మోహన్‌బాబు కేసులో దర్యాప్తు ముమ్మరం
ABN , Publish Date - Dec 14 , 2024 | 05:06 AM
మోహన్‌బాబుపై నమోదైన కేసుకు సంబంధించి రాచకొండ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): మోహన్‌బాబుపై నమోదైన కేసుకు సంబంధించి రాచకొండ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కాగా, మోహన్‌బాబు పరారీలో ఉన్నారని, అయన కోసం ఐదు ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మోహన్‌బాబును అరెస్టు చేయడానికి పోలీసులు జల్‌పల్లిలోని ఆయన నివాసానికి వెళ్లగా.. అక్కడ మోహన్‌బాబు లేరని, ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారని వార్తలు వెలువడ్డాయి. దీనిపై పహాడీషరీఫ్ పోలీసులను వివరణ కోరగా.. అలాంటిదేమీ లేదని, ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉందని, విచారణ ముగిసిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు.
జర్నలిస్టుకు మోహన్‌బాబు క్షమాపణలు
జర్నలిస్టుపై దాడికి పాల్పడిన ఘటనపై మోహన్‌బాబు మరోసారి స్పందించారు. గాయపడిన జర్నలిస్టుకు క్షమాపణలు తెలియజేస్తూ ఎక్స్‌లో శుక్రవారం పోస్టు పెట్టారు. ఓ లేఖను కూడా విడుదల చేశారు. ‘జర్నలిస్టు సోదరుడికి బాధ కలిగించినందుకు చాలా ఆవేదనగా ఉంది. ఆ రోజు దాదాపు 50 మంది వ్యక్తులు ఇంట్లోకి వచ్చారు. నేను సహనాన్ని కోల్పొయాను. ఈ గందరగోళం మధ్య మీడియా ప్రతినిధులు అనుకోకుండా వచ్చారు. ఓ జర్నలిస్టుకు గాయం అయింది. ఇది చాలా దురదృష్టకరం. క్షమించమని హృదయపూర్వకంగా కోరుతున్నా. గాయపడిన జర్నలిస్టు కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని మోహన్‌బాబు పేర్కొన్నారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ రంజిత్
మోహన్‌బాబు చేతిలో గాయపడిన జర్నలిస్ట్ రంజిత్ యశోద అస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కంటి, చెవిభాగంలో జైగోమేటిక్ బోన్ సర్జరీ చేసిన వైద్యులు స్టీల్ ప్లేట్ అమర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.