Hyderabad: కేసీ వేణుగోపాల్‌కు వందకోట్లు వెళ్లాయి..
ABN , Publish Date - May 23 , 2024 | 05:12 AM
కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్‌కు రాష్ట్రం నుంచి వంద కోట్ల రూపాయలు అందాయని, ట్యాక్స్‌ల పేరుతో వసూలు చేసినదంతా సూట్‌కేసుల్లో ఢిల్లీకి వెళ్తోందని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు.
ట్యాక్స్‌ల పేరుతో వసూళ్లు.. సూట్‌కేసుల్లో ఢిల్లీకి
ఉత్తమ్, చౌహాన్ కలిసి వెయ్యి కోట్ల కుంభకోణం
పూర్తి ఆధారాలతో ఆ స్కాంను బయటపెడతా
మీడియాతో చిట్‌చాట్‌లో బీజేపీఎల్పీ నేత మహేశ్వరరెడ్డి
హైదరాబాద్, మే 22 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్‌కు రాష్ట్రం నుంచి వంద కోట్ల రూపాయలు అందాయని, ట్యాక్స్‌ల పేరుతో వసూలు చేసినదంతా సూట్‌కేసుల్లో ఢిల్లీకి వెళ్తోందని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాఖ కమిషనర్ చౌహన్ కలిసి రూ.వెయ్యి కోట్ల మేర స్కాం చేశారని, ఆ స్కాంను ఆధారాలతో సహా బయట పెడతానన్నారు. పౌరసరఫరాల విషయంలో మంత్రి లెక్కలు, కమిషనర్ లెక్కలు వేర్వేరుగా ఉంటాయని, తాను ఆధారాలు లేకుండా మాట్లాడడంలేదన్నారు.
ఈ విషయంలో ఉత్తమ్ కౌంటర్ కోసం ఎదురుచూస్తున్నానని, ఆయన బహిరంగ చర్చకు వస్తే, తాను కూడా పక్కా ఆధారాలతో సిద్ధంగా ఉన్నానని స్పష్టంచేశారు. ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్, ఆర్‌ఆర్‌ఆర్ ట్యాక్స్‌ల గురించి మాట్లాడినప్పుడు స్పందించని ఉత్తమ్.. యూ ట్యాక్స్ గురించి మాట్లాడితే బయటకు వస్తున్నారన్నారు. ధనిక తెలంగాణను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వనాశనం చేశారని విమర్శించారు. కొడుకు(కేటీఆర్) హీరోయిన్ల వైపు, కూతురు(కవిత) లిక్కర్ వైపు వెళ్లారని దుయ్యబట్టారు.