SLBC Project: మళ్లీ పట్టాలపైకి ఎస్‌ఎల్‌బీసీ
ABN , Publish Date - Apr 19 , 2024 | 08:07 AM
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ)(SLBC) టన్నెల్ ప్రాజెక్టు(Tunnel Project) పనులను వచ్చే నెల నుంచి పట్టాల మీదికి ఎక్కించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఔట్‌లెట్ వైపు ఉన్న టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం)లో(TBM) బేరింగులు పాడైపోవడంతో..
నిధుల్లేక 19 నెలలుగా నిలిచిన పనులు
ఇటీవలే రూ.50 కోట్లు విడుదల
వచ్చే నెల నుంచి టన్నెల్ తవ్వకాలు
హైదరాబాద్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ)(SLBC) టన్నెల్ ప్రాజెక్టు(Tunnel Project) పనులను వచ్చే నెల నుంచి పట్టాల మీదికి ఎక్కించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఔట్‌లెట్ వైపు ఉన్న టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం)లో(TBM) బేరింగులు పాడైపోవడంతో వాటి మరమ్మతులతోపాటు ఇన్‌లెట్ వైపు తవ్వకాల పనులకు రూ.50 కోట్లు విడుదల చేయాలని నిర్మాణ సంస్థ కోరిన మేరకు ప్రభుత్వం(Telangana Government) నిధులను విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. 19 నెలలుగా బిల్లులు పెండింగులో ఉండటంతో ఎస్‌ఎల్‌బీసీ పనులు నిలిచిపోయాయి. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాజెక్టులపై సమీక్ష జరిపి, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులకు ప్రాధాన్యత ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ ప్రాజెక్టు పనులకు అవరోధాలు ఏమున్నాయో గుర్తించి, వాటి పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులతో కమిటీని నియమించారు. ఆ కమిటీ సమీక్ష జరిపి ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనాలను రూ.3,150 కోట్ల నుంచి రూ.4,468 కోట్లకు పెంచాలని, ఇన్‌లెట్ నుంచి లీకేజీలు, ఔట్‌లెట్ వైపు గట్టి రాయి ఉండటంతో.. దీనిపై భూగర్భ శాస్త్రవేత్తల సహకారం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఔట్‌లెట్ వైపు ఉన్న టీబీఎం బేరింగుల కోసం తొలుత రూ.50 కోట్లను విడుదల చేస్తే.. అక్టోబరు కల్లా మరమ్మతులు పూర్తిచేసుకొని, టీబీఎం సిద్ధమవుతుందని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం రూ.50 కోట్లను ఇటీవల విడుదల చేయటంతో ఔట్‌లెట్ టీబీఎంకు మరమ్మతులతోపాటు ఇన్‌లెట్ (శ్రీశైలం) వైపు తవ్వకాలు జరపటానికి మార్గం సుగమమైంది. కాగా, అక్టోబరు నుంచి ఇన్‌లెట్ (శ్రీశైలం), ఔట్‌లెట్ (మన్నెవారిపల్లి-అచ్చంపేట) వైపుల నుంచి ఏకకాలంలో టన్నెల్‌ను తవ్వే ప్రక్రియను చేపడతామని నిర్మాణ సంస్థ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. ఇక రెండువైపులా డీ వాటరింగ్‌తో పాటు ఇతరత్రా అవసరాల కోసం వినియోగించుకున్న కరెంటుకు నిర్మాణ సంస్థ దక్షిణ డిస్కమ్ (టీఎస్ ఎస్పీడీసీఎల్)కు రూ.63.50 కోట్ల బకాయి ఉందని గుర్తించారు. కరెంట్ బిల్లుల కోసం అవసరమైన నిధులను కూడా త్వరలో విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. సవరించిన ప్రాజెక్టు అంచనా వ్యయానికి కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను సొరంగం ద్వారా తరలించడానికి వీలుగా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టును రూ.2,298 కోట్ల అంచనా వ్యయంతో 2005లో చేపట్టారు. అనంతరకాలంలో అంచనా వ్యయం మారుతూ వచ్చింది. ప్రాజెక్టులో భాగంగా మొత్తం 43.93 కి.మీ. టన్నెల్ తవ్వాల్సి ఉంది. ఇప్పటిదాకా 34.37 కి.మీ.ల మేర పూర్తయింది. మిగిలిన 9.56 కి.మీ.లు తవ్వితే గ్రావిటీతో నీటిని ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 లక్షల ఎకరాలకు సాగునీటిని, 516 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు తాగునీటిని అందించటానికి వీలవుతుంది.
ఇవికూడా చదవండి:
టికెట్ ఇస్తే బీజేపీలోకి వచ్చేస్తా..