Share News

NHAI: ఆర్‌ఆర్‌ఆర్‌.. అవార్డ్‌ పాస్‌!

ABN , Publish Date - Aug 19 , 2024 | 03:52 AM

రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ ప్రాజెక్టును సాధ్యమైనంత తొందరగా పట్టాలెక్కించేందుకు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కృషి చేస్తున్నాయి.

NHAI: ఆర్‌ఆర్‌ఆర్‌.. అవార్డ్‌ పాస్‌!

  • ఉత్తర భాగం రోడ్డు నిర్మాణంలో పూర్తయిన భూ సేకరణకు త్వరలో పరిహారం చెల్లింపు

  • గత మూడేళ్లలో జరిగిన రిజిస్ట్రేషన్లలో

  • గరిష్ఠ విలువ ప్రాతిపదికగా ఖరారు

  • పట్టణ ప్రాంతాల్లో 2 రెట్లు.. గ్రామీణంలో 3 రెట్లు

  • నోటిఫికేషన్‌ విడుదలకు అధికారుల కసరత్తు

  • త్వరలో కేంద్రం నుంచి అటవీ అనుమతులు

హైదరాబాద్‌, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ ప్రాజెక్టును సాధ్యమైనంత తొందరగా పట్టాలెక్కించేందుకు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగం నిర్మాణానికి సేకరించిన భూములకు పరిహారం చెల్లింపుపై ఎన్‌హెచ్‌ఏఐ దృష్టి సారించింది. ఇప్పటికే కీలకమైన అటవీ అనుమతుల కోసం కేంద్రానికి దరఖాస్తు చేశారు. త్వరలోనే ఆమోదం రానున్నట్లు సమాచారం.


అనంతరం పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ మధ్యలోనే.. సేకరించిన భూములకు చెల్లించాల్సిన పరిహారాన్ని ఖరారు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. తద్వారా అటవీ, పర్యావరణ అనుమతులు రాగానే ఆలస్యం లేకుండా పరిహారం చెల్లించే అవకాశం ఉంటుందని, పనులు వేగంగా పూర్తవుతాయని భావిస్తున్నారు.


ఉత్తర భాగం మార్గంలో తీసుకోనున్న అటవీ భూములకు ప్రత్యామ్నాయ భూములను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మహబూబాబాద్‌ జిల్లాలో కేటాయించింది. ఈ మార్గం నిర్మాణానికి అవసరమైన దాంట్లో 95 శాతం భూసేకరణ పూర్తయింది. దీనివరకు పరిహారం చెల్లింపునకు అవసరమైన 3జీ అవార్డును విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఎన్‌హె చ్‌ఏఐ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది.


  • గరిష్ఠ పరిహారం చెల్లించేలా..

రాష్ట్రానికి ఆర్‌ఆర్‌ఆర్‌ మంజూరైన తరువాత కొంతకాలానికి రాజకీయ చట్రంలో చిక్కుకుంది. భూ సేకరణ, రైతులకు చెల్లించే పరిహారంలో రాష్ట్ర వాటా జమ, యుటిలిటీస్‌ చార్జీల చెల్లింపు అంశాలతో ఏళ్ల తరబడి పనుల్లో జాప్యం జరిగింది. అయితే, ప్రభుత్వం మారాక డిసెంబరు నుంచి కదలిక వచ్చింది. కొత్త సర్కారు ఆర్‌ఆర్‌ఆర్‌ను ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా భావిస్తూ సూపర్‌ గేమ్‌ చేంజర్‌గా అభివర్ణించింది.


ఈ క్రమంలోనే ఎన్‌హెచ్‌ఏఐ కూడా పనులను త్వరితగతిన మొదలుపెట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే ఉత్తర భాగం మార్గం కోసం సేకరించిన భూములకు చెల్లించాల్సిన పరిహారం అంశంపై దృష్టిసారించింది. జాతీయ రహదారులకు సేకరించే భూముల విషయంలో మానవీయ కోణంతో వ్యవహరించాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు సీఎం రేవంత్‌ నిర్దేశించారు.


తరతరాలుగా భూమినే నమ్ముకున్న రైతులకు అన్యాయం జరగనీయొద్దని, నిబంధనలకు అనుగుణంగా ఎంత ఎక్కువ ఇవ్వగలిగితే అంత దక్కేలా చూడాలన్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు రిజిస్ట్రేషన్‌ విలువలు, మార్కెట్‌లో భూముల విలువల వివరాలను సేకరించనున్నారు. మూడేళ్లలో ఆ ప్రాంతంలో జరిగిన భూముల రిజిస్ట్రేషన్ల ధరలను పరిగణనలోకి తీసుకుని అత్యధిక ధరను గుర్తించనునున్నారు.


గ్రామం, మండలం, జిల్లా, అర్బన్‌, రూరల్‌ వారీగా విభజించి, ఏ ప్రాంతంలో ఎంత చెల్లించాలన్న దానిని ఖరారు చేయనున్నారు. పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్లు, గ్రామీణంలో మూడు రెట్లు అధికంగా చెల్లించనున్నట్లు తెలిసింది. కాగా, పరిహారం చెల్లింపుల కోసం, బ్యాంకుల్లో రుణాల కోసం ఎవరైనా రిజిస్ట్రేషన్‌ విలువను ఎక్కువగా చూపారా? అన్న కోణంలోనూ వివరాలను సేకరించనున్నట్లు సమాచారం.

Updated Date - Aug 19 , 2024 | 03:52 AM