Tiger Attacks: అమ్మో పులి..!
ABN , Publish Date - Dec 15 , 2024 | 03:27 AM
అటవీ ప్రాంత శివారు గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పెద్దపులులు, చిరుతలు దాడి చేస్తుండటంతో ఎప్పుడేం జరుగుతోందోనని ఆందోళన చెందుతున్నారు.
వరుస దాడులతో అటవీ సమీప గ్రామాల ప్రజలు హడల్
మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్ నుంచి తెలంగాణ వైపు పెద్దపులులు
జాడ గుర్తించేందుకు డ్రోన్లు.. రంగంలోకి ప్రత్యేక బృందాలు
హైదరాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): అటవీ ప్రాంత శివారు గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పెద్దపులులు, చిరుతలు దాడి చేస్తుండటంతో ఎప్పుడేం జరుగుతోందోనని ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్, ములుగు జిల్లాల్లో వరుసగా వెలుగు చూస్తున్న పులి దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్ అటవీ ప్రాంతాల నుంచి పులులు, చిరుతలు ఇతర అడవి జంతువులు తెలంగాణ అటవీ ప్రాంతాల్లోకి వస్తున్నాయి. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తాడోబా అభయారణ్యం నుంచి పెద్ద పులులు తెలంగాణవైపునకు వస్తున్నాయి. నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు జత కట్టే సమయం కావడంతో తెలంగాణ వైపు పెద్ద పులుల రాక ఇటీవల కాలంలో మరింతగా పెరిగింది. ఈ క్రమంలోనే అవి పశువులు, మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజుల వ్యవధిలోనే పులి దాడులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. గత నెలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులి దాడిలో ఓ మహిళ మృతి చెందింది.
ఆసిఫాబాద్ జిల్లాలో లక్ష్మి అనే మహిళపై పెద్ద పులి దాడి చేసి ప్రాణాలు తీసింది. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే దుబ్బగూడెంలో పొలం పనుల్లో ఉన్న రైతు సురేశ్‌పై పులి దాడి చేసి గాయపరిచింది. కొద్ది రోజుల క్రితం తిప్పేశ్వర్ ఆభయారణ్యం నుంచి వచ్చిన పెద్దపులి నిర్మల్ జిల్లాలో అలజడి సృష్టించింది. బోధ్ మీదుగా సారంగపూర్ అటవీ ప్రాంతంలోకి వచ్చింది. సమీప ప్రాంతాల్లో సంచరించి తిరిగి మహారాష్ట్రవైపు వెళ్లినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. బోధ్ మండలంలోనూ చిరుత సంచారం హడలెత్తిస్తోంది. మేకల మందపై చిరుత దాడి చేసింది. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని డెడ్రా గ్రామంలో చిరుత పులి మహిళపై దాడి చేసింది. కొద్ది రోజుల క్రితం చత్తీ్‌సగఢ్ అటవీ ప్రాంతం నుంచి వచ్చిన పులి ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో సంచరించింది. గతంలోనూ పులులు, చిరుతల దాడుల్లో పలువురు అటవీ సమీప ఆవాస ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పులులు, చిరుతలు, ఇతర అడవి జంతువుల దాడుల్లో తరచూ ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటం, తీవ్రంగా గాయపర్చడంతోపాటు పశువుల మందలపైనా దాడులు చేసి నోటకరుచుకుని వెళ్తున్నాయి.
జాగ్రత్తలు చేపట్టిన అటవీ శాఖ
అటవీ సమీప ప్రాంతాల్లో వణ్య ప్రాణుల దాడులుపెరిగిన నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పులి జాడలు గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు ఇటీవలే హైదరాబాద్ అటవీ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి అత్యాధునిక థర్మల్ డ్రోన్‌లను తరలించారు. పగలు, రాత్రి వేళల్లోనూ డ్రోన్లను ఉపయోగించి పులి జాడ తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అవసరమైన ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. జత కోసం తిరుగుతున్న పులి బారినపడకుండా ఉండేందుకు కొంత కాలం పాటు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ప్రజలు పొలం పనులకు వెళ్లాలని సూచిస్తున్నారు. విజిల్స్, మాస్క్‌లు అందిస్తున్నారు. ఒంటరిగా కాకుండా గుంపులు గుంపులుగా తిరగాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.