Hyderabad: అటవీ సిబ్బందిపై దాడులను సహించం..
ABN , Publish Date - Jun 16 , 2024 | 03:38 AM
పోడు రైతులకు ఇబ్బందులు కలిగించబోమని, అదే సమయంలో అటవీ అధికారులపై దాడులు చేస్తే సహించబోమని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. పోడు సాగుదారుల హక్కులను కాపాడడంతోపాటు అటవీ అధికారులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
పోడు రైతులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు
అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు
తాజాగా దాడి నేపథ్యంలో మంత్రి సురేఖ
హైదరాబాద్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): పోడు రైతులకు ఇబ్బందులు కలిగించబోమని, అదే సమయంలో అటవీ అధికారులపై దాడులు చేస్తే సహించబోమని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. పోడు సాగుదారుల హక్కులను కాపాడడంతోపాటు అటవీ అధికారులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. వ్యవసాయం పేరుతో అటవీ చట్టాలకు విరుద్ధంగా కొత్తగా భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. సచివాలయంలో శనివారం మరో మంత్రి సీతక్కతో కలిసి అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఆమె సమావేశమయ్యారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్‌లో ఎఫ్‌ఆర్‌ఓ, సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్‌పై గిరిజనుల దాడి ఘటనను ఆమె ప్రస్తావించారు. ప్రజల ప్రయోజనాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తామో, అటవీ సంపద పరిరక్షణకు అంతే ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో అనర్హులకు పోడు భూములు కేటాయించిన విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు.
గతంలో చేపట్టిన పోడు భూముల పంపిణీపై నివేదిక సమర్పించాలని అటవీశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. పోడు భూముల సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ఇదే ప్రాథమిక సమావేశమని భావిస్తున్నామన్నారు. ఛత్తీసగఢ్ నుంచి వస్తున్న గిరిజనులు అటవీ భూములను ఆక్రమించుకుంటున్న విషయాన్ని అధికారులు వివరించగా.. భవిష్యత్‌లో ఇలాంటి వలసలు కొనసాగకుండా కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి కచ్చితమైన మార్గదర్శకాలను రూపొందించాలని, ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడాలని ఆదేశించారు. కాగా, తమపై దాడులకు దిగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ జూనియర్ అటవీ అధికారుల సంఘం ప్రతినిధులు మంత్రి కొండా సురేఖను కోరారు. ఈ మేరకు ఆమె స్పందిస్తూ.. కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని, సిబ్బందికి ఏ సాయం కావాలన్నా సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు.