TS Politics: కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమిదే.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 27 , 2024 | 04:31 PM
అబద్దాల ప్రచారంతో కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) అన్నారు. శనివారం నాడు సిద్దిపేట కొండా మల్లయ్య గార్డెన్‌లో బీఆర్ఎస్ కృతజ్ఞత సభ నిర్వహించారు.
సిద్దిపేట: అబద్దాల ప్రచారంతో కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) అన్నారు. శనివారం నాడు సిద్దిపేట కొండా మల్లయ్య గార్డెన్‌లో బీఆర్ఎస్ కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సభలో జెడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... ప్రజల తీర్పు శిరసావహించాలని.. నాడు పది సీట్లు వచ్చినా తాము వెనకడుగు వేయలేదని చెప్పారు. 1.8 % ఓట్లతో అధికారం కోల్పోయామని చెప్పారు. దళిత, బీసీ బంధుతో ఓట్లు తగ్గాయన్నారు. కాంగ్రెస్ తీరు అనాడు ప్రచారంలో.. అబద్దాలు, నేడు పాలనలో అసహనం పెరిగిపోయిందని మండిపడ్డారు. యూట్యూబ్ చానెళ్లు కూడా సగం మన కొంప ముంచాయన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఏ హామీను నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. రూ. 2 లక్షల రుణమాఫీ, వడ్లకు 5 వేల బోనస్, 4 వేల రూపాయల పింఛన్, కరెంట్ బిల్లుల మాఫీ వంటి హామీలు అమలు చేశారా ? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నవాళ్లకు ఓపిక ఉండాలని.. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా ? అని హరీశ్ రావు నిలదీశారు.
అప్పుల పేరుతో.. కాంగ్రెస్ కాలం వెళ్లదీత
బీఆర్ఎస్‌కు ఉద్యమాలు, దాడులు, బెదిరింపులు కొత్తకాదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎలా ఎగ్గొట్టాలనే ఆలోచిస్తోందని.. అందుకే అప్పుల పేరుతో కాలం వెళ్లదీస్తోందని ఆరోపించారు. ఫిబ్రవరి రెండో వారంలో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అంటున్నారని.. ఈ లోగా కాంగ్రెస్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు 1.50 కోట్ల మంది ఉన్నారని.. వారందరికీ వెంటనే 2,500 రూపాయలు ఇవ్వాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరం కూడా నీరుపారడం లేదన్నారు.. మరి మొన్న మంత్రి కొండా సురేఖ రంగనాయకసాగర్ గేట్లు ఎందుకు వదిలారని ప్రశ్నించారు. రైతులకు 24 గంటలు కరెంట్ రావట్లేదని చెప్పారు. ఎరువుల కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది కాంగ్రెస్, బీజేపీలు కావని.. బీఆర్ఎస్ మాత్రమేనని తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ స్థానాలను ఎక్కువగా గెలిస్తేనే... కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిలదీసేందుకు అవకాశం ఉంటుందని హరీశ్ రావు అన్నారు.