Share News

Medigadda: మేడిగడ్డలో పరీక్షలకు అంతరాయం..

ABN , Publish Date - Jul 13 , 2024 | 04:55 AM

మేడిగడ్డ బ్యారేజీ వద్ద జియో ఫిజికల్‌, జియో టెక్నికల్‌ పరీక్షలు (ఇన్వెస్టిగేషన్లు) అర్ధంతరంగా ఆగిపోయాయి. ప్రాణహితకు వరద క్రమేణా పెరుగుతుండటంతో పరీక్షలను నిపుణుల కమిటీ నిలిపివేసింది.

Medigadda: మేడిగడ్డలో పరీక్షలకు అంతరాయం..

  • ప్రాణహితకు వరదలతో తీవ్ర ఆటంకం

  • నిపుణులతో నీటి పారుదల శాఖ భేటీ

  • తదుపరి చేపట్టాల్సిన చర్యలపై చర్చలు

  • ఎన్‌డీఎస్‌ఏ నిపుణులను కలవాలని నిర్ణయం

హైదరాబాద్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): మేడిగడ్డ బ్యారేజీ వద్ద జియో ఫిజికల్‌, జియో టెక్నికల్‌ పరీక్షలు (ఇన్వెస్టిగేషన్లు) అర్ధంతరంగా ఆగిపోయాయి. ప్రాణహితకు వరద క్రమేణా పెరుగుతుండటంతో పరీక్షలను నిపుణుల కమిటీ నిలిపివేసింది. మరోవైపు, జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) ఇచ్చిన మధ్యంతర నివేదిక మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద చేపట్టిన పనులపై శుక్రవారం జలసౌధలో నిర్మాణ సంస్థలు, పరీక్షలు చేసే ఏజెన్సీల ప్రతినిధులతో ఎన్‌డీఎ్‌సఏ నిపుణుల కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా నీటి పారుదలశాఖ ఈఎన్‌సీ బి.నాగేందర్‌రావు మధ్యంతర నివేదిక అమలు పురోగతిని వివరించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా ఎన్‌డీఎ్‌సఏ సూచించిన అత్యవసర మరమ్మతులను పూర్తి చేశామని వెల్లడించారు.


మేడిగడ్డలో జియో టెక్నికల్‌, జియో ఫిజికల్‌ పరీక్షలు ఎక్కడిదాకా వచ్చాయని కమిటీ ఆరా తీయగా.. పరీక్షల కోసం బోర్‌ హోల్స్‌ వేస్తుండగా ఇసుకతోపాటు నీరు బయటికి వస్తుందని ఆయా ఏజెన్సీల ప్రతినిధులు వివరించారు. ఎన్‌డీఎ్‌సఏ నివేదిక ప్రకారం పూర్తిస్థాయిలో బోర్‌హోల్స్‌ వేయలేకపోయామని నివేదించారు. పరీక్షల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులు ఎలా అధిగమించాలన్న అంశంపై చర్చించడానికి వచ్చే వారం ఢిల్లీకి వెళ్లి ఎన్డీఎ్‌సఏ నిపుణుల కమిటీతో సమావేశం కావాలని నీటి పారుదల శాఖ అధికారుల బృందం నిర్ణయించింది.


అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేయాలా? వద్దా? అనే అంశంపై ఎన్‌డీఎ్‌సఏ అభిప్రాయం తీసుకోనుంది. ఈ రెండు బ్యారేజీల్లో నీటిని నిల్వ చేసి, పంపింగ్‌ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఎన్‌డీఎ్‌సఏ అనుమతినిస్తే ప్రాణహితకు వరదలు వచ్చే సమయంలో కన్నెపల్లి(మేడిగడ్డ) పంప్‌హౌస్‌ నుంచి అన్నారంలోకి నీటిని ఎత్తిపోయాలని యోచిస్తోంది.

Updated Date - Jul 13 , 2024 | 04:55 AM