Smita Sabharwal : సివిల్స్‌లో దివ్యాంగుల కోటా అవసరమా?
ABN , Publish Date - Jul 22 , 2024 | 05:25 AM
ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పోస్టుల ఎంపికలో దివ్యాంగులకురిజర్వేషన్ అవసరమా? అని సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ ప్రశ్నించారు. ఆదివారం ఆమె తన ట్విటర్ ఖాతా ద్వారా ఈ అంశంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
క్షేత్ర స్థాయిలో పని చేయాల్సిన ఐఏఎస్, ఐపీఎస్‌లకు శారీరక దృఢత్వం కావాలి
వైకల్యం ఉన్న వారిని పైలట్‌గా విమాన సంస్థలు నియమిస్తాయా?
సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఖండించిన పలువురు.. క్షమాపణకు డిమాండ్
హైదరాబాద్, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పోస్టుల ఎంపికలో దివ్యాంగులకురిజర్వేషన్ అవసరమా? అని సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ ప్రశ్నించారు. ఆదివారం ఆమె తన ట్విటర్ ఖాతా ద్వారా ఈ అంశంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సివిల్ సర్వీసుల్లో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఎక్కువ గంటలు పని చేయాల్సిన ఐఏఎస్, ఐపీఎస్ వంటి పోస్టుల్లో దివ్యాంగ కోటా ఎందుకని ఆమె ప్రశ్నించారు.
సివిల్స్ సర్వీస్ ఉద్యోగాలకు ఎంపిక చేసే విషయంలో అనుసరిస్తున్న విధానాలపై కొంతకాలంగా దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అంగ వైకల్యం ఉందంటూ నకిలీ సర్టిఫికెట్ సమర్పించి సివిల్ సర్వీసులో ప్రవేశించారని పూజా ఖేద్కర్ అనే ఐఏఎస్ ట్రెయినీ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆదివారం స్మితా సభర్వాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసు ఉద్యోగాలకు ఎక్కువగా క్షేత్ర స్థాయిలో పని చేయాల్సి ఉంటుందని, ప్రజల కష్టాలను నేరుగా వినాల్సి ఉంటుందని, ఇందుకు శారీరక దృఢత్వం
అవసరమని సబర్వాల్ చెప్పారు. కొన్నిసార్లు కఠిన సమయాల్లో పని చేయాల్సి ఉంటుందని తన ట్విటర్ పోస్టులో ప్రస్తావించారు. వైకల్యం ఉన్న వారిని గౌరవిస్తున్నానని, కానీ వైకల్యం ఉన్న ఫైలట్‌ను విమానయాన సంస్థలు నియమించుకుంటాయా? వైకల్యం ఉన్న సర్జన్ సేవలను మీరు విశ్వసిస్తారా? అని ఆమె ప్రశ్నించారు. ఆమె వ్యాఖ్యలపై ట్విటర్‌లో, బయటా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి.
దివ్యాంగ రిజర్వేషన్లపై స్మిత చేసిన వ్యాఖ్యల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ సివిల్ సర్వెంట్, సివిల్స్ పోటీ పరీక్షల శిక్షకురాలు బాలలత డిమాండ్ చేశారు. ఏ అధికారంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారని ప్రశ్నించారు. ప్రత్యేక చట్టం ద్వారా అమల్లోకి వచ్చిన ఈ కోటాపై ఉన్నత బాధ్యతల్లో ఉన్న ఒక అధికారి ఈ విధంగా వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఆమె వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించారు.
ఇలాంటి వ్యాఖ్యల కారణంగా దివ్యాంగుల పట్ల సమాజంలో చిన్నచూపు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దివ్యాంగుల హక్కుల కోసం పోరాడుతున్న వసుంధర కొప్పుల, నల్లగొండ శ్రీనివాసులు, అడివయ్య, వెంకట్ తీవ్రంగా స్పందించారు. సబర్వాల్ వెంటనే దివ్యాంగులకు క్షమాపణను చెప్పాలని డిమాండ్ చేశారు.