Share News

HYderabad: ..వానొచ్చింది!

ABN , Publish Date - Jun 28 , 2024 | 04:25 AM

రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొద్దిరోజులుగా ముఖం చాటేసిన వరుణుడు కరుణించడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సాగు పనులు ఊపందుకోనున్నాయి. తొలకరి వానలకు నాటిన పత్తి విత్తనాలు మొలకెత్తకపోవడంతో పలు చోట్ల మళ్లీ విత్తేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.

HYderabad: ..వానొచ్చింది!

  • రాష్ట్రంలో వర్షాలతో రైతుల్లో ఆనందం

  • ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పలుచోట్ల 10 సెం.మీ.పైనే నమోదు

  • కుంటాల, పొచ్చెర జలపాతాల పరవళ్లు

  • మేడిగడ్డకు 8,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొద్దిరోజులుగా ముఖం చాటేసిన వరుణుడు కరుణించడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సాగు పనులు ఊపందుకోనున్నాయి. తొలకరి వానలకు నాటిన పత్తి విత్తనాలు మొలకెత్తకపోవడంతో పలు చోట్ల మళ్లీ విత్తేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. గురువారం ఉమ్మడి కరీంనగర్‌తో పాటు నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో వానలు పడ్డాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమై ఇళ్లలోకి వరద చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ మోస్తరు వర్షం పడటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో వాహనదారులు సతమతమయ్యారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పలుచోట్ల 10 సెం.మీ.కు పైనే వర్షపాతం నమోదైంది.


జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో 10.6, అదే జిల్లా మల్యాలలో 10.5, రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో 10.4, కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో 10.1, అదే జిల్లా గన్నేరువరంలో 7.9, ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌లో 7.8 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలలో వెంగల్‌చెరువు మత్తడి దూకింది. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం బుగ్గగూడలో పిడుగు పాటు గిరిజన రైతు ఏదుల మల్లేశ్‌ ఎద్దు మృతి చెందింది. ఆసిఫాబాద్‌లో గంట పాటు కురిసిన వర్షానికి వరద నీరు రోడ్లపై నిలిచిపోయింది. మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాలలో ఇళ్ల మధ్య వర్షపు నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మల్యాల మండలం రాంపూర్‌ శివారులో రహదారి కోతకు గురైంది. జగిత్యాల జిల్లా సూరంపేటలో కురిసిన వర్షానికి వరి నారుమళ్లలో ఇసుక మేటలు పెట్టింది. ఇటు ఆదిలాబాద్‌ జిల్లాలోని కుంటాల, పొచ్చెర జలపాతాలు వర్షపు నీటితో పరవళ్లు పెడుతున్నాయి.


మేడిగడ్డకు 8,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

మేడిగడ్డ బ్యారేజీకి ప్రాణహిత నుంచి వచ్చే వరద క్రమంగా పెరుగుతోంది. రెండ్రోజుల వరకు బ్యారేజీలోకి వచ్చే ఇన్‌ఫ్లో 4వేల క్యూసెక్కులుండగా గురువారం సాయంత్రానికి 8,800క్యూసెక్కులకు పెరిగింది. మేడిగడ్డ బ్యారేజీలోని కుంగిన 7వ బ్లాకులో చేపట్టిన మరమ్మతులకు సంబంధించి షీట్‌ఫైల్స్‌, సీసీ బ్లాకుల పునరుద్ధరణ పూర్తవగా దెబ్బతిన్న 20వ గేటు తొలగింపు పనులు 95 శాతం అయిపోయాయి. గ్రౌటింగ్‌ పనులు పూర్తయినప్పటికీ వాటి కోసం చేసిన రంధ్రాలను మూసివేయాల్సి ఉన్నట్లు తెలిసింది. మేడిగడ్డతో పాటు అన్నారం బ్యారేజీలో మట్టి నమూనాల సేకరణ కోసం చేపట్టిన డ్రిల్లింగ్‌ పనులు మరో మూడ్రోజులపాటు కొనసాగనున్నాయి.

Updated Date - Jun 28 , 2024 | 04:25 AM