NHM: ఎన్‌హెచ్‌ఎం నిధులివ్వని కేంద్రం!
ABN , Publish Date - May 13 , 2024 | 04:00 AM
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) నిధుల మంజూరులో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. కేంద్రం గత రెండేళ్లుగా ఈ నిధులను సకాలంలో ఇవ్వడం లేదు. ఇలా సుమారు రూ.500 కోట్లు కాలాతీతం కావడంతో మురిగిపోయాయి. కేంద్రం తీరుతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణపై వివక్ష చూపుతున్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి.
రెండేళ్లుగా చుక్కలు చూపిస్తున్న వైనం.. దాదాపు రూ.500 కోట్ల నిధుల నిలిపివేత
ఇతర రాష్ట్రాలకు కేటాయింపులకు మించి
తెలంగాణ విషయంలో మాత్రం వివక్ష!
ఆ 5 రాష్ట్రాలకే మొత్తం నిధుల్లో 42 శాతం
ఇక్కడ ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి
హైదరాబాద్, మే 12 (ఆంధ్రజ్యోతి): జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) నిధుల మంజూరులో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. కేంద్రం గత రెండేళ్లుగా ఈ నిధులను సకాలంలో ఇవ్వడం లేదు. ఇలా సుమారు రూ.500 కోట్లు కాలాతీతం కావడంతో మురిగిపోయాయి. కేంద్రం తీరుతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణపై వివక్ష చూపుతున్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం తెలంగాణకు ఎన్‌హెచ్‌ఎమ్ నిధులు నిలిపివేసిందని, దీంతో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉందని గత నెల 7న ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది. మరో 24 రోజుల్లో నిధులు రాకుంటే అంతేనని కూడా ఆ కథనంలో పేర్కొంది. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియడం, కేంద్రం నుంచి నయాపైసా రాకపోవడంతో రాష్ట్రం పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి.
వాస్తవానికి తెలంగాణకు ఎన్‌హెచ్‌ఎం కింద 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1480.22 కోట్ల బడ్జెట్‌కు కేంద్రం అనుమతినిచ్చింది. ఇందులో రూ.888.13 కోట్లు (60 శాతం) కేంద్రం వాటా. రాష్ట్రం తన వాటా కింద 40 శాతం అంటే రూ.592.09 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. ఇందులో కేంద్రం తన వాటాను నాలుగు క్వార్టర్ల కింద ఇస్తుంది. ఇందులో ఇప్పటికి కేవలం రూ.540.59 కోట్లే విడుదల చేసింది. మరో రెండు క్వార్టర్లకు సంబంధించిన రూ.347.54 కోట్లు ఆగిపోయాయి. మార్చి 31లోగా అవి రాకపోవడంతో ఆ నిధులు మురిగిపోయాయని వైద్య వర్గాలు తెలిపాయి. ‘2022-23 ఆర్థిక సంవత్సరానివి మరో రూ.150 కోట్ల నిధులు కూడా ఇలాగే మురిగిపోయాయి. వెరసి రూ.500 కోట్లు రాకపోవడంతో ఆ భారం రాష్ట్ర ఖజానాపై పడింద’ని అఽధికారులు చెబుతున్నారు. ఈ అంశంపై మార్చి మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. నిధుల నిలిపివేయడంతో ఎన్‌హెచ్‌ఎమ్ పరిధిలోని కీలకమైన ఆరోగ్య పథకాలు నిలిచిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. 17 వేల మంది ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి నెలకొనడంతో రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ఎన్‌హెచ్‌ఎమ్‌కు రూ.100 కోట్లు ఇచ్చింది. దాంతో మూడు నెలల జీతాలు ఇచ్చారు. ప్రస్తుతం మార్చి నెల జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. మరికొన్ని నిధులు వెంటనే విడుదల చేయాలని ఎన్‌హెచ్‌ఎం ఎండీ ఆర్వీ కర్ణన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణకు తీవ్ర అన్యాయం
కేంద్రం ఎన్‌హెచ్‌ఎం నిఽధులను కావాలనే నిలిపివేసిందని, తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని అధికారులు లెక్కలతో చెబుతున్నారు. 2020-21 నుంచి 2023-24 మధ్యకాలంలో ఎన్‌హెచ్‌ఎం కింద అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి రూ.1,11,168.47 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఇందులో రాష్ట్రానికి విడుదల చేసింది రూ.2,621 కోట్లు మాత్రమే. ఈ విషయంలో దేశంలో 15వ స్థానంలో ఉంది. నాలుగేళ్ల ఎన్‌హెచ్‌ఎం మొత్తం నిఽధుల్లో మనకు వచ్చినది కేవలం 2.35 శాతమే. ఎన్‌హెచ్‌ఎం ద్వారా అత్యధిక నిధులు పొందిన రాష్ట్రాల జాబితాలో ఉత్తరప్రదేశ్ (రూ.15,872.51 కోట్లు), మధ్యప్రదేశ్ (రూ.9,051 కోట్లు), మహారాష్ట్ర (రూ.7661 కోట్లు), అసోం (రూ.7207 కోట్లు), రాజస్థాన్ (రూ.7056 కోట్లు) ఉన్నాయి. కేవలం ఆ ఐదు రాష్ట్రాలకే కేంద్రం ఎన్‌హెచ్‌ఎం నిధుల్లో 42.12 శాతం ఇచ్చిందని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఇదే కేంద్రం కొన్ని రాష్ట్రాలకు విచిత్రంగా కేటాయింపులకు మించి నిధులు విడుదల చేసిందని కూడా వారు చెబుతున్నారు.