Share News

Nirmal: ‘ఈ బువ్వ తినుడు వశమైతలేదే.. తీస్కపో’

ABN , Publish Date - Dec 29 , 2024 | 03:39 AM

‘ఈ బువ్వ తినుడు వశమైతలేదే.. ఓ రోజు మాడిన అన్నం పెట్టిన్రు.. ఇంకో రోజు అన్నంలో పురుగులు వచ్చాయి. భయమైతాంది. నన్ను ఇంటికి తీసుకుపో’.. నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌లోని కేజీబీవీ పాఠశాల విద్యార్థులు ఇటీవల తమ తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడుతున్న మాటలివి.

Nirmal: ‘ఈ బువ్వ తినుడు వశమైతలేదే.. తీస్కపో’

  • అమ్మానాన్నలకు దిలావర్‌పూర్‌ కేజీబీవీ విద్యార్థినుల ఫోన్లు

  • మాడిన, పురుగుల అన్నం పెడుతున్నారని ఆవేదన.. భయంతో పిల్లలను ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు

దిలావర్‌పూర్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : ‘ఈ బువ్వ తినుడు వశమైతలేదే.. ఓ రోజు మాడిన అన్నం పెట్టిన్రు.. ఇంకో రోజు అన్నంలో పురుగులు వచ్చాయి. భయమైతాంది. నన్ను ఇంటికి తీసుకుపో’.. నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌లోని కేజీబీవీ పాఠశాల విద్యార్థులు ఇటీవల తమ తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడుతున్న మాటలివి. కొద్ది రోజులుగా సరైన భోజనం లేక వారంతా అర్ధాకలితో అల్లాడిపోతున్నారు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి శనివారం తమ పిల్లలను తీసుకెళ్లిపోయారు. పాఠశాలలో 360 మంది విద్యార్థినులు ఉండగా వారిలో 210 మంది తల్లిదండ్రులతో కలిసి స్వగ్రామాలకు వెళ్లిపోయారు. మిగిలిన వాళ్లు కూడా నేడో రేపో వెళ్లిపోయే అవకాశం ఉంది. నిజానికి, సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తుండడంతో కొద్ది రోజులుగా పాఠశాలలో తరగతులు జరగడం లేదు. కానీ, విద్యార్థులు తమలో తామే కలిసి చదువుకుంటున్నారు. ఈ లోగా బోధనేతర సిబ్బంది కూడా సమ్మె బాట పట్టారు.


అయితే, ఆహారం విషయంలో విద్యార్థులు ఇబ్బంది పడకూడదని అధికారులు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. కానీ, కొత్తగా వచ్చిన వంట సిబ్బంది చేస్తున్న వంటను తినలేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. మూడు రోజులుగా అర్ధాకలితో గడుపుతున్నారు. కొత్త సిబ్బంది ఉదయం అల్పాహారాన్ని పదిన్నర గంటలకు ఇస్తున్నారని, అది కూడా అరకొరగా వడ్డిస్తున్నారని విద్యార్థినులు చెబుతున్నారు. ఇక, గురువారం మాడిపోయిన అన్నం వడ్డించారని, శుక్రవారం వడ్డించిన అన్నంలో తోక పురుగులు వచ్చాయని, శనివారం బొద్దింక వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ పక్క తరగతులు జరగక, మరోపక్క సరైన ఆహారం లేకపోవడంతో విద్యార్థినులు తల్లిదండ్రులకు ఫోన్లు చేశారు. దీంతో శనివారం పాఠశాలకు వచ్చి తమ పిల్లలను తీసుకెళ్లారు. అక్కడే ఉన్న తహసీల్దార్‌ స్వాతి వారికి నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. పిల్లల ప్రాణాల కన్నా చదువు ముఖ్యం కాదంటూ పలువురు తల్లిదండ్రులు వాపోయారు.

Updated Date - Dec 29 , 2024 | 03:39 AM