Share News

Mahabubabad: ఏసీబీ వలలో శ్రీముసలమ్మ ఆలయ ఈవో

ABN , Publish Date - Aug 19 , 2024 | 03:33 AM

మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు గ్రామంలోని శ్రీముసలమ్మ ఆలయ ఈవో భోగోజు భిక్షమాచారి ఆదివారం ఏసీబీ వలకు చిక్కారు.

Mahabubabad: ఏసీబీ వలలో శ్రీముసలమ్మ ఆలయ ఈవో

  • రూ.20వే ల లంచం తీసుకుంటుండగా పట్టివేత

కొత్తగూడ, మరిపెడ (మహబూబాబాద్‌ జిల్లా), ఆగస్టు 18: మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు గ్రామంలోని శ్రీముసలమ్మ ఆలయ ఈవో భోగోజు భిక్షమాచారి ఆదివారం ఏసీబీ వలకు చిక్కారు. ఓ దుకాణదారుడి నుంచి రూ.20వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం... శ్రీముసలమ్మ ఆలయం ఆవరణలో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో కిరాణ దుకాణం ఏర్పాటు చేశారు.


గత మే 29న టెండరులో గుంజేడుకు చెందిన పాల్తి రాములు ఈ దుకాణాన్ని దక్కించుకోగా హైదరాబాద్‌కు చెందిన నల్లెపు సాంబయ్య దీన్ని నడుపుతున్నాడు. ఈ దుకాణంలో మద్యం అమ్ముతున్నారని గత జూన్‌ 11న దుకాణాన్ని దేవాదాయ శాఖ సీజ్‌ చేసింది. దాన్ని మళ్లీ తెరిచేందుకు సాంబయ్య అనుమతి తెచ్చారు.


అయితే షాపు పునరుద్ధరణకు లంచం ఇవ్వాలని ఈవో భిక్షమాచారి డిమాండ్‌ చేయగా.. సాంబయ్య ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఆదివారం పథకం ప్రకారం ఈవోకు సాంబయ్య రూ.20 వేలు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మరోవైపు మరిపెడలోని భిక్షమాచారి ఇంట్లో ఆదివారం రాత్రి వరకు ఏసీబీ అధికారులు తనిఖీలు జరిపారు.

Updated Date - Aug 19 , 2024 | 03:33 AM