Flood Inflow: రేపు శ్రీశైలం 6 గేట్ల ఎత్తివేత!
ABN , Publish Date - Jul 29 , 2024 | 03:39 AM
నిరుటి ఇబ్బందికర పరిస్థితి మళ్లీ తలెత్తకుండా చేస్తూ.. వానాకాలం పంటలకు ఊపిరి పోస్తూ.. శ్రీశైలం నుంచి కృష్ణమ్మ దిగువకు పరుగులు పెట్టనుంది. జూలై నెలలోనే బిరబిరా తరలివస్తూ.. నాగార్జున సాగర్‌ను చేరనుంది.
పాజెక్టుకు 4.41 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో
జూరాల, సుంకేశుల నుంచి భారీగా వరద!
ఈసారి జూలైలోనే తెరుచుకోనున్న గేట్లు
నాగార్జున సాగర్‌కు 62 వేల క్యూసెక్కులు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): నిరుటి ఇబ్బందికర పరిస్థితి మళ్లీ తలెత్తకుండా చేస్తూ.. వానాకాలం పంటలకు ఊపిరి పోస్తూ.. శ్రీశైలం నుంచి కృష్ణమ్మ దిగువకు పరుగులు పెట్టనుంది. జూలై నెలలోనే బిరబిరా తరలివస్తూ.. నాగార్జున సాగర్‌ను చేరనుంది. గత ఏడాది తక్కువ వర్షపాతం నమోదు కావడంతో శ్రీశైలం గేట్లు తెరుచుకోలేదు. ఈసారి ఊహించని వరదతో రావడంతో ప్రాజెక్టు కళకళలాడుతోంది. రెండు రోజుల్లో డ్యాం పూర్తిగా నిండే అవకాశం ఉంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి ఉధృతి పెరుగుతుండడంతో జలాశయం గేట్లను ఎత్తేందుకు ఇంజనీర్లు సన్నాహాలు చేస్తున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు 6 గేట్లను ఎత్తనున్నారు. కాగా, శ్రీశైలానికి జూరాల, సుంకేశుల నుంచి 4,41,222 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.
జూరాల నుంచి 3,60,483 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. ఈ ప్రాజెక్టు 41 గేట్లు ఎత్తారు. సుంకేశుల ద్వారా 1,46,746 క్యూసెక్కుల వరద వస్తోంది. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి శ్రీశైలం మట్టం 885 అడుగులకు గాను 873.40 అడుగులుగా నమోదైంది. నీటి నిల్వ 215.807 టీఎంసీలకు 156.38 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 62,847 క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. సాగర్ నీటి మట్టం 510.30 అడుగులకు (132.00 టీఎంసీలు) చేరింది. కుడి కాలువ ద్వారా 5,882, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 400 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. మరోవైపు, ఆల్మట్టికి 2,68,222 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 3.25 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ జలాశయానికి 3.20లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 30 గేట్లు ఎత్తి 3,27,366 క్యూసెక్కులను విడిచిపెడుతున్నారు. కాగా, తుంగభద్ర జలాశయానికి 1,27,100 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా 33 గేట్లను ఎత్తి 1,50,798 క్యూసెక్కులను దిగువకు పంపిస్తున్నారు. ఈప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 105 టీఎంసీలకు గాను 98.21 టీఎంసీలకు చేరడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు వదులుతున్నారు. కాగా, మూసీలోకి వరద చేరుతుండడంతో 645 అడుగులు పూర్తి సామర్థ్యం కాగా.. 643.20 అడుగులకు చేరుకుంది.
మేడిగడ్డకు తగ్గిన వరద
కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డకు వరద క్రమంగా తగ్గుతోంది. ఆదివారం 4.29 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. 85 గేట్లను ఎత్తి దీన్నంతటినీ దిగువకు పంపిస్తున్నారు. బ్యారేజీ వద్ద గోదావరి 5.50 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. అన్నారంలోకి 8,147, శ్రీరాంసాగర్‌లోకి 20 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 17.730 టీఎంసీల మేర నీళ్లు ఉన్నాయి. 20,643 క్యూసెక్కుల వరద వస్తోంది. పెద్దపల్లి జిల్లా నంది పంప్‌హౌస్, కరీంనగర్ జిల్లా గాయత్రి పంప్‌హౌస్ నుంచి 12,600 క్యూసెక్కులను మధ్య మానేరుకు తరలిస్తున్నారు. కాగా, భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది.
శనివారం అర్ధరాత్రి 12 గంటలకు 53.9 అడుగులకు చేరిన నీటిమట్టం ఆదివారం ఉదయం 7.30 గంటలకు 52.9 అడుగులకు పడిపోవడంతో మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఆదివారం రాత్రి 47 అడుగులకు పడిపోవడంతో రెండో ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించారు. సోమవారం నాటికి మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలం అశోకనగర్ కొత్తకాలనీ, ఏఎంసీ కాలనీలు ఇంకా నడుం లోతు నీళ్లలోనే ఉన్నాయి. 106 కుటుంబాలకు చెందిన 343 మంది పునరావాస కేంద్రంలోనే ఉన్నారు. భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం కరివారిగూడెం గ్రామానికి చెందిన పశువుల కాపరి రమావత్ వెంకటేశ్వర్లు (60) పెద్ద వాగులో పడి మృతిచెందాడు.
నిజామాబాద్, ఆదిలాబాద్‌ను వీడని ముసురు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను ముసురు వర్షాలు వీడడం లేదు. ఆదివారం సగటున 3.68 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లాలోనూ పది రోజూ వర్షం కురిసింది. కుమరంభీం ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తారు. 6 రోజుల పాటు నిలిపివేసిన ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం సందర్శనను పునరుద్ధరించారు.