Share News

Sand Smuggling: పీడీ యాక్ట్‌ పెడతామన్నా.. అదే బరితెగింపు!

ABN , Publish Date - Aug 11 , 2024 | 04:15 AM

రాష్ట్రంలో ఇసుక అక్రమార్కుల దందా ఆగడం లేదు. ఇసుక తరలించే వాహనదారులతో మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఈరవత్రి అనిల్‌ ఇటీవలే సమావేశమయ్యారు.

Sand Smuggling: పీడీ యాక్ట్‌ పెడతామన్నా.. అదే బరితెగింపు!

  • యథేచ్ఛగా ఇసుక దందా..ఒక వే బిల్లుతో నాలుగైదు ట్రిప్పుల తరలింపు

  • ములుగులో టన్ను ఇసుక ధర రూ.1300 పైనే.. అక్రమాలకు సహకరిస్తున్న టీజీఎండీసీ అధికారి

హైదరాబాద్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇసుక అక్రమార్కుల దందా ఆగడం లేదు. ఇసుక తరలించే వాహనదారులతో మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఈరవత్రి అనిల్‌ ఇటీవలే సమావేశమయ్యారు. ఇసుక రవాణాలో అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. ఇంత చేసినా.. రాష్ట్రంలో ఇసుక దందాకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. వర్షాల వల్ల ఇసుక రీచ్‌లు మూతపడడం, రీచ్‌ల నుంచి ఉన్న దారులు దెబ్బతినడం, గోదావరిలో వరద రావడం వంటి కారణాలతో నెల రోజులుగా ఇసుక తవ్వకాలు గణనీయంగా తగ్గాయి.


రాష్ట్రంలో రోజూవారీగా 60వేల టన్నుల ఇసుక అవసరం ఉండగా.. ప్రస్తుతం అందులో సగం కూడా అందుబాటులో లేదు. దీన్ని అవకాశంగా తీసుకున్న కొంత మంది ఇసుకను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నిలువరించాల్సిన అధికారులు.. ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో ఇసుక దందా జోరుగా సాగుతోంది. టీజీఎండీసీలోని ఓ కీలక అధికారి ఈ అక్రమాలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని మంజీరా నుంచి హైదరాబాద్‌లోని ఏయే సెంటర్లకు లారీలు వెళ్లాలన్నదీ ఆయనే నిర్ణయిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.


జుక్కల్‌, బాన్సువాడ నియోజకవర్గాల పరిధిలోని బిచ్కుంద, బీర్‌కూర్‌ ఇసుక రీచ్‌లు అక్రమాలకు అడ్డాలుగా మారాయి. అక్కడ ట్రాక్టర్‌ ఇసుకకు వేబిల్లు రూ.900ఉండగా.. బహిరంగ మార్కెట్‌లో రూ.5000కు విక్రయిస్తున్నారు. ఒక ట్రిప్‌ కోసం వేబిల్లు తీసుకుని రోజులో నాలుగు, అయిదు ట్రిప్పులు తరలిస్తున్నారు. మరోవైపు.. బాన్సువాడ సమీపంలని కప్పలవాగు, పెదవాగు పరిధిలోనూ ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ములుగు జిల్లాలోని మంగపేట, వాజేడు, వెంకటాపురం, ఏటూరు నాగారం మండలాల పరిధిలోని ఇసుక రీచ్‌ల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు కొనసాగుతున్నాయి.


ఇక్కడ మొన్నటిదాకా టన్నుకు రూ.900వసూలు చేస్తుండగా.. ఇప్పుడు రూ.1300పైనే తీసుకుంటున్నారని వినియోగదారులు వాపోతున్నారు. టీజీఎండీసీ పర్యవేక్షణ లేకపోవడం, తనిఖీలు చేపట్టకపోవడంతో ఇసుక దందాకు అడ్డుకట్ట పడే పరిస్థితి లేకుండా పోయింది. టీజీఎండీసీ ధరల ప్రకారం రీచ్‌ వద్ద టన్ను ఇసుక రూ.411మాత్రమే. కానీ, బహిరంగ మార్కెట్‌లో డిమాండ్‌ను బట్టి రూ.600 నుంచి రూ.1300 వరకు విక్రయిస్తున్నారు. ఇక, హైదరాబాద్‌లోనైతే టన్ను రూ.3000 నుంచి రూ.4000 మధ్య అమ్ముతున్నారు.


  • సమాచారం ఇస్తే కేసులు పెడతాం

ఇసుకను అక్రమంగా విక్రయించే వారిని ఇటీవల పిలిపించి హెచ్చరించాం. పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని చెప్పాం. అధిక ధరలకు ఇసుక అమ్మకాలు చేసే వారిపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే అధికారులను ఉపేక్షించేది లేదు. ఖనిజాభివృద్ధి సంస్థకు ఫిర్యాదు చేస్తే కేసులు పెడతాం.

- ఈరవత్రి అనిల్‌ కుమార్‌, టీజీఎండీసీ చైర్మన్‌

Updated Date - Aug 11 , 2024 | 04:15 AM