Share News

Uke Abbayya: ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య కన్నుమూత

ABN , Publish Date - Nov 25 , 2024 | 04:09 AM

సీనియర్‌ రాజకీయవేత్త, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య(73) ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున చనిపోయారు.

Uke Abbayya: ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య కన్నుమూత

  • కొంత కాలంగా అనారోగ్యం.. చికిత్స పొందుతూ మృతి

ఇల్లెందు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): సీనియర్‌ రాజకీయవేత్త, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య(73) ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున చనిపోయారు. ఆయన మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం హన్మంతులపాడులోని తన స్వగృహానికి తరలించారు. ఆదివాసీ గిరిజన కుటుంబానికి చెందిన అబ్బయ్య ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఐ నాయకుడిగా ఎదిగారు. పార్టీలో పలు కీలక పదవులను చేపట్టారు.


ఇల్లెందులో నక్సలైట్‌ పార్టీలను దీటుగా ఎదుర్కొంటూ పార్టీ విస్తరణకు కృషి చేశారు. 1983లో బూర్గంపాడు నుంచి, 1994లో ఇల్లెందు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరి, 2009లో ఇల్లెందు నుంచే పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మొత్తంగా ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అబ్బయ్యకు భార్య ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు.

Updated Date - Nov 25 , 2024 | 04:09 AM