KTR: మూసీ వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు?
ABN , Publish Date - Oct 06 , 2024 | 04:04 AM
రైతు రుణమాఫీ ఎగ్గొట్టి, మూసీలో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరు? అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
సీఎంకు బతుకమ్మ అంటే గిట్టదా.. పట్టదా?:కేటీఆర్
హైదరాబాద్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): రైతు రుణమాఫీ ఎగ్గొట్టి, మూసీలో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరు? అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రైతు బంధు ఎగ్గొట్టి, మూసీ పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరు? అని ఆయన శనివారం ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. మహిళలకు వంద రోజుల్లోనే నెలకు రూ.2500, అవ్వ, తాతలకు నెలకు రూ. 4000 ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టిన నయవంచకుడు ఎవరు? అని ప్రభుత్వంపై కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
మూసీ సుందరీకరణ పేరిట రూ. లక్షన్నర కోట్లు లూటీకి తెరతీసిన ఘనుడు ఎవరు? అని ధ్వజమెత్తారు. ఆడబిడ్డల వేడుకకు ఏర్పాట్లు చేయడానికి మనసురాట్లేదా? పండుగపూట కూడా పల్లెలను పరిశుభ్రంగా ఉంచలేరా? చెత్తా చెదారం మధ్య మురికి కంపులో మన ఆడబిడ్డలు బతుకమ్మ ఆడుకోవాల్నా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణ అస్తిత్వ సంబురంపై ఎందుకింత నిర్లక్ష్యం..? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. బతుకమ్మ అంటే గిట్టదా..పట్టదా ఈ ముఖ్యమంత్రికి? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.