Share News

Neethu Bai: ఈ కిలాడీ లేడి.. మహా ముదురు.. టార్గెట్ ఫిక్స్ చేస్తే ...

ABN , Publish Date - Dec 21 , 2024 | 04:55 AM

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల జీతాలు నెలకు రూ.50 వేల నుంచి ఉన్నతస్థాయిలో ఉన్నవారికైతే రూ.10 లక్షల దాకా ఉంటాయి! పాతికేళ్లు కష్టపడి చదువుకొని 30 ఏళ్ల కష్టపడ్డ ఐఏఎస్‌, ఐపీఎ్‌సల జీతం కూడా నెలకు రూ.5 లక్షల్లోపే!!

Neethu Bai: ఈ కిలాడీ లేడి.. మహా ముదురు.. టార్గెట్ ఫిక్స్ చేస్తే ...

గంజాయి డాన్‌ నీతూబాయ్‌ అసాధారణ దందా.. రోజుకు దాదాపు 20 కేజీల గంజాయి విక్రయం

  • పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులకు లక్షల్లో లంచాలు!

  • పట్టుబడితే బెయిల్‌ కోసంప్రత్యేక లీగల్‌ టీమ్‌

  • ఆమెపై తూతూ మంత్రంగా కేసుల నమోదు

  • అర కేజీ, కేజీ మాత్రమే సీజ్‌ చేసినట్లు రికార్డులు

  • మరో దూల్‌పేటగా మారిన నానక్‌రామ్‌గూడ

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల జీతాలు నెలకు రూ.50 వేల నుంచి ఉన్నతస్థాయిలో ఉన్నవారికైతే రూ.10 లక్షల దాకా ఉంటాయి! పాతికేళ్లు కష్టపడి చదువుకొని 30 ఏళ్ల కష్టపడ్డ ఐఏఎస్‌, ఐపీఎ్‌సల జీతం కూడా నెలకు రూ.5 లక్షల్లోపే!! కానీ.. హైదరాబాద్‌ గచ్చిబౌలి నానక్‌రామ్‌గూడ ప్రాంతంలో గంజాయి డాన్‌గా పేరొందిన నీతూబాయ్‌ నెలవారీ సంపాదన ఎంతో తెలుసా? అక్షరాలా కోటి రూపాయలు!! ఎక్సైజ్‌ ఉన్నతాధికారుల విచారణలో తేలిన విషయమిది! గంటకు సగటున 80 మంది కస్టమర్ల చొప్పున.. రోజుకు 15-20 కేజీల గంజాయి విక్రయిస్తున్న నీతూబాయ్‌ కుటుంబం తక్కువలో తక్కువ రూ.3.5లక్షలు సంపాదిస్తోంది. కొన్ని నెలల క్రితం ఎక్సైజ్‌ పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్‌ దూల్‌పేట’ నేపథ్యంలో.. నీతూబాయ్‌ దందా గురించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దూల్‌పేటకు వచ్చే గంజాయిలో సింహభాగం నానక్‌రామ్‌గూడలోని ఆమె అడ్డాకే చేరుతున్నట్లు వారి విచారణలో తేలింది. ఆమె దందాపై ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు ప్రత్యేక టీమ్‌తో నిఘాపెట్టగా.. 15 నిమిషాల్లోనే 20 మంది కస్టమర్స్‌ గంజాయి కోసం వచ్చినట్లు వెల్లడైంది. ఇంత పెద్ద ఎత్తున గంజాయి దందా జరుగుతున్నా.. నానక్‌రామ్‌గూడ మరో దూల్‌పేటగా తయారైనా.. మామూళ్ల మత్తులో జోగుతున్న అక్కడి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై ఎక్సైజ్‌, పోలీస్‌ ఉన్నతాధికారులు తీవ్ర అసహనం వ్యక్తంచేసినట్లు సమాచారం.


నానక్‌రామ్‌గూడకు చెందిన నీతూబాయ్‌, మధుబాయ్‌ అత్తాకోడళ్లు. వీరికి దూల్‌పేటలో గంజాయి విక్రయించే కుటుంబాలతో సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో అత్తాకోడళ్లు ఇద్దరూ ఇతర ప్రాంతాలకు గంజాయి సరఫరా చేయడం, విక్రయించడం మొదలుపెట్టారు. గంజాయి కేసుల్లో పట్టుబడి నీతూబాయ్‌ గతంలో రెండు, మూడుసార్లు జైలుకెళ్లినా.. తిరిగొచ్చాక మళ్లీ అదే పని చేసేది. దీంతో 2021లో శేరిలింగంపల్లి ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ అధికారులు ఆమెపై పీడీ యాక్టు నమోదు చేశారు. 2022 అక్టోబర్‌లో జైలు నుంచి విడుదలైన నీతూబాయ్‌ మళ్లీ అదే దందాను మొదలుపెట్టింది. ఈసారి పక్కా ప్రణాళిక ప్రకారం తన కుటుంబసభ్యులనూ రంగంలోకి దించింది. ప్లాన్‌లో భాగంగా నానక్‌రామ్‌గూడలో రెండు కిరాణా దుకాణాలను ఏర్పాటు చేసింది. ఒక దుకాణాన్ని ఆమె కొడుకు కళాపతి గౌతమ్‌ సింగ్‌ నడుపుతుండగా.. మరొక దుకాణాన్ని ఆమె అత్త మదుబాయ్‌ నడుపుతోంది. కళాపతిసింగ్‌ దూల్‌పేటకు వెళ్లి కేజీ రూ.8 వేల చొప్పున 20 కేజీల గంజాయి కొనుగోలు చేసి గుట్టుగా తన కిరాణా దుకాణానికి తరలిస్తాడు. ఆ గంజాయిని పదేసి గ్రాముల చొప్పున చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి.. ఒక్కో ప్యాకెట్‌నూ రూ.250 చొప్పున వారు తమ దుకాణాల్లో విక్రయించేవారు. అంటే రూ.8 వేలకు కొని.. రూ.25 వేలకు అమ్ముతున్నట్టు! ఒక్కో కిలోపై రూ.17 వేల లాభం. రోజుకు 20 కేజీల గంజాయి అంటే.. దాదాపుగా రూ.3.4 లక్షలు!! ఏడాది క్రితం కళాపతి సింగ్‌ను అరెస్టు చేసిన టీ న్యాబ్‌ పోలీసులు.. వారి సంపాదనను చూసి అవాక్కయ్యారు. గంజాయి డబ్బులతో గాంధీనగర్‌లో జీ+2 ఇల్లు, లంగర్‌హౌజ్‌, గచ్చిబౌలిలో రెండు పెద్ద పెద్ద జీ+2 ఇండ్లు, రెండు కార్లు, రెండు ద్విచక్రవాహనాలు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. వాటితో పాటు.. 16 బ్యాంకు ఖాతాల్లో నిల్వ ఉన్న రూ. 1.53 కోట్లు ఫ్రీజ్‌ చేశారు. మొత్తం స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ. 5.2 కోట్లు.


లక్షల్లో మామూళ్లు..

నీతూ సామ్రాజ్య విస్తరణకు ఎక్సైజ్‌, లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు పూర్తి సహకారం అందించినట్లు తెలుస్తోంది. అందుకు ప్రతిఫలంగా ఆమె వద్ద నుంచి ప్రతి నెలా ఎక్సైజ్‌ శాఖ అధికారులతోపాటు.. లా అండ్‌ ఆర్డర్‌ పెట్రోలింగ్‌ పోలీసులు రూ.లక్షల్లో మామూళ్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఎప్పుడైనా ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వస్తే నామమాత్రంగా కేసులు నమోదు చేస్తున్న పోలీసులు.. కేవలం అరకిలో, కేజీ గంజాయి మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు రికార్డులో చూపిస్తున్నారు. దాంతో నిందితులు 10-15 రోజుల్లోనే బెయిల్‌పై బయటకు రావడానికి వీలవుతోంది. అంతేకాదు.. దాడులు జరిగే సమయంలో నీతూబాయ్‌ పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు పెట్రోలింగ్‌ పోలీసులు ఒక కిలోమీటర్‌ ముందు నుంచే సైరన్‌ వేస్తారని, ఆ సిగ్నల్‌తో నీతూబాయ్‌ కుటుంబం, కస్టమర్లు అప్రమత్తమై అక్కణ్నుంచీ తప్పించుకుంటారు. ఒకవేళ పట్టుబడి జైలుకు వెళ్లినా.. నీతూబాయ్‌ను వీలైనంత తక్కువ సమయంలో బయటకు తీసుకొచ్చేందుకు, జప్తు చేసిన ఆస్తులను విడిపించడానికి ఆమె ఏకంగా ప్రత్యేక లీగల్‌ టీమ్‌నే ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది.

Updated Date - Dec 21 , 2024 | 08:05 AM