Seethakka: కేటీఆర్ చెల్లికి దేవతా రూపంతో.. తెలంగాణ తల్లిని ప్రజలపై రుద్దారు
ABN , Publish Date - Dec 10 , 2024 | 03:47 AM
బీఆర్‌ఎస్ హయాంలో మాజీ మంత్రి కేటీఆర్ చెల్లెలుకు దేవతా రూపం ఇస్తే ఎలా ఉంటుందో అలాంటి విగ్రహాన్ని తయారు చేసి తెలంగాణ ప్రజలపై రుద్దారని మంత్రి సీతక్క మండిపడ్డారు.
పదేళ్లు విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు?: సీతక్క
హైదరాబాద్, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ హయాంలో మాజీ మంత్రి కేటీఆర్ చెల్లెలుకు దేవతా రూపం ఇస్తే ఎలా ఉంటుందో అలాంటి విగ్రహాన్ని తయారు చేసి తెలంగాణ ప్రజలపై రుద్దారని మంత్రి సీతక్క మండిపడ్డారు. విగ్రహాన్ని మారుస్తున్నారంటూ.. సొంత ఎజెండాతో బీఆర్‌ఎస్, బీజేపీ రాజకీయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని, అప్పుడు బీజేపీ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డల ఆస్తిత్వానికి అనుగుణంగా తాము విగ్రహాన్ని రూపొందిస్తే విమర్శిస్తారా అని నిలదీశారు. దళిత బిడ్డ రచించిన ‘జయజయహే తెలంగాణ’ను రాష్ట్ర గీతం చేయాలనే సోయి గత సర్కారుకు ఎందుకు రాలేదన్నారు. తాము చేస్తుంటే మాత్రం అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఉద్యమ కాలంలో టీజీ అని.. రాష్ట్రం వచ్చాక టీఆర్‌ఎస్ పేరు కలిసొచ్చేలా టీఎస్ అని మార్చారని ఆరోపించారు. ‘‘రాష్ట్ర మహిళలు మట్టి బిడ్డలు, గట్టి బిడ్డలు. ఆ శ్రామికతకు ప్రతిరూపంగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించాం. దానిని చూస్తుంటే అక్కాచెల్లెళ్లను చూసినట్లే ఉంది. విగ్రహ మార్పులో ఎలాంటి రాజకీయం లేదు. పార్లమెంటులో సోనియాను ప్రధాని మోదీ అవమానించారు. తల్లిని చంపి, బిడ్డను బతికించారంటూ తెలంగాణ ఏర్పాటును ఎద్దేవా చేశారు. అప్పుడు బీజేపీ వాళ్లు ఎందుకు మాట్లాడలేదు. బీఆర్‌ఎస్ శాసనసభ వెలుపల, బీజేపీ సభ లోపల గొడవ చేస్తున్నాయి. ఆ రెండూ ఒక్కటే’నంటూ సీతక్క మండిపడ్డారు.
నాడు ధనిక రాష్ట్రం.. అందుకే ధనవంతురాలిగా..
తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించిందని, అందుకే నాటి విగ్రహం ధనికంగా కనిపించిందని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ రాష్ట్రాన్ని అప్పుల పాల్జేయడంతో ఇప్పటి తెలంగాణ తల్లి పేదల తల్లిగా ఉందని ప్రజలు అనుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా తెలంగాణ తల్లి విగ్రహాలను మారుస్తారా అని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ప్రశ్నించారు. .
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
బీజేపీ సభ్యులు పదేపదే అడ్డుకునే ప్రయత్నం చేయడంతో సభలో కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంచార్జి మంత్రి, జిల్లా కలెక్టర్ ప్రొటోకాల్ పాటించడం లేదంటూ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ప్రివిలెజ్ కమిటీకి 8 నెలల క్రితమే ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పందించిన శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు.. తప్పకుండా న్యాయం చేస్తామని, స్పీకర్‌తో మాట్లాడతామని తెలిపారు.