Prasad Kumar: ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడండి
ABN , Publish Date - Sep 22 , 2024 | 03:54 AM
ప్రభుత్వ నిధుల వ్యయంలో అవకతవకలు, లోపాలు ఎత్తి చూపుతూ ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలంటూ అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) సభ్యులకు స్పీకర్ ప్రసాద్ కుమార్ సూచించారు.
పీఏసీ సభ్యులకు స్పీకర్ ప్రసాద్‌కుమార్ సూచన
అరికెపూడి అధ్యక్షతన జరిగిన తొలి సమావేశం
హైదరాబాద్, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ నిధుల వ్యయంలో అవకతవకలు, లోపాలు ఎత్తి చూపుతూ ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలంటూ అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) సభ్యులకు స్పీకర్ ప్రసాద్ కుమార్ సూచించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడాలన్నారు. అసెంబ్లీలోని కమిటీ హాల్లో శనివారం పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ అధ్యక్షతన కమిటీ తొలి సమావేశం జరిగింది. ఇందులో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను ఉద్దేశించి స్పీకర్ ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ.. పీఏసీ బాధ్యతలు మిగిలిన కమిటీలతో పోలిస్తే భిన్నంగా ఉంటాయన్నారు.
ఈ కమిటీ అన్ని ప్రభుత్వ శాఖలపైనా సమీక్ష నిర్వహించవచ్చునన్నారు. కాగా, పీఏసీ కమిటీకి తనను చైర్మన్‌గా నియమించినందుకు గర్వంగా భావిస్తున్నానని అరికెపూడి గాంధీ అన్నారు. పార్టీలకతీతంగా, నిష్పక్షపాతంగా పని చేస్తూ లక్ష్యాలు సాధించడంలో సమష్టిగా కృషి చేస్తామన్నారు. కాగా, పీఏసీ తొలి సమావేశాన్ని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. అరికెపూడిని చైర్మన్‌గా ఎలా నియమిస్తారని మంత్రి శ్రీధర్ బాబును పీఏసీ సభ్యులు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ తదితరులు నిలదీశారు. తాము అడిగిన ప్రశ్నలకు పీఏసీలో ఎలాంటి సమాధానం చెప్పడం లేదని, అందుకే వాకౌట్ చేశామని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మరోవైపు.. పీఏసీ ఔన్నత్యాన్ని తగ్గించేందుకు బీఆర్‌ఎస్ సభ్యులు కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే, పీఏసీ సభ్యుడు యెన్నం శ్రీనివా్‌సరెడ్డి ఆరోపించారు.