స్టార్టప్‌ కంపెనీలకు ప్రభుత్వం అండగా నిలవాలని కేటీఆర్‌ కోరారు.

Updated Date - Aug 07 , 2024 | 04:48 AM