Yamini Krishnamurthy: దివికేగిన నాట్యమయూరి..
ABN , Publish Date - Aug 04 , 2024 | 04:05 AM
ప్రముఖ భరతనాట్యం, కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత యామినీ కృష్ణమూర్తి(84) కన్నుమూశారు. వృద్థాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో ఏడు నెలలుగా ఢిల్లీలోని అపోలో ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమె శనివారం తుదిశ్వాస విడిచారు.
ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత
ఏపీలోని మదనపల్లెలో జననం.. 17 ఏళ్లకే తొలి ప్రదర్శన
వృద్ధాప్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
రేవంత్‌రెడ్డి, చంద్రబాబు, కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సంతాపం
నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత
న్యూఢిల్లీ, రవీంద్రభారతి ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ భరతనాట్యం, కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత యామినీ కృష్ణమూర్తి(84) కన్నుమూశారు. వృద్థాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో ఏడు నెలలుగా ఢిల్లీలోని అపోలో ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమె శనివారం తుదిశ్వాస విడిచారు. ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1940 డిసెంబరు 20న జన్మించిన యామినీ కృష్ణమూర్తి అసలు పేరు యామినీ పూర్ణతిలకం. ఆమెకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. యామిని కుటుంబం ఆమె చిన్నతనంలోనే తమిళనాడుకు వెళ్లింది. తండ్రి ప్రోత్సాహంతో ఐదేళ్ల వయస్సులో చెన్నైలోని రుక్ష్మిణీదేవి అరండేల్ కళాక్షేత్రంలో యామిని భరతనాట్యం నేర్చుకోవడం ప్రారంభించారు.
అనంతరం వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, చింతా కృష్ణమూర్తి, పసుమర్తి వేణుగోపాలకృష్ణశర్మ వంటి వారి వద్ద కూచిపూడి నేర్చున్నారు. పంకజ చరణ్‌దాస్, కూలూచరణ్ మహాపాత్ర వద్ద ఒడిస్సీ, ఎండీ రామనాథన్ దగ్గర కర్నాటక సంగీతం, కల్పక్కం స్వామినాథన్ దగ్గర వీణ నేర్చుకున్నారు. అనతికాలంలోనే భరతనాట్యం, కూచిపూడిలో ప్రావీణ్యం సంపాదించిన యామిని 1957లో తన 17వ ఏట అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి వేలసంఖ్యలో ప్రదర్శనలిచ్చి దేశ, విదేశాల్లో పేరుగాంచారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నర్తకిగానూ సేవ చేశారు. ఇక, 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2017లో పద్మవిభూషణ్‌తో కేంద్ర ప్రభుత్వం యామినీ కృష్ణమూర్తిని సత్కరించింది.
మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ నుంచి భామావేణి బిరుదు పొందారు. అవివాహితగానే ఉండిపోయిన యామిని తన జీవితాన్ని కళకే అంకితం చేశారు. యామిని స్కూల్ ఆఫ్ డ్యాన్స్ పేరిట ఢిల్లీలో డ్యాన్స్ స్టూడియోను ప్రారంభించి చాలామందికి నాట్యంలో శిక్షణ ఇచ్చారు. యామినీ కృష్ణమూర్తి భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం యామిని స్కూల్ ఆఫ్ డ్యాన్స్‌కు తీసుకురానున్నారు. కాగా, యామినీ కృష్ణమూర్తి మరణం పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరులు సంతాపం తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని తెలంగాణ సీఎం పేర్కొన్నారు.