TG: అక్కగా చెబుతున్నా.. సంస్కారవంతంగా మాట్లాడు
ABN , Publish Date - May 03 , 2024 | 04:56 AM
ఓ అక్కగా చెబుతున్నా. మహిళల గురించి ప్రస్తావించాలనుకుంటే బాధ్యతగా, సంస్కారవంతంగా మాట్లాడాలి’ అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితారెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు.
రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి సబిత హితవు
సీఎం వాడుతున్న భాషపై అభ్యంతరం
ధారూరు, మే 2 (ఆంధ్రజ్యోతి): ‘ఓ అక్కగా చెబుతున్నా. మహిళల గురించి ప్రస్తావించాలనుకుంటే బాధ్యతగా, సంస్కారవంతంగా మాట్లాడాలి’ అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితారెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం వికారాబాద్ జిల్లా ధారూరుకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు.
గద్వాలలో బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణను తొక్కుకుంటూ పోతామని సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడడం, తన గురించీ ప్రస్తావిస్తూ.. ‘మా అక్క పొద్దునో మాట. రాత్రో మాట మాట్లాడుతారు’ అని వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. ‘ఇంటికి పోయి నా మరదలు గీతను అడుగు. నేను ఎట్ల మాట్లాడుతానో చెబుతుంది’ అని రేవంత్‌ను ఉద్దేశించి అన్నారు. మహిళల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యాఖ్యలు చేయాలని సూచించారు. చేవెళ్ల లోక్‌సభ బీఆర్‌ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. ప్రజలు తమ పార్టీ వైపు చూస్తున్నారని, కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు.