Share News

Akbaruddin: సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయండి

ABN , Publish Date - Jul 30 , 2024 | 03:45 AM

రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని, లేదంటే ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ శాఖ పే రులో ప్రొహిబిషన్‌ పదాన్ని తొలగించాలని మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ డిమాండ్‌ చేశారు. మద్యపానాన్ని నిషేధించాలనే చిత్తశుద్ధి లేనప్పుడు శాఖ పేరులో ‘ప్రొహిబిషన్‌’ అనే పదం ఎందుకని ప్రశ్నించారు.

Akbaruddin: సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయండి

  • లేదంటే ఆ శాఖ పేరులో ‘ప్రొహిబిషన్‌’ను తీసేయండి

  • రాత్రి వేళ పోలీసుల జులుంపై పిల్‌ వేస్తా

  • అసెంబ్లీలో మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌

హైదరాబాద్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని, లేదంటే ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ శాఖ పే రులో ప్రొహిబిషన్‌ పదాన్ని తొలగించాలని మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ డిమాండ్‌ చేశారు. మద్యపానాన్ని నిషేధించాలనే చిత్తశుద్ధి లేనప్పుడు శాఖ పేరులో ‘ప్రొహిబిషన్‌’ అనే పదం ఎందుకని ప్రశ్నించారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌కు డ్రగ్స్‌, గంజాయి ఎక్కడ్నుంచి వస్తున్నాయో పోలీసులకు తెలుసని, నిజంగా వారికి నిర్మూలించాలనే ఉద్దేశం ఉంటే ఒక్క రోజు సరిపోతుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో లాఅండ్‌ఆర్డర్‌ అదుపు తప్పిందని, నేరాల రేటు పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.


పోలీసులు నేరాలు చేసే వారిని పట్టుకోకుండా... సామాన్యులను విచారించడం, కొట్టడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌కు మామూళ్లు వెళ్తున్నాయని, ఈ విషయమై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. పాతబస్తీతోపాటు ఇతర ప్రాంతాల్లో అర్ధరాత్రి వేళ పోలీసుల జులుంపై కోర్టులో పిల్‌ దాఖలు చేస్తామన్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా నీలోఫర్‌ కేఫ్‌ తెరిచే ఉంటుందని, సిటీ కమిషనర్‌కు చాయ్‌, బిస్కట్లు వెళ్తున్నందునే దాన్ని మూసివేయడం లేదని ధ్వజమెత్తారు. మెట్రోతోపాటు ఎంఎంటీఎస్‌ సెకండ్‌ ఫేజ్‌నూ తీసుకొస్తే పాతబస్తీ పేదలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరిస్తే జీహెచ్‌ఎంసీకి కనీసం రూ.10 వేల కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు.

Updated Date - Jul 30 , 2024 | 03:45 AM