Gajwel: మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు మునిసిపాలిటీలోకి
ABN , Publish Date - Sep 19 , 2024 | 04:01 AM
మల్లన్నసాగర్ ముంపు గ్రామలతో పాటు పునరావాస కాలనీ గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మునిసిపాలిటీలో విలీనం కానున్నాయి. ఇందుకు సంబంధించిన జీవోను ప్రభుత్వం బుధవారం జారీ చేసింది.
విలీనం చేస్తూ ఉత్తర్వులను జారీ చేసిన ప్రభుత్వం
గజ్వేల్, సెప్టెంబరు 18: మల్లన్నసాగర్ ముంపు గ్రామలతో పాటు పునరావాస కాలనీ గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మునిసిపాలిటీలో విలీనం కానున్నాయి. ఇందుకు సంబంధించిన జీవోను ప్రభుత్వం బుధవారం జారీ చేసింది. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. సిద్దిపేట జిల్లాలోని కొండపాక మండలం ఎర్రవల్లి గ్రామపంచాయతీతో పాటు తిప్పారం గ్రామపంచాయతీ పరిధిలోని మధిర గ్రామమైన సింగారం, తొగుట మండలంలోని బ్రాహ్మణ బంజేరుపల్లి, లక్ష్మాపూర్, పల్లెపహాడ్, వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామపంచాయతీలను గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మునిసిపాలిటీలో విలీనం చేయనున్నారు.
అలాగే మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేసే ముందు ముంపు గ్రామాల ప్రజల కోసం గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మునిసిపాలిటీ పరిధి ముట్రాజ్‌పల్లి, సంగాపూర్, గజ్వేల్ రెవెన్యూలో పునరావాస కాలనీని ఏర్పాటు చేశారు. ముంపు గ్రామాలకు చెందిన దాదాపు వెయ్యి కుటుంబాలు అక్కడ నివాసం ఉంటున్నాయి. 2019లో మల్లన్నసాగర్ పునరావాస కాలనీకీ స్థానిక ఎన్నికలు నిర్వహించారు. కాలనీపై మునిసిపాలిటీకి ఎలాంటి అధికారం లేకుండా స్థానిక సంస్థల పర్యవేక్షణలోనే పునరావాస కాలనీలో పౌర సేవలు కొనసాగించారు. తాజాగా ప్రభుత్వం మారడం, సర్పంచ్, ఎంపీటీసీల పదవీకాలం పూర్తవడం రాష్ట్రంలోని స్థానిక సంస్థల పరిధిలో ఓటరు జాబితా సవరణ, ఇతరత్రా ఎన్నికల పనులు జరుగుతుండగా ముంపు గ్రామాలతో పాటు పునరావాస కాలనీని మునిసిపాలిటీలో విలీనం చేయనున్నారు.