Share News

Siddipet: మల్లన్నసాగర్‌లోకి కొనసాగుతున్న ఎత్తిపోతలు

ABN , Publish Date - Sep 02 , 2024 | 05:09 AM

సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్‌ గ్రామ శివారులోని మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి.

Siddipet: మల్లన్నసాగర్‌లోకి కొనసాగుతున్న ఎత్తిపోతలు

  • ఆదివారం నుంచి ఆరు మోటార్లతో పంపింగ్‌

తొగుట, సెప్టెంబరు 1: సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్‌ గ్రామ శివారులోని మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వస్తున్న వరద నీటిని కరీంనగర్‌ జిల్లాలోని మిడ్‌మానేరుకు.. అక్కడి నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి.. దాని నుంచి సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్‌కు.. అక్కడి నుంచి మల్లన్నసాగర్‌లోకి గోదావరి నీటిని ఎత్తిపోస్తున్నారు. 50 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్‌లో ప్రస్తుతం 11.65 టీఎంసీల నీరు ఉంది. వారం రోజులుగా 3.05 టీఎంసీలను మల్లన్నసాగర్‌లోకి ఎత్తిపోశారు.


అందులో నుంచి కొండపోచమ్మసాగర్‌కు 1.50 టీఎంసీలను విడుదల చేశారు. మల్లన్నసాగర్‌లో నీటిని నిల్వ చేయడం వల్ల కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్‌తో పాటు, దుబ్బాక ప్రధాన కాలువ ద్వారా దుబ్బాక, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లోని 95 చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలను నింపి లక్షా 25 వేల ఎకరాలకు సాగు నీరందించడానికి అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. సాగు అవసరాల దృష్ట్యా రిజర్వాయర్‌లోకి 15 టీఎంసీలను ఎత్తిపోయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మల్లన్నసాగర్‌ డీఈ చెన్ను శ్రీనివాస్‌ తెలిపారు. అందుకోసం ఆదివారం సాయంత్రం నుంచి ఆరు పంపుల ద్వారా రోజూ 7,800 క్యూసెక్కుల నీటి ఎత్తిపోతలను ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - Sep 02 , 2024 | 05:09 AM