Droupadi Murmu: రక్షణ పరిశ్రమలో స్వదేశీ సామర్థ్యాల పెంపు
ABN , Publish Date - Dec 21 , 2024 | 04:43 AM
దేశంలో సాంకేతికంగా అధునాతన పరికరాలను తయారు చేయడం ద్వారా రక్షణ ఉత్పత్తుల్లో స్వాలంబన సాధించే దశను ప్రారంభించే సమయం వచ్చేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
దేశాభివృద్ధి కోసం సాంకేతిక పురోగతిని సాధించాలి: రాష్ట్రపతి ముర్ము
కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్‌కు ‘కలర్స్ ప్రజెంటేషన్ అవార్డు’ అందజేత
రాష్ట్రపతి నిలయంలో ఎట్‌హోమ్.. హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్
అల్వాల్, డిసెంబరు20 (ఆంధ్రజ్యోతి): దేశంలో సాంకేతికంగా అధునాతన పరికరాలను తయారు చేయడం ద్వారా రక్షణ ఉత్పత్తుల్లో స్వాలంబన సాధించే దశను ప్రారంభించే సమయం వచ్చేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. స్వావలంబన, సాంకేతిక పురోగతి, వ్యూహాత్మక సహకారాలపై దృష్టి సారించడం ద్వారా భారతదేశం తన సరిహద్దులను కాపాడుకోవడమే కాకుండా ప్రపంచ శాంతి, స్థిరత్వానికి బాటలు వేస్తుందని పేర్కొన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఈజ్ ఆఫ్ డూయింగ్’ వంటి కార్యక్రమాల ద్వారా వ్యాపారం, రక్షణ పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి, రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు భారతీయ, విదేశీ పెట్టుబడుదారులను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. స్వదేశీకరణకు ప్రాధాన్యమిస్తూ దేశీయంగా అనేక రక్షణ ఉత్పత్తులు తయారు చేయడం జరుగుతోందన్నారు. శుక్రవారం సికింద్రాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ (సీడీఎం)కు ‘కలర్స్ ప్రజెంటేషన్ అవార్డు’ అందజేయడానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
రక్షణ పరిశ్రమలో స్వదేశీ సామర్థ్యాలను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. రక్షణ బలగాల అధికారులు ఆత్మనిర్భర్ భారత్ విజన్‌ను సాధించడానికి, స్వావలంబన సాధించడానికి సహకరించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. రక్షణ ఆధునీకరణ రంగంలో భారతదేశం తన సంప్రదాయాల బలగాలను అప్‌గ్రేడ్ చేయడం, కృత్రిమ మేధస్సు, డ్రోన్‌లు, సైబర్ వార్‌ఫేర్ సామర్థ్యాలు, అంతరిక్ష రక్షణ సాంకేతికతలతో సహా అత్యాధునిక సాంకేతికతలను తెలుసుకోవడం వంటి సమగ్ర విధానంపై, ప్రపంచ స్థాయిలో వ్యూహాత్మక రక్షణ భాగస్వాములను ఏర్పాటుపై భారతదేశం దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. బహుపాక్షిక ఆర్థిక సైనిక దళాల కార్యకలాపాల ద్వారా ప్రాంతీయ, ప్రపంచ రక్షణ చర్చల్లో భారతదేశ ప్రభావం గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. గత ఐదు దశాబ్దాలుగా సీడీఎం ప్రయాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ ఆమె అభినందించారు. భారత సైన్యం, నేవీ, వైమానిక దళం, కోస్ట్‌గార్డ్‌ల అధికారుల శిక్షణలో ఉన్నత ప్రమాణాలను సాధించడానికి సీడీఎం విశేషంగా కృషి చేస్తోందన్నారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, కృత్రిమ మేధస్సుకు భారతదేశం అధిక ప్రాఽధాన్యాన్నిస్తోందని, వాటిని భారత రక్షణ వ్యవస్థల్లో మెరుగైన సామర్థ్యం, ప్రపంచ పోటీతత్వం కోసం ఉపయోగిస్తుందని వివరించారు. కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, చీఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్, సీడీఎం కమాండెంట్ హర్ష్ చిబ్బర్, త్రివిధ దళాల అధికారులు పాల్గొన్నారు.
ముర్ము తేనీటి విందు
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తేనీటి వింధు ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, హైకోర్ట్ ప్రధాన న్యాయముర్తి జస్టిస్ అలోక్ అరాధే దంపతులు హాజరయ్యారు. హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌రావు, శాసనమండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి రాష్ట్ర మంత్రులు దామోదర, పొన్నం, సీతక్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తదితరులు రాష్ట్రపతి ఎట్‌హోం కార్యక్రమంలో పాల్గొన్నారు.