Share News

Srinivas Goud: నిజామాబాద్‌ ప్రవాసీకి యూఏఈ ఐకాన్‌ అవార్డు

ABN , Publish Date - Oct 04 , 2024 | 04:01 AM

దుబాయిలోని వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో విజయవంతంగా ఎదుగుతున్న భారతీయులకు ఏటా ప్రదానం చేసే యూఏఈ ఐకాన్‌ అవార్డుల్లో ఈసారి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన రాచకొండ శ్రీనివాస్‌ గౌడ్‌కు పురస్కారం దక్కింది.

Srinivas Goud: నిజామాబాద్‌ ప్రవాసీకి యూఏఈ ఐకాన్‌ అవార్డు

ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి: దుబాయిలోని వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో విజయవంతంగా ఎదుగుతున్న భారతీయులకు ఏటా ప్రదానం చేసే యూఏఈ ఐకాన్‌ అవార్డుల్లో ఈసారి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన రాచకొండ శ్రీనివాస్‌ గౌడ్‌కు పురస్కారం దక్కింది. దుబాయిలోని ఒక సంస్థ, ఇండియా టుడే గ్రూప్‌ సంయుక్తంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో శ్రీనివాస్‌ గౌడ్‌కు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియా టుడే ప్రతినిధులు, భారతీయ వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు.


నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం గడ్కోలు గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ గౌడ్‌.. బ్యాంకింగ్‌ రంగంలో అంచెలంచెలుగా ఎదిగి స్విట్జర్లాండ్‌లోని ఓ ప్రపంచ ప్రఖ్యాత బ్యాంకింగ్‌ సంస్థలో పెట్టుబడుల సలహాదారు స్థాయికి చేరారు. ఆ తర్వాత ఆయన సొంతంగా పెట్టుబడుల సలహాలతోపాటు బ్యాంకులకు సాంకేతిక సేవలందించే మెంసా అనే సంస్థను దుబాయిలో నెలకొల్పారు. ఈ సంస్థ దుబాయితోపాటు ప్రపంచంలోని అనేక దేశాల్లోని బ్యాంకులకు సాంకేతిక సేవలందిస్తోంది. దుబాయిలోని తెలుగు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనే శ్రీనివాస్‌ గౌడ్‌ అవార్డు అందుకున్న సందర్భంగా ఆయనను పలువురు తెలుగు ప్రముఖులు అభినందించారు.

Updated Date - Oct 04 , 2024 | 04:01 AM