రూ.130 కోట్ల చేనేత వస్త్రం.. చీలికలు పీలికలై!
ABN , Publish Date - Jun 30 , 2024 | 04:32 AM
చేనేత సహకార సంఘాల్లో బీఆర్‌ఎస్ సర్కారు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయించిన వస్త్రమది! విలువ 130 కోట్లు!! ఈ వస్త్రంతో బడులు, సంక్షేమ హాస్టళ్లలోని పిల్లల కోసం యూనిఫాం, ఇతర దుస్తులు తయారు చేయించేందుకు, ప్రత్యేక దుస్తులకు ఎంబ్రాయిడరీతో సొబగులు అద్దించి,
అత్యంత విలువైన సరుకు నిల్వల పట్ల తీవ్ర నిర్లక్ష్యం
నెలల తరబడి గోదాముల్లోనే మూలుగుతున్న వైనం
బడి, హాస్టల్ పిల్లలకు యూనిఫాం.. ఇతరత్రా అవసరాలకు పెద్దఎత్తున ఉత్పత్తి చేయించిన గత బీఆర్‌ఎస్ సర్కారు
సంరక్షణ చర్యల్లేక కొంత ఎలుకలు, పందికొక్కుల పాలు
బకాయిలే రూ.220 కోట్లు.. పవర్‌లూం ఉత్పత్తులవి 112 కోట్లు
హైదరాబాద్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): చేనేత సహకార సంఘాల్లో బీఆర్‌ఎస్ సర్కారు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయించిన వస్త్రమది! విలువ 130 కోట్లు!! ఈ వస్త్రంతో బడులు, సంక్షేమ హాస్టళ్లలోని పిల్లల కోసం యూనిఫాం, ఇతర దుస్తులు తయారు చేయించేందుకు, ప్రత్యేక దుస్తులకు ఎంబ్రాయిడరీతో సొబగులు అద్దించి, టెస్కో (తెలంగాణ చేనేత సహకార సంఘం) షోరూముల్లో పెట్టి విక్రయించేందుకు, హాస్టల్ విద్యార్థుల కోసం జంపఖానాలు, దుప్పట్లు తయారుచేయించేందుకు, ప్రభుత్వ హాస్పిటళ్లలో బెడ్‌షీట్లు, పిల్లో కవర్లు.. ప్రభుత్వ కార్యాలయాల్లో పరదాలు ఇతరత్రా అవసరాలకు ఉపయోగించేందుకు గత సర్కారు నేయించిన టన్నులకొద్దీ ఉత్పత్తి చేయించిన వస్త్రం కొన్ని నెలలుగా గోదాముల్లోనే మూలుగుతోంది. నేసిన వస్త్రాన్ని నేసినట్లుగా టెస్కో, చేనేత ప్రాథమిక సహకార సంఘాల గోదాముల్లో ఎక్కడ పడితే అక్కడ పడేయడం.. అక్కడ సంరక్షణ చర్యలు సరిగా లేకపోవడంతో అత్యంత విలువైన వస్త్రం ఎలుకలు పందికొక్కులపాలవుతోంది.
కొంత నిల్వనేమో ఎండకు ఎండి వానకు తడుస్తుండటంతో చిరిగిపోతోంది. ఈ వస్త్రానికి సంబంఽధించి సహకార సంఘాలకు గత సర్కారు గానీ, ప్రస్తుత సర్కారు గానీ పైసా చెల్లించలేదు. పైగా 360 సొసైటీలకు చెల్లించాల్సిన పాత బకాయిలు రూ. 220 కోట్ల మేర పేరుకుపోయాయి. ఫలితంగా మొత్తంగా రూ. 350 కోట్ల విలువైన బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవికాకుండా పవర్‌లూమ్ ఉత్పత్తులకు సంబంధించిన బకాయిలు కూడా రూ. 112 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కాగా వస్త్రం ఉత్పత్తి చేయటానికి పెట్టుబడి ఖర్చులకోసం చేనేత సహకార సంఘాలు గతంలోనే బ్యాంకుల్లో అప్పులు చేశాయి. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవటంతో... బ్యాంకుల్లో తీసుకున్న అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయి. అప్పులు, వడ్డీలు చెల్లించాలని బ్యాంకర్లు చేనేత సహకార సంఘాలపై ఒత్తిడి చేస్తున్నారు.
జీతాలు చెల్లించడమూ భారమై..
టెస్కో ఆధ్వర్యంలో దశాబ్దాలుగా పాడుబడ్డ భవనాల్లో చేనేత వ స్త్రాలలయాలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని నారాయణగూడ, అబిడ్స్‌తో పాటు నల్లగొండ, వరంగల్ ఒక్కోచోట మొత్తంగా ఉన్న నాలుగు వస్త్రాలయాలను ఆధునికీకరించలేదు. వినియోగదారులను ఆకర్షించేలా ఈ వస్త్రాలయాలను తీర్చిదిద్దాలనే డిమాండ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవటంలేదు. చేనత షోరూముల్లో పనిచేసే సిబ్బందికి వాస్తవానికి ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలి. ఇందుకు బడ్జెట్‌లో రూ.40 కోట్లు కేటాయించారు. అయితే ప్రభుత్వం మంజూరు చేయడం లేదు. షోరూముల్లోని వస్త్రాల ధరలను 10-20 శాతం దాకా పెంచి.. వచ్చే ఆ అదనపు ఆదాయంతోనే సిబ్బందికి వేతనాలు చెల్లిస్తున్నారు.
కార్యాలయాల ఖర్చులు, వాహనాలు, ఇతరత్రా ఖర్చులను కూడా ‘ధరలు పెంచగా వచ్చిన మొత్తాన్నే’ వాడుతున్నారు. ఈ ధరల పెంపు విక్రయాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బయట మార్కెట్లోకన్నా చేనేత వస్త్రాలయాల్లో ఎక్కువ ధరలు ఉండటంతో వినియోగదారులు కొనేందుకు అంతగా ఇష్టపడటం లేదు. ఫలితంగా అమ్మకాలు తగ్గిపోయి.. నిల్వలు పేరుకపోతున్నాయి. ఈ ప్రభావం కార్మికులపైనా పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 360 సొసైటీల్లో ఉన్న 17వేల మంది కార్మికులు ఉపాధిలేక, ఆర్థిక సమస్య లతో ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా మాతృ సంస్థ అయిన టెస్కోకు, సహకార సంఘాలకు కలిపి ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించాలనే నిబంధన ఉంది. కానీ.. 11 ఏళ్ల నుంచి ప్రాథమిక సహకార సంఘాలకు గానీ, టెస్కోకు గానీ ఎన్నికలు నిర్వహించలేదు. పాలకవర్గాలను ఏర్పాటుచేయలేదు. దీంతో సహకార సంఘాల వ్యవస్థ కుంటుపడింది.