Share News

Online Betting : ఆన్‌లైన్‌లో ఆటలు.. ఛిద్రమవుతున్న జీవితాలు

ABN , Publish Date - Dec 21 , 2024 | 10:16 AM

ఆన్‌లైన్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలి అయ్యాడు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. యువకుడిపై మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Online Betting : ఆన్‌లైన్‌లో ఆటలు.. ఛిద్రమవుతున్న జీవితాలు

రంగారెడ్డి: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లతో అమాయకులు మోసపోతున్నారు. ఈ బెట్టింగ్ యాప్‌లను వ్యసనంగా మార్చుకుని అధిక వడ్డీలకు అప్పులు చేసి భారీ మొత్తంలో కూరుకుపోతున్నారు. బెట్టింగ్‌లకు బానిసగా మారిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో అతని బంధువులు, స్నేహితులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.


వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేంద్రంలో ఆన్‌లైన్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలి అయ్యాడు. పెట్రోల్ పోసుకొని సాయి కిరణ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మహేశ్వరం గ్రామం పోచమ్మ బస్తీకి చెందిన ఎదిరే సాయి కిరణ్ (21)గా గుర్తించారు. హైదరాబాద్, నారాయణగూడ, అవినాష్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకునీ మనస్థాపంతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర గాయాలతో ఉన్న సాయికిరణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


పుట్టగొడుగుల్లా బెట్టింగ్‌ యాప్స్‌

మొబైల్ ఓపెన్‌ చేస్తే చాలు.. ‘వన్‌ ఎక్స్‌బెట్‌, మెగాపరి, మోస్ట్‌బెట్‌, పరిపేస, పరిమ్యాచ్‌, 10సీఆర్‌ఐసీ, మెల్‌బెట్‌, మేట్‌బెట్‌, 1ఎక్స్‌బెట్‌, బీసీ డాట్‌గేమ్‌, 22 బెట్స్‌, రాజా బెట్స్‌, స్టేక్‌ డాట్‌ కమ్‌, డఫ్ఫా బెట్‌’ వంటి ఎన్నో అఫీషియల్‌, అన్‌అఫీషియల్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌ పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్నాయి. యూట్యూబ్‌, సోషల్‌ మీడియా, పలు వెబ్‌సైట్లలో రూ.100 పెడితే రూ.1000 ఇస్తామంటూ బెట్టింగ్‌ యాప్స్‌ యాడ్స్‌పురుతో మోసం చేస్తున్నారు. చేపకు గాలం వేసినట్లు కొత్త కస్టమర్లకు మొదట్లో రూ.100 రూ.200, రూ.1000కు రూ.2000 వేలు, రూ.3000 వేలు ఇస్తూ మెల్లగా యువతను ఊబిలోకి లాగుతున్నారు.


ఆర్థికంగా చితికిపోతున్నారు

ప్రస్తుతం యువత పగలు, రాత్రి తేడా లేకుండా 24 గంటలూ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్స్‌లో కూరుకుపోతున్నారు. గతంలో ఈ వ్యసనం కొంతమంది యువతకే పరిమితవ్వగా, ఇప్పుడు అది ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, బ్యాంకర్లు.. ఇలా తేడా లేకుండా ప్రతిఒక్కరూ బెట్టింగులు ఆడుతున్నారు. అయితే ఈ బెట్టింగులు ఆడేవారిలో 99 శాతం మంది చేతులు కాల్చుకుని ఆర్థికంగా చితికిపోతున్నారు. ఆన్‌లైన్‌ బెట్టింగులో భారీగా సంపాదించవచ్చని అనుకుంటున్నారు. అప్పులు తీర్చే అవకాశం లేక కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకోవడానికి పూర్తి కారణాలతోపాటు ఆ యువకుడు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ఏ విధంగా ఆడారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఇంత జరిగినా పోలీసులను ఎందుకు ఆశ్రయించలేదని కూడా విచారిస్తున్నారు.


బ్యాన్‌ చేయలేని పరిస్థితి

నిజానికి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌ అన్నీ ఇల్లీగల్‌ అని చెప్పలేం. చట్టపరంగా గేమ్‌ ఆఫ్‌ ఛాన్స్‌, గేమ్‌ ఆఫ్‌ స్కిల్‌ అని ఉంటాయి. గేమ్‌ ఆఫ్‌ ఛాన్స్‌ అన్నీ దాదాపు ఇల్లీగల్‌. గేమ్‌ ఆఫ్‌ స్కిల్‌ అన్నీ దాదాపు లీగల్‌ అని చెప్పవచ్చు. దీంతో దేశవ్యాప్తంగా ఇలాంటి యాప్స్‌ను ఇల్లీగల్‌ అని ప్రభుత్వం ప్రకటించలేని, బ్యాన్‌ చేయలేని పరిస్థితి. ఎక్కడో జరిగే గేమ్స్‌ ఎలా జరుగుతున్నాయో కూడా మనకు తెలియదు. వాటిలో డబ్బులు పెట్టి ఎక్కువ మొత్తంలో కోల్పోతుంటారు. కేంద్రం ఇల్లీగల్‌ బెట్టింగ్స్‌ యాప్స్‌ విషయంలో నిర్ణయం తీసుకోకపోవడం కూడా ఓ కారణంగా కొందరు పోలీసు అధికారులు చెప్తున్నారు.


అవగాహన కల్పిస్తున్నా.. మార్పు రావడం లేదు

యువకుడు సెల్‌ఫోన్‌, బ్యాంకు ఖాతాల ద్వారా బెట్టింగులకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుంటున్నామని రంగారెడ్డి పోలీసులు తెలిపారు. యువకుడు ఆత్మహత్యకు పాల్పడటంతో బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై దృష్టి సారించాం. సైబర్‌ మోసాలు, బెట్టింగ్‌లలో దురాశ ఉన్నచోటే ఎదురుదెబ్బ తగులుతుంది. 1:5, 1:10 చొప్పున పైసలు ఇస్తామంటే అది మోసం చేయడమే. కెపాసిటీని మించి డబ్బులు పెడుతూ భారీగా మోసపోతున్నారు. రూ.10వేలు అయితే అదృష్టం కలిసి వస్తుందని రూ.లక్ష బెట్టింగ్‌ పెడుతున్నారు. కష్టపడి చదువుకుని ఉన్నత ఉద్యోగాలు చేసుకోవాలి. ఎంత అవగాహన కల్పిస్తున్నా.. యువతలో మార్పు రావడం లేదని రంగారెడ్డి పోలీసులు తెలిపారు.

Updated Date - Dec 21 , 2024 | 10:51 AM