Medical Education: వైద్యవిద్యలో కొత్త పీజీ కోర్సులు
ABN , Publish Date - Aug 24 , 2024 | 03:47 AM
వైద్యవిద్యలో కొత్తగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు ప్రారంభించేందుకు అవసరమైన మార్గదర్శకాలను జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) శుక్రవారం విడుదల చేసింది.
మార్గదర్శకాలు విడుదల చేసిన ఎన్‌ఎంసీ
ఆస్పత్రుల్లో ఏడాదంతా 80 శాతం బెడ్ ఆక్యుపెన్సీ తప్పనిసరి
హైదరాబాద్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): వైద్యవిద్యలో కొత్తగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు ప్రారంభించేందుకు అవసరమైన మార్గదర్శకాలను జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) శుక్రవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా ‘‘మినిమమ్ స్టాండర్డ్ రిక్వైర్‌మెంట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్-2024’’ విధివిధానాలను తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాలను పీజీ వైద్యవిద్య బోర్డు ఖరారు చేసిందని పేర్కొంది.
పీజీ కోర్సులను ప్రారంభించాలనుకునే వైద్య సంస్థలు, మెడికల్ కాలేజీలు తప్పనిసరిగా సంబంధిత సంస్థలు, అధికారుల నుంచి అవసరమైన అన్నిరకాల అనుమతులు పొంది ఉండాలని ఎన్‌ఎంసీ వెల్లడించింది. అలాగే రేడియో డయాగ్నసిస్, అనస్థీషియా, పాఽథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ అధ్యాపకుల సంఖ్యను పెంచాలని సూచించింది. అలాగే పీజీ విద్యార్థులకు అవసరమైన వైద్య యంత్రపరికరాలను అందుబాటులో ఉంచాలని పేర్కొంది.
ముఖ్యంగా ఆస్పత్రిలో ఏడాదంతా 80ు పడకలు రోగులతో నిండి ఉండటం తప్పనిసరి అని తెలిపింది. అలాగే అభా ఐడీ ఓపీ, ఐపీ, ప్రసవాలు, సర్జరీలు, రోగుల అడ్మిషన్లు, డిశ్చార్జిలకు సంబంధించి డిజిటల్ డేటా తప్పకుండా ఉండాలని స్పష్టం చేసింది. నిబంధనల మేరకు అధ్యాపకుల నియామకం ఉండాలని, విధుల సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు ప్రాక్టీస్ చేయరాదని, 75ు అధ్యాపకుల హాజరు తప్పకుండా ఉండాలని పేర్కొంది. సీసీ కెమెరాలను తప్పకుండా ఏర్పాటు చేయాలని, ప్రతీ కళాశాల విధిగా కాలేజీ వెబ్‌సైట్‌ను అందుబాటులో ఉంచాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
పీజీ కోర్సులు ప్రారంభించాలంటే విధిగా ఆస్పత్రిలో 220 పడకలు ఉండాలని తెలిపింది. అంతేకాకుండా బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, రేడియో డయాగ్నసిస్, అనస్థీషియా విభాగాలు తప్పనిసరి అని స్పష్టం చేసింది. అలాగే ప్రభుత్వేతర వైద్య కాలేజీలు, సంస్థలకు ఒక్కో విభాగానికి కేవలం నాలుగు సీట్ల వరకే అనుమతినిస్తామని పేర్కొంది. అలాగే హెచ్‌వోడీలు, అందులో ఉండే ప్రొఫెసర్ల సంఖ్య ఆధారంగా సీట్ల సంఖ్య ఉంటుందని ఎన్‌ఎంసీ పేర్కొంది.