బీజేపీలోకి ఆర్.కృష్ణయ్య?
ABN , Publish Date - Sep 23 , 2024 | 03:54 AM
బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత, వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య.. త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్నారా? కాషాయపార్టీ వర్గాలు ఈ ప్రశ్నకు ఔననే సమాధానమే ఇస్తున్నాయి! ‘బీసీ సీఎం’ నినాదంతో గత అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన బీజేపీ..
ఆయనతో జాతీయ అగ్రనేత చర్చలు!
బీసీ ఓటుబ్యాంకుపై కమలం గురి
హైదరాబాద్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత, వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య.. త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్నారా? కాషాయపార్టీ వర్గాలు ఈ ప్రశ్నకు ఔననే సమాధానమే ఇస్తున్నాయి! ‘బీసీ సీఎం’ నినాదంతో గత అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన బీజేపీ.. రాష్ట్రంలో బీసీ ఓటుబ్యాంకును గణనీయంగా పెంచుకునే దిశగా దృష్టి సారించింది. అందులో భాగంగా బీసీల్లో పట్టున్న నాయకులను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించింది. ఈమేరకు.. ఆర్.కృష్ణయ్యతో పార్టీ జాతీయ అగ్రనేత ఒకరు నేరుగా చర్చలు జరిపినట్లు సమాచారం. తమ ఆఫర్‌కు ఆయన సానుకూలంగా స్పందించారని.. ఆయనకు పార్టీలో కీలక పదవి కట్టబెట్టనున్నామని బీజేపీ వర్గాలు తెలిపాయి. గతంలో ఆరెస్సె్‌సలో క్రియాశీలంగా పనిచేసిన కృష్ణయ్యకు ఆ సంస్థ ముఖ్యులతో కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. దాదాపు పదేళ్లపాటు ఆయన ఆరెస్సె్‌సలో, ఏబీవీపీలో పనిచేశారు. ఈ నేపథ్యంలో.. వారు కూడా కృష్ణయ్యతో చర్చించినట్లు సమాచారం. దాదాపు ఐదు దశాబ్దాలుగా బీసీల హక్కుల కోసం పోరాడుతున్న కృష్ణయ్య.. 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా ఎల్బీనగర్ నుంచి గెలిచారు. అప్పట్లో ఆ పార్టీ ఆయన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. అనంతరం.. 2022లో వైసీపీ ఆయనకు రాజ్యసభ టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గడచిన రెండేళ్లుగా ఆయన వైసీపీ ఎంపీగా (రాజ్యసభ) కొనసాగుతున్నారు. కాగా, ఈ నెల 13న ఆర్.కృష్ణయ్య పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.