Share News

Kaleshwaram: ఆనకట్టలు పదిలమేనా?

ABN , Publish Date - May 24 , 2024 | 04:24 AM

వానాకాలంలోపు ఒకసారి, వానాకాలం పూర్తయ్యాక మరోసారి రాష్ట్రంలోని ఆనకట్టలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలని ఆయా డ్యామ్‌ల చీఫ్‌ ఇంజనీర్లకు రాష్ట్ర ఆనకట్టల భద్రతా సంస్థ (స్టేట్‌ డ్యామ్‌సేఫ్టీ ఆర్గనైజేషన్‌-ఎ్‌సడీఎ్‌సవో) ఆదేశించింది.

Kaleshwaram: ఆనకట్టలు పదిలమేనా?

  • వానాకాలంలోపు ఒకసారి, పూర్తయ్యాక మరోసారి క్షుణ్ణంగా పరిశీలించండి

  • వాటి స్థితిగతులపై నివేదికలివ్వండి

  • డ్యామ్‌ల చీఫ్‌ ఇంజనీర్లకు రాష్ట్ర ఆనకట్టల భద్రతా సంస్థ లేఖ

హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): వానాకాలంలోపు ఒకసారి, వానాకాలం పూర్తయ్యాక మరోసారి రాష్ట్రంలోని ఆనకట్టలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలని ఆయా డ్యామ్‌ల చీఫ్‌ ఇంజనీర్లకు రాష్ట్ర ఆనకట్టల భద్రతా సంస్థ (స్టేట్‌ డ్యామ్‌సేఫ్టీ ఆర్గనైజేషన్‌-ఎ్‌సడీఎ్‌సవో) ఆదేశించింది. ఈ మేరకు గురువారం చీఫ్‌ ఇంజనీర్లకు లేఖలు రాసింది. ఆనకట్టలను పరిశీలించి, వాటి స్థితిగతులపై రెండు వేర్వేరు నివేదికలివ్వాలంటూ లేఖల్లో స్పష్టం చేసింది. ఏడాది క్రితం మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో లోపాలు బయటపడటం, డ్యామ్‌ సేఫ్టీయాక్ట్‌ -2021లోని సెక్షన్‌-31 ప్రకారం వానాకాలం ముందు, తర్వాత తనిఖీలపై కేంద్రం నిలదీయడం... అధికారులను బాధ్యుల్ని చేయడంతో ఎస్‌డీఎ్‌సవో అప్రమత్తమై ఈ మేరకు లేఖలు రాసింది. రాష్ట్రంలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల డ్యామ్‌లు 38, చిన్న డ్యామ్‌లు 184 ఉన్నాయి. డ్యామ్‌ సేఫ్టీ చట్టం అమల్లోకి వచ్చాక.. భూ ఉపరితలం నుంచి 15 మీటర్ల ఎత్తుతో నిర్మాణం జరిగినవి, 500 మీటర్ల పొడవైన క్రెస్ట్‌ కలిగి ఉన్నవి, ప్రతి సెకనుకు 2వేల క్యూబిక్‌ మీటర్ల నీటిని విడుదల చేసే సామర్థ్యం కలిగి ఉన్న డ్యామ్‌ లు దాని పరిధిలోకి వెళ్లిపోయాయి.


ఫలితంగా నాగార్జునసాగర్‌ నుంచి పాలేరు దాకా డ్యామ్‌లన్నీ కూడా ఈ చట్టపరిధిలోకి వచ్చేశాయి. వీటిలో ఏ మాత్రం లోపాలున్నా.. వాటి ని మరమ్మతు చేయించే బాధ్మత సంబంధిత చీఫ్‌ ఇంజనీర్‌ (సీఈ)దే. సీఈలను డ్యామ్‌లకు ఓనర్లుగా చట్టం గుర్తించింది. దాంతో డ్యామ్‌ల రక్షణలో ఏ మాత్రం నిర్లక్ష్యం వ హించి నా సంబంధిత యంత్రాంగంపై కఠిన చర్యలుంటాయి. నిర్వహణ లోపంతో ప్రాణనష్టం జరిగితే రెండేళ్ల జైలుశిక్ష పడేలా చట్టాన్ని రూపకల్పన చేశారు. స్టేట్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌/అథారిటీ ఆదేశాలను పాటించకపోతే ఏడాది జైలుశిక్ష లేదా జరిమానా రెండింటిలో ఏదైనా ఒకటి లేదా రెండు కలిపి విధించే అధికారం ఈ చట్టం ఇచ్చింది. దాంతో స్టేట్‌ ఆర్గనైజేషన్‌.. కాళేశ్వరం బ్యారేజీల అనుభవంతో అప్రమత్తమై, తక్షణమే వానాకాలం ముందు పరిశీలన చేసి, కట్టల స్థితిగతులపై నివేదికను సమర్పించాలని, అలాగే వానాకాలం పూర్తయ్యాక అక్టోబరు 1 నుంచి నవంబరు 30 లోపు మరోసారి పరిశీలన చేసి కట్టల్లో లోపాలపై నివేదికలు ఇవ్వాలని నిర్దేశించింది. అలాగే ఇంజనీర్లు, టెక్నికల్‌ ఉద్యోగులు వానాకాలం అంతా కూడా డ్యామ్‌లపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని నిర్దేశించారు.


  • కాళేశ్వరంపై కమిషన్‌కు నిపుణుల కమిటీ సహాయం

  • ఐదుగురితో ఏర్పాటు చేసిన ప్రభుత్వం

కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీల్లో లోపాలు వెలికితీయడంతోపాటు బాధ్యులను గుర్తించేందుకు జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ తో ఏర్పాటు చేసిన విచారణ కమిషన్‌కు సాంకేతిక అంశాల్లో సహాయం చేసేందుకు ఐదుగురు నిపుణులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా సివిల్‌ స్ట్రక్చరల్‌ అంశాల కోసం ఎన్‌ఐటీ వరంగల్‌ పూర్వ ప్రొఫెసర్‌ సి.బి.కామేశ్వరరావు, మెకానికల్‌ రంగంపై డ్యామ్‌ సేఫ్టీ రివ్యూ ప్యానల్‌ నిపుణుడు మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ కె.సత్యనారాయణ, జియో టెక్నికల్‌ అంశాలపై ఎన్‌ఐటీ వరంగల్‌ ప్రొఫెసర్‌ కె.రమణమూర్తి, హైడ్రాలజీ/ప్లానింగ్‌పై ఐఐటీ హై దరాబాద్‌కు చెందిన టి.శశిధర్‌, క్షేత్రస్థాయి నిపుణుడిగా, కమిటీ కన్వీనర్‌గా మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ కె.శ్రీకాంత్‌ను నియమిస్తూ ఈఎన్‌సీ(జనరల్‌) జి.అనిల్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించి లోపాలపై జస్టిస్‌ చంద్రఘో్‌షకు సహాయం అందించనుంది. కాగా, కాళేశ్వరం బ్యారేజీలపై ఫిర్యాదులు సమర్పించడానికి కమిషన్‌ ఈ నెల 31 దాకా అవకాశం ఇచ్చింది. ఆయా బ్యారేజీలపై విచారణ జరిపి జూన్‌ 30లోపు నివేదిక అందించాలని కమిషన్‌ను ప్రభుత్వం కోరింది. ప్రత్యక్ష విచారణ జూన్‌/జూలై నెలల్లో జరగనుండగా నివేదిక ఆగస్టు లేదా సెప్టెంబరులో ప్రభుత్వానికి చేరే అవకాశం ఉంది.

Updated Date - May 24 , 2024 | 04:24 AM