Telangana Weather : తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత
ABN , Publish Date - Nov 02 , 2024 | 08:40 AM
ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతుండటంతో చలి తీవ్రత పెరుగుదలకు కారణమైంది. సాయంత్రం ఆరు గంటలు అయ్యిందంటే ప్రజలు చలికి ఇళ్ల తలుపులు మూసుకుంటున్నారు. మళ్లీ ఉదయం ఎనిమిది గంటలు అయితేగానీ తలుపులు తీయడం లేదు.
వికారాబాద్ జిల్లా: తెలంగాణలో చలి ప్రభావం మొదలైంది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. రోజురోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు చలి తీవ్రతను పెంచుతున్నాయి. చలి ప్రభావంతో జనం గజగజ వణుకుతున్నారు. ఉదయం తొమ్మిదింటి వరకూ పొగమంచు కమ్ముకుంటోంది. శనివారం ఉదయం వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల పరిసరాలను మంచు దుప్పటి కమ్మేసింది. పొగమంచు ప్రభావంతో పరిసరాలు స్పష్టంగా కన్పించని పరిస్థితి నెలకొంది. ఉదయం పూట జనం ఇళ్లనుంచి బయటకు రావడం లేదు. వికారాబాద్ జిల్లాలో పొగమంచు కమ్ముకుంది. ఉదయం ఏడున్నర గంటలైనా రోడ్డు కనిపించని పరిస్థితి నెలకొంది. రోడ్డు కనిపించకపోవడంతో వాహనదారుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లైట్లు వేసుకొని మరి ప్రయాణం చేయాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు. అనంతగిరి కొండల్లో చూపరులను మంచు ఆకట్టుకుంటుంది. అనంతగిరి కొండల్లో అడవులు అరకు అందాలను తలపిస్తున్నాయని ప్రజలు అంటున్నారు.
ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతుండటంతో...
ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతుండటంతో చలి తీవ్రత పెరుగుదలకు కారణమైంది. సాయంత్రం ఆరు గంటలు అయ్యిందంటే ప్రజలు చలికి ఇళ్ల తలుపులు మూసుకుంటున్నారు. మళ్లీ ఉదయం ఎనిమిది గంటలు అయితేగానీ తలుపులు తీయడం లేదు. అప్పటి వరకు రోడ్లు కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి. చలి తీవ్రతకు చిన్నపిల్లలు, వృద్ధులు, బస్టాండ్లు, రహదారులపై యాచకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్లే జనం, పాల వ్యాపారులు, పేపర్ బాయ్స్, మునిసిపల్ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ పనులు, అవసరాల రీత్యా తెల్లవారుజామున ద్విచక్ర వాహనాలపై తిరిగేవారు అవస్థలు పడుతున్నారు. మంకీక్యాప్, స్వెటర్‌లు లేనిదే బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. చల్లిని తట్టుకునేందుకు తెల్లవారుజామున పట్టణ ప్రాంతాల్లో టీ కొట్ల వద్ద రద్దీ కనినిపిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో చలిమంటలు కాచుకుంటున్నారు. సంక్రాంతి, శివరాత్రి ముగిసేవరకు చలి తీవ్రత తీవ్రంగా ఉండనుంది.
కమ్ముకుంటున్న పొగమంచు
గాలిలో తేమశాతం పెరగడంతో ఉదయం వేళల్లో వికారాబాద్ జిల్లాలోని చాలా గ్రామాల్లో పొగమంచు కమ్ముకుంటోంది. తెల్లవారుజామున 5గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు గ్రామాలతో పాటు రహదారులను మంచు తెరలు కమ్మేస్తున్నాయి. పొగమంచు కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈక్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. చలి తీవ్రం కావడంతో పిల్లలు, వృద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారు. అలర్జీ, ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చలి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఉన్ని దుస్తులు వినియోగించాలని వైద్యులు సలహాలు ఇస్తున్నారు.
శీతాకాలంలో ఎక్కువగా వచ్చే చర్మవ్యాధులు ..
శీతాకాలంలో చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దద్దుర్లు, చర్మం పగుళ్లు వస్తాయి. ఎక్కువగా నీరు తీసుకోవాలి, గుడ్లు, చేపలు తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే అస్తమా రోగులకు చలిగాలులు మరింత చేటు చేస్తాయని అంటున్నారు. జలుబు, దగ్గు ఉక్కిరిబిక్కిరి చేస్తుందని చెప్పారు. జ్వరం పెరగడం, కోరింత దగ్గు, ముక్కు నుంచి నీరు కారడం వంటి లక్షణాలు తీవ్రమవుతాయని అన్నారు. 40 ఏళ్లు పై బడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందన్నారు. ఇదిలా ఉండగా పిల్లలకు చలిగాలి తగిలితే న్యూమోకోకల్ వైరస్ బారిన పడి ఉబ్బసం (న్యూమోనియా) వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 0-5 ఏళ్ల చిన్నారుల్లో ఇది ఎక్కువగా ఉంటుందని వైద్యులు అన్నారు. న్యూమోకోకల్ వైరస్ ప్రభావం వల్ల తీవ్రమైన దగ్గు, ముక్కు కారడం, అధిక జ్వరం, వంటి వాటితో ఇబ్బంది పడతారని తెలిపారు. వెంటనే చికిత్స అందించకపోతే న్యూమోనియాకు దారి తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్నపిల్లలకు వేడినీటి స్నానం, వేడి ఆహారం, మరిగించిన నీటిని తాగించాలని సూచించారు. వెచ్చని దుస్తులు (ఉన్ని)వేయాలి. ఇంట్లో వాతావరణం వెచ్చగా ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
అప్రమత్తత అవసరం..
శీతాకాల వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం. చల్లటిగాలిలో తిరగడం సాధ్యమైనంతవరకు మానుకోవాలి. అత్యవసరమైతే ముఖాన్ని పూర్తిగా కప్పే విధంగా ఉండే టోపీలు, స్వెట్టర్లు వంటి వాటిని ధరించాలి. పిల్లలను బయటకు తీసుకుని వెళ్లినప్పుడు తప్పనిసరిగా ఉన్ని దుస్తులు ధరించాలి. చర్మం పొడిబారకుండా క్రీములు రాయాలి. పొగతాగడం పూర్తిగా మానుకోవాలని, సరైన పౌష్టికాహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Hyderabad: బిగ్ అలర్ట్.. ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు..
YSRCP: లైంగికంగా వేధించాడు.. మోసం చేశాడు
Read Latest TELANGANA NEWS And Telugu News