Medaram: 25 ఎకరాల్లో వనదేవతల స్మృతి వనం..
ABN , Publish Date - Jun 11 , 2024 | 03:06 AM
వనదేవతలైన సమ్మక్క-సారలమ్మ చరిత్రను భవిష్యత్తు తరాలకూ తెలపాలని, ఇందుకోసం మేడారంలో వనదేవతల స్మృతి వనం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. గద్దెల వెనుకవైపు ఉన్న 25 ఎకరాల స్థలంలో ఈ స్మృతి వనాన్ని నిర్మించాలని భావిస్తోంది.
సమ్మక్క-సారలమ్మ ప్రాశస్త్యం, శాసనాలతో మ్యూజియం
భవిష్యత్తు తరాలకు చరిత్రను తెలియజేయడమే లక్ష్యం
చిలకల గుట్ట సుందరీకరణ, భక్తులకు మరిన్ని సౌకర్యాలు
పర్యాటక ప్రాంతంగా మేడారం.. గిరిజనులకు ఉపాధి
డీపీఆర్‌పై సర్కారు కసరత్తు.. వివరాలతో కేంద్రానికి లేఖ
హైదరాబాద్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): వనదేవతలైన సమ్మక్క-సారలమ్మ చరిత్రను భవిష్యత్తు తరాలకూ తెలపాలని, ఇందుకోసం మేడారంలో వనదేవతల స్మృతి వనం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. గద్దెల వెనుకవైపు ఉన్న 25 ఎకరాల స్థలంలో ఈ స్మృతి వనాన్ని నిర్మించాలని భావిస్తోంది. తల్లుల జాతర విశేషాలతోపాటు అప్పటి వస్తువులు, శాసనాలు, వనదేవతల ప్రాశస్త్య వివరాలతో మ్యూజియంను ఏర్పాటు చేయనుంది. చిలకల గుట్టను సుందరీకరించడంతోపాటు భక్తులకు మరిన్ని సౌకర్యాలను కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)పై అధికారులు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. ములుగు జిల్లాలోని మేడారంలో రెండేళ్లకొకసారి జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. జాతర సమయంలో వనమంతా జనంతో నిండిపోతుంది.
రెండేళ్లకోసారి నాలుగురోజులపాటు జరిగే ఈ జాతరకు దాదాపు 10 రాష్ట్రాల నుంచి కోటి మందికి పైగా గిరిజన, గిరిజనేతర భక్తులు వస్తారు. ‘కుంభమేళా’ తర్వాత దేశంలో మళ్లీ అంతటి స్థాయిలో ప్రజలు పాల్గొనేది ఈ జాతరలోనే. ఇంత ప్రాశస్త్యం ఉన్న జాతరకు జాతీయ హోదా కల్పించాలన్న డిమాండ్ కొన్నేళ్లుగా ఉంది. ఇప్పటికే రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసింది. కానీ, కేంద్రం మాత్రం ఏళ్ల నుంచి తాత్సారం చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో జాతరకు జాతీయ హోదా కల్పించే అంశాన్ని మరో సారి ప్రస్తావించడంతోపాటు స్మృతి వనం వివరాలను తెలుపుతూ కేంద్రానికి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేలా..
సమ్మక్క-సారలమ్మ చరిత్రను తెలిపేలా ఇప్పటికే చిలకల గుట్ట చుట్టూ ఉన్న ప్రహరీపై చిత్రాలను గిరిజన శాఖ ఏర్పాటు చేసింది. ఆ చిత్రాలు గోడలకే పరిమితం కావడం, గద్దెల ప్రాంగణానికి చిలకల గుట్టకు చాలా దూరం ఉండడంతో ఎక్కువ మంది భక్తులు వెళ్లలేకపోతున్నారు. ఈ క్రమంలో తల్లుల చరిత్రను కళ్లకు కట్టేలా డిటిటల్ మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. స్మృతివనంలో ముఖ్యంగా అప్పటి శాసనాలు, సమ్మక్క-సారలమ్మ వినియోగించిన వస్తువులను ప్రదర్శించనున్నారు. అప్పటి పాలనాపరమైన అంశాలు, ప్రజల మధ్య బంధాలు ఎలా ఉండేవన్న అంశాలను తెలియజేస్తూ దీన్ని నిర్మించనున్నారు. జాతర రోజుల్లోనే కాకుండా సాధారణ రోజుల్లోనూ కుటుంబంతోపాటు వెళ్లి, ఆ ప్రాంతాన్ని సందర్శించే విధంగా తీర్చిదిద్దాలని యోచిస్తోంది.
గెస్ట్ హౌస్‌లు, పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా స్మృతి వనాన్ని తీర్చిదిద్దనున్నారు. ముఖ్యంగా చిలకల గుట్టను సుందరీకరించనున్నారు. మొత్తంగా భక్తులకు సకల సౌకర్యాలను కల్పించనున్నారు. మేడారం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, స్మృతివనం నిర్మాణంతో తల్లుల దగ్గరకు వచ్చేవారి సంఖ్య పెరుగుతుందని, తద్వారా స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని ప్రభుత్వం భావిస్తోంది.