Mahesh Kumar Goud: స్థానిక ఎన్నికల్లో సేవాదళ్ కార్యకర్తలకు కోటా!
ABN , Publish Date - Nov 21 , 2024 | 04:31 AM
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సేవాదళ్ నేతలు, కార్యకర్తలకు ఆయా స్థాయుల్లో కోటా ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్ వెల్లడించారు. పార్టీ ప్రధాన విభాగాల(ఫ్రంటల్ ఆర్గనైజేషన్లు)తో సమానంగా గుర్తింపునూ ఇస్తామన్నారు.
పార్టీ ప్రధాన విభాగాలతో సమానంగా గుర్తింపు
సేవాదళ్ శతాబ్ది ఉత్సవ సభలో మహే్‌షకుమార్‌గౌడ్
హైదరాబాద్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సేవాదళ్ నేతలు, కార్యకర్తలకు ఆయా స్థాయుల్లో కోటా ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్ వెల్లడించారు. పార్టీ ప్రధాన విభాగాల(ఫ్రంటల్ ఆర్గనైజేషన్లు)తో సమానంగా గుర్తింపునూ ఇస్తామన్నారు. అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ ఏర్పడి వందేళ్లయిన సందర్భంగా గాంధీభవన్‌లో సేవాదళ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జితేందర్ ఆధ్వర్యంలో సేవాదళ్ శతాబ్ది ఉత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో మహేష్ కుమార్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్యకర్తల కృషి ఫలితంగానే ఏర్పడిందని, వారి కష్టానికి తప్పకుండా ప్రతిఫలం ఉంటుందని స్పష్టం చేశారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేయలేని పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో చేసిందన్నారు.
రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్న లక్ష్యంతో పని చేద్దామని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ మాట్లాడుతూ కరోనా సమయంలో సేవాదళ్ అద్భుతమైన పనితీరు చూపిందని, దాన్ని గుర్తించిన సోనియాగాంధీ.. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ టిక్కెట్లను ఇచ్చారన్నారు. సేవాదళ్ జాతీయ అధ్యక్షుడు లాల్‌జీ దేశాయ్ మాట్లాడుతూ మోదీ, అమిత్‌షాలు దేశానికి పట్టిన శని అని, గుజరాతీలు దేశాన్ని లూటీ చేస్తున్నారని విమర్శించారు. పార్టీ సీనియర్ నేత వి. హన్మంతరావు మాట్లాడుతూ సేవాదళ్.. గ్రామస్థాయిలోనూ కష్టాల్లో ఉన్నవారికి సేవ చేయాలని సూచించారు. ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ సేవాదళ్ వందేళ్ల ఉత్సవాన్ని జరుపుకొంటున్నందుకు ఒక సేవాదళ్ కార్యకర్తగా తాను గర్వపడుతున్నానన్నారు.