Hyderabad: ఇంగ్లండ్‌లో పీహెచ్‌డీ సీటు.. రూ.కోటి స్కాలర్‌షిప్..
ABN , Publish Date - Jun 28 , 2024 | 05:21 AM
సామాజిక శాస్త్రవేత్తగా అణగారిన వర్గాలకు ఉపయోగపడే పరిశోధనలు చేయాలనే ఆ విద్యార్థి కలకు పేదరికం ఆటంకంగా మారింది. ఇంగ్లండ్‌లోని విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేసే అవకాశం దక్కినా, రూ.కోటి విలువ చేసే ఉపకార వేతనానికి ఎంపికైనా..ప్రయాణ ఖర్చులకు అవసరమైన డబ్బు లేక సాయం కోసం ఎదురు చూస్తున్నాడు ఆ విద్యార్థి.
ప్రయాణానికి డబ్బుల్లేక ఓ విద్యార్థి అవస్థ
వీసా దరఖాస్తుకు ముంచుకొస్తున్న గడువు
దాతల సాయం కోసం ఎదురుచూపు
హైదరాబాద్ సిటీ, జూన్ 27(ఆంధ్రజ్యోతి): సామాజిక శాస్త్రవేత్తగా అణగారిన వర్గాలకు ఉపయోగపడే పరిశోధనలు చేయాలనే ఆ విద్యార్థి కలకు పేదరికం ఆటంకంగా మారింది. ఇంగ్లండ్‌లోని విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేసే అవకాశం దక్కినా, రూ.కోటి విలువ చేసే ఉపకార వేతనానికి ఎంపికైనా..ప్రయాణ ఖర్చులకు అవసరమైన డబ్బు లేక సాయం కోసం ఎదురు చూస్తున్నాడు ఆ విద్యార్థి. జూలై రెండో వారంలోపు వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా.. ఈ లోగా డబ్బు సమకూరకుంటే పీహెచ్‌డీ అవకాశం, ఉపకార వేతనం వృథా అవుతాయని ఆందోళన చెందుతున్నాడు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) సోషయాలజీ విద్యార్థి పందుల నిఖిల్ కుమార్ పరిస్థితి ఇది. నిఖిల్ తండ్రి వెంకటేశ్వరరావు పెయింటింగ్ లాంటి రోజు వారీ కూలీ పనులు చేస్తుంటారు. ఏ రోజుకు ఆ రోజు తిండి గింజలు వెతుక్కొనే పరిస్థితి ఆ కుటుంబానిది.
ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఉచితంగా విద్య అభ్యసించిన నిఖిల్.. హెచ్‌సీయూలో సోషయాలజీ(ఇంటిగ్రేటెడ్) కోర్సు పూర్తి చేశారు. ఇంగ్లండ్‌లోని ‘యూనివర్సిటీ ఆఫ్ బాత్’లో సామాజికశాస్త్ర విభాగంలో పీహెచ్‌డీ సీటు సాధించారు. అలాగే, అంతర్జాతీయ స్థాయిలో గట్టి పోటీ ఎదుర్కొని ప్రతిష్టాత్మకమైన ‘ఎకనమిక్ అండ్ సోషల్ రీసెర్చ్ కౌన్సిల్’(ఈఎ్‌సఆర్సీ) ఉపకార వేతనానికి ఎంపికయ్యారు. దీంతో ఇంగ్లండ్‌లో నాలుగేళ్ల పరిశోధనా కాలానికి అవసరమైన ఖర్చులతోపాటు ప్రతి నెలా స్కాలర్‌షిప్ వస్తుంది. అయితే, నిబంధనల ప్రకారం ప్రయాణ ఖర్చులు, ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్‌చార్జి కలిపి సుమారు రూ.5 లక్షల నిఖిల్ ముందుగా ఖర్చు చేయాల్సి ఉంది. ఈ మొత్తాన్ని భరించే స్తోమత లేకపోవడంతో నిఖిల్ దాతల సాయం కోరుతున్నారు. మరిన్ని వివరాల కోసం 88972 90513 నెంబరులో నిఖిల్‌ను సంప్రదించవచ్చు.