Share News

Tummala Nageswara Rao: రైతుల సమస్యలను బీజేపీ ఎన్నడైనా పట్టించుకుందా?

ABN , Publish Date - Oct 01 , 2024 | 04:19 AM

రుణమాఫీపై కొందరు బీజేపీ నాయకుల మాటలు చూస్తుంటే.. ‘వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి కాశీకి వెళ్లిన’ చందంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Tummala Nageswara Rao: రైతుల సమస్యలను బీజేపీ ఎన్నడైనా పట్టించుకుందా?

  • ఆ పార్టీ నేతల మాటలు చూస్తుంటే.. వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి కాశీకి వెళ్లినట్లుంది

  • మాఫీపై సందేహాలుంటే నివృత్తి చేసుకోండి

  • రైతును గందరగోళం చెయ్యొద్దు: తుమ్మల

హైదరాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రుణమాఫీపై కొందరు బీజేపీ నాయకుల మాటలు చూస్తుంటే.. ‘వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి కాశీకి వెళ్లిన’ చందంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 2022కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. ఆదాయాన్ని రెట్టింపు చేయకపోగా గత పదేళ్లలో పెరిగిన ఖర్చులతో పోల్చుకుంటే నికర ఆదాయం కూడా పెరగలేదని చెప్పారు. స్వామినాథన్‌ కమిటీ సిఫారసులను అమలు చేసి, ఆదుకోవాలంటూ రాజధానిలో రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపిన రైతుల సమస్యలను ఎప్పుడైనా పట్టించుకున్నారా? అని బీజేపీ నేతలను నిలదీశారు.


బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క చోటైనా రుణమాఫీ చేసి చూపించగలరా? కొన్ని లక్షల కోట్లు ఎగ్గొట్టిన పారిశ్రామిక వేత్తల నుంచి నిధులు రికవరీ చేసి దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేయగల నిబద్ధత బీజేపీకి ఉందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించే బాధ్యత తమదేనన్నారు. ఇప్పటికే సన్న వడ్లకు రూ.500 బోనస్‌ ప్రకటించామని.. పంటలన్నింటినీ మద్దతు ధరతోనే కొనుగోలు చేసే విధంగా కృషి చేస్తున్నామని తుమ్మల తెలిపారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రుణమాఫీలో అక్కడక్కడా ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించుకుంటూ అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి వర్తింపచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.


దీనిపై సందేహాలుంటే బీజేపీ పెద్దలు స్వయంగా వచ్చి నివృత్తి చేసుకోవాలని, రైతాంగాన్ని గందరగోళంలోకి నెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు మాఫీ అందనివారి వివరాలన్నీ వచ్చిన తర్వాత మొదట రూ.2 లక్షలలోపు రుణం ఉన్న కుటుంబాలకు, తర్వాత 2 లక్షలకు పైన మిగిలి ఉన్న కుటుంబాలకు షెడ్యూలు ప్రకటించి మాఫీ చేస్తామని చెప్పారు. కాగా, కేంద్రం అందిస్తున్న పీఎం-కిసాన్‌ పథకంలో ఆర్ధిక సాయాన్ని పెంచాలని, ఏడాదికి రూ.6 వేలు కాకుండా ఎకరానికి రూ.7,500 అందిస్తే రైతులు రుణపడి ఉంటారని పేర్కొన్నారు.


  • రాష్ట్ర రైతులకు రూ.2 లక్షల కోట్ల నష్టం..

రైతులకు కనీస మద్దతు ధర హామీని కేంద్రం అమలు చేయకపోవడంతో తెలంగాణ రైతులు గత తొమ్మిదేళ్లలో రూ.2 లక్షల కోట్లు నష్టపోయారని తుమ్మల ఆరోపించారు. కేంద్రం నాఫెడ్‌ ద్వారా పప్పుధాన్యాలు, నూనె గింజలను తక్కువగా సేకరిస్తోందని, పైగా వాటిని ఏటా సేకరించడం లేదని చెప్పారు. రైతు ఉద్యమం సందర్భంగా అమరులైన 708 మందికి పైగా రైతు కుటుంబాలకు తక్షణ పరిహారం చెల్లించి, రైతుల డిమాండ్లు పరిష్కరించే విధంగా ప్రయత్నాలు చేయాలని బీజేపీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Oct 01 , 2024 | 04:19 AM