Mahabubabad: సోదరుడి నిశ్చితార్థానికి వచ్చి వెళుతూ.. మృత్యు ఒడికి మహిళా శాస్త్రవేత్త
ABN , Publish Date - Sep 02 , 2024 | 03:15 AM
తన సోదరుడి నిశ్చితార్థం కోసం బెంగుళూరు నుంచి స్వగ్రామనికి వచ్చిన మహిళా యువశాస్త్రవేత్త.. తిరుగు ప్రయాణంలో అనూహ్యంగా వరదలో చిక్కుకొని.. మృతి చెందింది.
మహబూబాబాద్ జిల్లాలో వాగులో కొట్టుకుపోయిన కారు.. తండ్రి గల్లంతు
మహబూబాబాద్ వాగులో కొట్టుకుపోయిన కారు
ఖమ్మం, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతిప్రతినిధి): తన సోదరుడి నిశ్చితార్థం కోసం బెంగుళూరు నుంచి స్వగ్రామనికి వచ్చిన మహిళా యువశాస్త్రవేత్త.. తిరుగు ప్రయాణంలో అనూహ్యంగా వరదలో చిక్కుకొని.. మృతి చెందింది. గల్లంతయిన ఆమె తండ్రి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా మరెపెడ మండలం పురుషోత్తమాయిగూడెం వద్ద ఈ విషాదం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాకు చెందిన నునావత్ మోతీలాల్ కుమార్తె అశ్విని(29) బెంగుళూరులోని ఐసీఏఆర్‌లో వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేస్తోంది.
తన సోదరుడి వివాహ నిశ్చితార్థం కోసం 2 రోజుల క్రితమే ఆమె స్వగ్రామానికి వచ్చింది. శుభకార్యం పూర్తికావడంతో తిరిగి బెంగూళురుకు విమానంలో వెళ్లేందుకు ఆదివారం ఉదయం వర్షంలోనే హైదరాబాద్‌కు తన తండ్రి మోతీలాల్‌తో కలిసి కారులో బయలుదేరింది. వారి కారు.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయిగూడెం వద్దకు రాగానే ఉధృతంగా ప్రవహిస్తున్న ఆకేరు వాగులో కొట్టుకుపోయింది.
ఆ సమయంలో అశ్విని బంధువులకు ఫోన్‌చేసి.. జరిగిన ప్రమాదం గురించి చెబుతుండగానే కారు నీటిలో పూర్తిగా మునిగిపోవడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. తండ్రీ కూతుళ్లు నీటిలో కొట్టుకుపోగా.. కొద్దిసేపటికి అశ్వని మృతదేహం లభ్యమైది. మోతిలాల్ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. అశ్వారావుపేటలో ఏజీబీఎస్సీ పూర్తి చేసిన అశ్విని.. జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్‌లో శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. ఏజీబీఎస్సీలో బంగారు పతకం, విశ్వవిద్యాలయం స్థాయిలో ఆరు బంగారు పతకాలను సాధించిన అశ్విని.. అనూహ్యంగా మృతి చెందింది.