Share News

Online Groceries: ఆన్‌లైన్‌ అంగడి.. దోపిడీ

ABN , Publish Date - Oct 27 , 2024 | 03:28 AM

ఆన్‌లైన్‌ గ్రాసరీల్లో కూరగాయల రేట్లు జనాల్ని హడలెతిస్తున్నాయి. హోల్‌సేల్‌, రిటైల్‌ మార్కెట్లతో పోల్చితే భారీ వ్యత్యాసం కనిపిస్తోంది.

Online Groceries: ఆన్‌లైన్‌ అంగడి.. దోపిడీ

హైదరాబాద్‌ కొండాపూర్‌లో ఉండే నితిన్‌, కావ్య దంపతులు ఐటీ ఉద్యోగులు. ఉదయాన్నే ఆఫీస్‌కు బయల్దేరి సాయంత్రం ఆరున్నర తర్వాతే ఇంటికి తిరిగొస్తుంటారు. శని, ఆదివారాలు సెలవు ఉన్నప్పటికీ.. పని ఒత్తిడి బడలిక నుంచి విశ్రాంతి కోసం, పిల్లలతో గడపటం కోసం ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉంటారు. కుటుంబానికి కావాల్సిన నిత్యావసర సరుకులు, కూరగాయలను ఆన్‌లైన్‌లోనే ఆర్డర్‌ చేస్తుంటారు. ఎప్పటిలాగే శనివారం కూరగాయల కోసం ఆన్‌లైన్‌లో చూస్తే.. రేట్లు భారీగా అనిపించాయి. కిలో దొండకాయ రూ.132, క్యారెట్‌ రూ.118, టమాట రూ.94, వంకాయ రూ.128 ఉన్నాయి. ఇంత ధరలున్నాయేమని.. ఓ సంచీ తీసుకొని రైతుబజార్‌కు వెళ్లి చూస్తే.. అక్కడి ధరలకు ఆన్‌లైన్‌ ధరలకు పోలికే లేదు. దీంతో ఇక మీదట ఆన్‌లైన్‌ ఆర్డర్లను తగ్గించి.. బయటకు వెళ్లి స్వయంగా కొనుక్కురావటమే మేలని నితిన్‌, కావ్య నిర్ణయించుకున్నారు.

  • కూరగాయల ధరలు మూడింతలు అధికం

  • బెంబేలెత్తుతున్న కొనుగోలుదారులు

  • హేతుబద్ధత లేకుండా అడ్డగోలు రేట్లు

  • ఇష్టానుసారంగా నిర్ణయిస్తున్న కంపెనీలు

  • నియంత్రణ లేని ప్రభుత్వ యంత్రాంగం

  • తమ పరిధి కాదంటున్న విభాగాలు

ఆంధ్రజ్యోతి పరిశీలనలో శనివారం కూరగాయల ధరలు (కిలోకు)

కూరగాయలు హోల్‌సేల్‌ రైతుబజార్‌ జెప్టో స్విగ్గీ బిగ్‌బాస్కెట్‌ బ్లింకిట్‌

బీరకాయ 50 55 114 100 99 98

ఆలుగడ్డ 32 37 57 56 50 56

దోసకాయ 35 40 108 98 78 86

మిర్చి 60 65 150 140 100 120

వంకాయ 30 35 128 112 84 84

టమాట 32 35 94 88 72 92

దొండకాయ 30 35 120 132 80 104

క్యారెట్‌ 40 45 118 104 90 118

ఉల్లిగడ్డలు 30 34 71 68 68 70

బీన్స్‌ 110 115 264 280 206 352

క్యాబేజీ (ఒకటి) 13 16 46 36 32 36

సొరకాయ (కిలో) 14 17 50 40 44 35

హైదరాబాద్‌ సిటీ, బోయిన్‌పల్లి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ గ్రాసరీల్లో కూరగాయల రేట్లు జనాల్ని హడలెతిస్తున్నాయి. హోల్‌సేల్‌, రిటైల్‌ మార్కెట్లతో పోల్చితే భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. శనివారం హోల్‌సేల్‌ మార్కెట్‌లో కిలో టమాటా రూ.32-35 ఉండగా.. ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌కు చెందిన జెప్టోలో రూ.94, బ్లింకిట్‌లో రూ.92, స్విగ్గీలో రూ.88, బిగ్‌ బాస్కెట్‌లో రూ.72 ధర ఉంది. నాణ్యత పరంగా ఆన్‌లైన్‌లో మంచివి దొరుకుతాయనుకున్నా.. ఇంత వ్యత్యాసం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక మోస్తరు రకానికి, నెంబర్‌వన్‌ రకానికి మధ్య ధరలో గరిష్ఠంగా 15 శాతం కంటే ఎక్కువ తేడా ఉండే అవకాశం లేదు. కానీ, ఇక్కడ ఏకంగా 200 శాతం అధికంగా ధరలు ఉండటం గమనార్హం. దీంతో ఆన్‌లైన్‌లో కూరగాయలను కొనేందుకు వివిధ వర్గాల ప్రజలు వెనకంజ వేస్తున్నారు.


  • రోజుకు 14 వేల క్వింటాళ్ల విక్రయం

హైదరాబాద్‌ నగరంలోని బోయిన్‌పల్లి, గుడిమల్కాపూర్‌లో భారీ కూరగాయల మార్కెట్లు ఉన్నాయి. వీటితోపాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో 11 రైతుబజార్లు ఉన్నాయి. వీటన్నింటిలో రోజుకు సగటున 14 వేల క్వింటాళ్ల కూరగాయలను విక్రయిస్తుంటారు. సాధారణ ప్రజల కంటే హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు కూరగయాలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. భారీవర్షాల వంటి సందర్భాల్లో కూరగాయల ధరలు పెరుగుతుంటాయి. అయితే కొంతకాలంగా హోల్‌సేల్‌ మార్కెట్లలో దళారుల రాజ్యం నడుస్తోంది.


హోల్‌సేల్‌ మార్కెట్లకు వచ్చే కూరగాయలను దళారులు టన్నుల కొద్ది కొనేసి, ఆ తర్వాత వాటి ధర 50 శాతానికిపైగా పెంచి రిటైల్‌ వ్యాపారులకు అమ్ముతున్నారు. రిటైల్‌ వ్యాపారులు ధరలను 50-60 శాతం పెంచి నగరవాసులకు అమ్ముతున్నారు. దీంతో రైతుల దగ్గరి నుంచి ప్రజల వద్దకు చేరే సరికి కూరగాయల రేట్లు రెట్టింపునకుపైగా పెరుగుతున్నాయి. ఇది సరిపోదన్నట్లుగా ఆన్‌లైన్‌ అమ్మకాలు చేస్తున్న పలు సంస్థలు వాటిని మరింత భారీగా పెంచి డోర్‌ డెలివరీ చేస్తున్నాయి.


  • ఆన్‌లైన్‌ ధరలపై నియంత్రణ ఏది?

ఆన్‌లైన్‌ ద్వారా కూరగాయల విక్రయాలు చేపడుతున్న పలు (క్విక్‌ కామర్స్‌) కంపెనీలు మార్కెట్‌ రేట్ల కంటే దాదాపు మూడింతల చార్జీలతో అమ్మకాలు సాగిస్తున్నాయి. మార్కెట్‌లో పచ్చి మిర్చి కిలో రూ.60-65కు లభిస్తుండగా జెప్టో, స్విగ్గీ వంటి సంస్థలు ఆన్‌లైన్‌లో కిలో రూ.140-150 ధరతో విక్రయిస్తున్నాయి. రైతుబజార్‌లో 5 రకాల కూరగాయలకు కిలో చొప్పున రూ.205 ఖర్చయితే ఆన్‌లైన్‌లో వాటికి రూ.574 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ ధరల ప్రక్రియను పలువురు వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. ఒక హేతుబద్ధత అంటూ లేకుండా ఇష్టానుసారంగా ధరలు నిర్ణయించటమేమిటని నిలదీస్తున్నారు. ఆన్‌లైన్‌ కూరగాయల ధరలపై వినియోగదారులు.. ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.


తూనికలు కొలతల శాఖ, మార్కెటింగ్‌ శాఖ, పౌరసరఫరాల సంస్థ.. ఇలా ఎవరికి వారే తమ పరిధి కాదన్నట్లుగా వ్యవహరిస్త్తున్నారు. దీంతో భారీ ఎత్తున రేట్లు పెంచి ఆన్‌లైన్‌లో అమ్మకాలు జరుపుతుంటే ప్రభుత్వం తరఫున పర్యవేక్షించే వారు లేకుండా పోయారు. ఈ పరిస్థితి మారాలని, ధరల నిర్ణయంలో పారదర్శకత, హేతుబద్ధత ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని రైతు బజార్లలో బోర్డుపై ఓ ధర కన్పిస్తే అమ్మకాల్లో మరో ధర ఉంటోంది. అదేమని అడిగితే బోర్డుపైన పెట్టిన ధరకు మంచివి రావు.. నాణ్యత లేనివైతే వస్తాయి.. కావాలంటే అవి తీసుకోవచ్చంటారు. అటు హోల్‌సేల్‌ మార్కెట్ల నుంచి ఇటు రైతుబజార్ల వరకూ.. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ధరలపై నియంత్రణ ఉండటం లేదని ప్రజలు వాపోతున్నారు.


  • మార్కెట్లను శాసిస్తున్న దళారులు

బోయిన్‌పల్లి, గుడిమల్కాపూర్‌ మార్కెట్లను, రైతు బజార్లను కొంతమంది దళా రులు శాసిస్తూ కూరగాయల వ్యాపారం సాగిస్తున్నారు. హోల్‌సేల్‌ మార్కెట్లకు తాండూరు, వికారాబాద్‌లతోపాటు ఏపీలోని అనంతపురం, కర్నూలు, మదనపల్లి, ప్రకాశం జిల్లా మార్టుర్‌ మొదలైన ప్రాంతాల నుంచి కూరగాయలు వాహనాల్లో వస్తుంటాయి. వాటిని గంపగుత్తరేటు కట్టి దళారులు హోల్‌సేల్‌గా కొంటారు. శనివారం బోయిన్‌పల్లి మార్కెట్లో టమాటను సగటున కిలోకు రూ.16 చొప్పున కొనుగోలు చేశారు. ఆ తర్వాత అదే టమాటను రూ.26-32 మేర రిటైల్‌ వ్యాపారులకు విక్రయించారు. రైతుబజార్లలో కిలో టమాటను రూ.35-45 వరకు అమ్ముతుండగా, ఆన్‌లైన్‌ మార్కెట్లకు చేరే సరికి ధర రూ.72-94కు పెరిగింది.

Updated Date - Oct 27 , 2024 | 03:28 AM