Nalgonda: సారూ జర పట్టించుకోండ్రి.. విష జ్వరాలతో అల్లాడుతున్న ప్రజలు..
ABN , Publish Date - Aug 29 , 2024 | 10:09 PM
వర్షాకాలం వచ్చిందంటే చాలు సాధారణంగానే సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. ఈసారి మాత్రం పరిస్థితి ఘోరంగా ఉంది. తెలంగాణలో ఏ ఊరుకెళ్లినా.. ప్రజలు వైరల్ ఫీవర్‌తో మంచాన పడి కనిపిస్తున్నారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో పలు గ్రామాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి.
నల్లగొండ, ఆగష్టు 29: వర్షాకాలం వచ్చిందంటే చాలు సాధారణంగానే సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. ఈసారి మాత్రం పరిస్థితి ఘోరంగా ఉంది. తెలంగాణలో ఏ ఊరుకెళ్లినా.. ప్రజలు వైరల్ ఫీవర్‌తో మంచాన పడి కనిపిస్తున్నారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో పలు గ్రామాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏ గ్రామం వెళ్లినా జ్వర పీడితులే కనిపిస్తున్నారు. చిన్న క్లినిక్ మొదలు.. పెద్ద ఆస్పత్రి వరకు రోగులతో కిటకిటలాడుతున్నాయి. గ్రామాల్లో పారిశుధ్య లోపం, పరిసరాల పరిశుభ్రత లేకపోవడం వంటి కారణాలతో వ్యాధులు ప్రబలుతున్నాయి. దీంతో రోగాల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు.
నల్లగొండ జిల్లాలోని త్రిపురారం మండలం డొంకతండ గ్రామ పంచాయతీలో చాలా మంది ప్రజలు విష జ్వరాల భారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఇంటిలో ఇద్దరు, ముగ్గురు మంచాన పడుతున్నారు. కొన్ని ఇళ్లలో అయితే ఇంటిల్లిపాది జ్వరంతో అవస్థలు పడుతున్నారు. దీంతో రోగులు ఆస్పత్రుల బాటపడుతున్నారు. డబ్బుల్లేక ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే.. అక్కడ పట్టించుకునే నాదుడే లేడని ప్రజలు వాపోతున్నారు. ఇక చేసేదేమీ లేక చిన్నా చితకా క్లినిక్‌లలో వైద్యం చేయించుకుంటున్నారు. బాధితుల రాకతో ఆర్ఎంపీ క్లినిక్స్ కిటకిటలాడుతున్నాయి. అయితే, గ్రామాల్లో పారిశుధ్యం సరిగా లేకపోవడం వల్లే తాము జ్వరాల బారిన పడాల్సి వస్తోందని.. అధికారుల నిర్లక్ష్యానికి తాము బలవుతున్నామని గ్రామ ప్రజలు వాపోతున్నారు.
గ్రామాల్లో పడకేసిన పారిశుధ్యం..
ఒక్క డొంకతండ గ్రామంలోనే కాదు.. జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. మురికి కాల్వలు నిండి, రహదారుల్లో పొంగిపొర్లుతున్నాయి. వాటిని శుభ్రం చేసే నాదుడే లేకుండా పోయింది. పరిసరాల పరిశుభ్రత లేకపోవడంతో దోమల బెడద ఎక్కువైంది. ఫలితంగా ప్రజలు డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇకనైనా స్పందించి గ్రామాల్లో అవసరమైన పారిశుధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు వేడుకుంటున్నారు. వైద్య శిభిరాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.