Share News

ACB Raid: ఏసీబీకి చిక్కిన సబ్‌ రిజిస్ట్రార్‌, ఎస్సై

ABN , Publish Date - Jul 26 , 2024 | 06:29 AM

లంచం తీసుకుంటూ హనుమకొండ జిల్లా పరకాల సబ్‌ రిజిస్ట్రార్‌ సునీత, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ టౌన్‌ ఎస్సై బానాల రాము రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కారు.

ACB Raid: ఏసీబీకి చిక్కిన సబ్‌ రిజిస్ట్రార్‌, ఎస్సై

  • లంచం తీసుకున్న పరకాల సబ్‌ రిజిస్ట్రార్‌ సునీత.. పాల్వంచ టౌన్‌ ఎస్సై బానాల రాము అరెస్టు

పరకాల/పాల్వంచ/మక్తల్‌, జూలై 25: లంచం తీసుకుంటూ హనుమకొండ జిల్లా పరకాల సబ్‌ రిజిస్ట్రార్‌ సునీత, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ టౌన్‌ ఎస్సై బానాల రాము రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కారు. పరకాల మునిసిపాలిటీ పరిధిలోని సీతారాంపురానికి చెందిన లడే రాజేశ్వర్‌రావు, సాంబలక్ష్మి దంపతులు తమ పేరిట ఉన్న 1173 గజాల భూమిని వారసత్వంగా తమ ఇద్దరు కుమారులకు గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్‌ చేసేందుకు నిర్ణయించుకున్నారు. డాక్యుమెంట్‌ రైటర్‌ బొట్ల నరేశ్‌ ద్వారా సబ్‌ రిజిస్ట్రార్‌ సునీతను సంప్రదించారు. అందుకు ఆమె రూ.80వేలు లంచం డిమాండ్‌ చేశారు. దీంతో రాజేశ్వరరావు ఆయన కుమారులు ఈనెల 22న ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. గురువారం వారు రూ.80వేలను డాక్యుమెంట్‌ రైటర్‌ బొట్ల నరేశ్‌కు ఇచ్చారు. అదే సమయంలో దాడి చేసిన ఏసీబీ అధికారులు డాక్యుమెంట్‌ రైటర్‌తో పాటు సబ్‌ రిజిస్ట్రార్‌ సునీతను అరెస్టు చేశారు.


మరోవైపు.. భద్రాద్రి జిల్లా పాల్వంచ గట్టాయిగూడెంకు చెందిన శ్రావణి అనే మహిళ నుంచి కొత్తగూడేనికి చెంది న బాలసాని గణేష్‌ నగదు అప్పుగా తీసుకున్నాడు. ఆ తర్వాత అతను మృతి చెందడంతో శ్రావణి కోర్టును ఆశ్రయించగా గణే్‌షకు చెందిన ఆస్తిపై అటాచ్‌మెంట్‌ ఆర్డర్‌ జారీ అయింది. అయినా పాల్వంచకు చెందిన ఇద్దరు వ్యక్తులు గణేష్‌ ఆస్తిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. పైగా ఆమెను వారు బెదిరించడంతో పాల్వంచ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఎస్సై బాణాల రాము ఆమె ఫిర్యాదును పక్కన పడేశాడు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు ఎస్సై ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాడు. కేసు నమోదు చేసినందున తనకు డబ్బులిప్పించాలని శ్రావణి తరపు న్యాయవాది లక్ష్మారెడ్డిని ఎస్సై రాము ఒత్తిడి చేయడంతో ఆయన ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. గురువారం న్యాయవాది పాల్వంచలోని ఎస్సై నివాసానికి వెళ్లి.. ఆయనకు రూ.20 వేల నగదును అందించగా ఏసీబీ అధికారులు.. ఎస్సైని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.


మక్తల్‌లో ఏసీబీకి పట్టుబడ్డ సర్వేయర్‌

నారాయణపేట జిల్లా మక్తల్‌ మండల సర్వేయర్‌ బాల్‌రాజ్‌ రూ.9 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మక్తల్‌కు చెందిన గాసం వెంకటేష్‌ భూమిలో సర్వే చేసేందుకు సర్వేయర్‌ బాల్‌రాజ్‌ లంచం డిమాండ్‌ చేశాడు. ఈ విషయంపై బాధితుడి అల్లుడు శ్రవణ్‌ ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. గురువారం తహసీల్దార్‌ కార్యాలయంలో సర్వేయర్‌కు బాధితుడు లంచం ఇచ్చి బయటకు రాగానే వెంటనే ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు.

Updated Date - Jul 26 , 2024 | 06:29 AM