Share News

TG: అడకత్తెరలో 2 వేల మంది హోంగార్డులు!

ABN , Publish Date - May 26 , 2024 | 04:35 AM

తెలంగాణ పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న సుమారు రెండు వేల మంది హోంగార్డుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రస్తుత ఏపీకి చెందిన పలు జిల్లాల నుంచి హోంగార్డులు విధుల్లో చేరారు. రాష్ట్ర విభజన సమయంలో సుమారు 2 వేల మంది ఏపీ స్థానికత కలిగిన హోంగార్డులు తెలంగాణలోనే ఉండిపోయారు.

TG: అడకత్తెరలో 2 వేల మంది హోంగార్డులు!

  • తెలంగాణలో నాన్‌ లోకల్‌.. ఏపీలో కోటా వర్తించదు

  • సొంత ఊళ్లకు పంపించాలని వినతి

హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న సుమారు రెండు వేల మంది హోంగార్డుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రస్తుత ఏపీకి చెందిన పలు జిల్లాల నుంచి హోంగార్డులు విధుల్లో చేరారు. రాష్ట్ర విభజన సమయంలో సుమారు 2 వేల మంది ఏపీ స్థానికత కలిగిన హోంగార్డులు తెలంగాణలోనే ఉండిపోయారు. అలాగే తెలంగాణ స్థానికత కలిగిన 500 మందికిపైగా హోంగార్డులు ఏపీలో విధులు నిర్వహిస్తున్నారు. హోంగార్డుల గౌరవ వేతనం తక్కువగా ఉండటం, ఆర్జిత సెలవులు లేకపోవడంతో వారు సొంత ఊళ్లకు వెళ్లి తల్లిదండ్రుల్ని చూసుకోవడం ఇబ్బందికరంగా మారింది.


తెలంగాణ రాష్ట్రంలో గత సీఎం కేసీఆర్‌ దృష్టికి తమ సమస్య తీసుకెళ్లగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా నెరవేరలేదు. ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి దృష్టికి హోంగార్డులు తమ సమస్య తీసుకెళ్లగా సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని భరోసా ఇచ్చినా ఉపయోగం లేకుండాపోయింది. ఏళ్లు గడుస్తున్నా ఇరు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోకపోవడంతో ఏపీ స్థానికత కలిగిన హోంగార్డులు తెలంగాణలో చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో తమ సమస్యపై దృష్టి సారించి సొంతూళ్లకు పంపించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌ రెడ్డిని హోంగార్డులు కోరుతున్నారు. ఏపీలో పనిచేసే తెలంగాణ ప్రాంత హోంగార్డులు కూడా ఇవే సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారిని ఇక్కడకు రప్పించి, తమను అక్కడకు పంపించాలని కోరుతున్నారు. చిన్నపాటి ఉద్యోగం చేసే తమ విషయంలో మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలని హోంగార్డులు ప్రభుత్వాల్ని వేడుకుంటున్నారు.


ఇక్కడ ఇలా.. అక్కడ అలా!

పోలీస్‌ శాఖలో హోంగార్డుగా పనిచేసే వారికి కానిస్టేబుల్‌ నియామకాల్లో ప్రత్యేక కోటా ఉంటుంది. అయితే ఏపీ స్థానికత కలిగి ఉండటంతో తెలంగాణ పోలీస్‌ నియామకాల్లో వారిని నాన్‌ లోకల్‌గా పరిగణించి కోటా వర్తింపజేయడం లేదు. ఏపీ పోలీస్‌ నియామకాల్లో తెలంగాణలో విధులు నిర్వహిస్తున్నందున కోటా వర్తించదని చెబుతున్నారు. ఉద్యోగ నియామకాల్లోనూ తమ కోటాను ఉపయోగించుకునే పరిస్థితి లేకుండా పోయిందని హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 26 , 2024 | 04:35 AM