Share News

Hyderabad: ప్రకాశంలో పుట్టిన మాదిగ దండోరా.!

ABN , Publish Date - Aug 02 , 2024 | 03:37 AM

మాదిగ దండోరా (ఎమ్మార్పీఎస్‌ ఉద్యమం) పుట్టింది ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మారుమూల గ్రామం ఈదుముడిలో..! అదివరకే ఆ ఊరిలో సామాజిక స్పృహ కలిగిన మాదిగ యువకులు చెరువు నీళ్ళ కోసం, భూపంపకాల్లో సమన్యాయం కోసం పోరాడిన సందర్భాలున్నాయి.

Hyderabad: ప్రకాశంలో పుట్టిన  మాదిగ దండోరా.!

హైదరాబాద్‌ సిటీ - ఆంధ్రజ్యోతి : మాదిగ దండోరా (ఎమ్మార్పీఎస్‌ ఉద్యమం) పుట్టింది ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మారుమూల గ్రామం ఈదుముడిలో..! అదివరకే ఆ ఊరిలో సామాజిక స్పృహ కలిగిన మాదిగ యువకులు చెరువు నీళ్ళ కోసం, భూపంపకాల్లో సమన్యాయం కోసం పోరాడిన సందర్భాలున్నాయి. వారిలో కొమ్మూరి విజయకుమార్‌ ఒకరు. కారంచేడు దుర్మార్గాన్ని నిరసిస్తూ పురుడుపోసుకొన్న ‘దళిత మహాసభ’లో జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న సమయంలో మాదిగలను తగిన ప్రాధాన్యత లభించడం లేదంటూ నాయకత్వాన్ని విజయకుమార్‌ ప్రశ్నించారు.


ఆ తర్వాత ఒంగోలు వేదికగా జరిగిన ‘శక్తి ప్రదర్శన్‌’ సమావేశంలో విజయకుమార్‌ను దళిత మహాసభ నాయకులు వేదిక మీదకు ఆహ్వానించకుండా అవమానించారని ఒంగోలుకు చెందిన సామాజికవేత్త కత్తి కల్యాణ్‌ వివరించారు. అదే సభలో పాల్గొనడానికి వచ్చిన మంద కృష్ణను కలిసిన విజయకుమార్‌.. విద్య, ఉద్యోగ అంశాలలో మాదిగలకు జరుగుతున్న అన్యాయంపై సుదీర్ఘంగా చర్చించారు. జనాభాలో ఎక్కువగా ఉన్న మాదిగలకు రిజర్వేషన్‌ ఫలాలు అందడంలో తలెత్తుతున్న నష్టాన్ని వివరించారు. అప్పుడప్పుడే ప్రారంభమైన కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి స్ఫూర్తితో మరో 13 మంది స్థానిక మాదిగ యువతతో కలిసిన మంద కృష్ణ.. 1994, జూలై 7న ఈదుముడిలో ఎమ్మార్పీఎ్‌సను స్థాపించారు.

Updated Date - Aug 02 , 2024 | 03:37 AM