Share News

Supreme Court: సవరించిన శాశ్వత స్థానికత విధానాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేయొచ్చు కదా!

ABN , Publish Date - Oct 01 , 2024 | 03:52 AM

నీట్‌ కౌన్సెలింగ్‌కు సంబంధించి.. సవరించిన శాశ్వత స్థానికత విధానాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.

Supreme Court: సవరించిన శాశ్వత స్థానికత విధానాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేయొచ్చు కదా!

  • నీట్‌ కౌన్సెలింగ్‌ వ్యవహారంపై రాష్ట్ర సర్కారుకు సుప్రీం సూచన

  • కొందరికే మినహాయింపు సరికాదేమోనన్న సర్కారు తదుపరి విచారణ అక్టోబరు 3వ తేదీకి వాయిదా

న్యూఢిల్లీ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): నీట్‌ కౌన్సెలింగ్‌కు సంబంధించి.. సవరించిన శాశ్వత స్థానికత విధానాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబరు 3కు వాయిదా వేసింది. వైద్య విద్యలో ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ సర్కారు జారీ చేసిన జీవో నం.33లోని 3(ఎ) నిబంధనను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి! సుదీర్ఘ వాదనల అనంతరం వాటిపై హైకోర్టు సెప్టెంబరు5న తీర్పు చెప్పింది. స్థానికత నిర్ధారణకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందించలేదని.. తొలుత వాటిని రూపొందించి, ఆ మార్గదర్శకాల మేరకు స్థానిక కోటా వర్తింపజేయాలని ఆదేశించింది.


హైకోర్టు తీర్పును సెప్టెంబరు 11న రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఆ పిటిషన్‌ పై సెప్టెంబర్‌ 20న భారత ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనల సందర్భంగా.. ఒకసారి మినహాయింపు కింద హైకోర్టును ఆశ్రయించిన 135 మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీంతో.. హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు అవకాశం కల్పించడంతోపాటు హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు ేస్ట విధించింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. ఆ పిటిషన్‌.. సెప్టెంబర్‌ 27న మరోసారి సుప్రీం ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. విద్యార్థుల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు.. కేవలం హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులను మాత్రమే కౌన్సెలింగ్‌కు అనుతించడం సరికాదని, అర్హులందరినీ కౌన్సెలింగ్‌కు అనుమతించాలని కోరారు.


దీనికి సీజేఐ డీవై చంద్రచూడ్‌ స్పందిస్తూ.. ఆ తీర్పును సవరించాలంటే గతంలో తీర్పు ఇచ్చినప్పటి ధర్మాసనం పూర్తిగా మళ్లీ విచారణ చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. ఆ ధర్మాసనంలోని జస్టిస్‌ పార్దీవాలా అందుబాటులో లేరు కనుక సోమవారం (సెప్టెంబరు 30న) విచారణ చేపడతామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో.. సోమవారం సీజేఐ నేతృత్వంలోని గత ధర్మాసనం ఆ పిటిషన్‌ను విచారించింది. విద్యార్థుల తరఫు న్యాయవాదులు తమ వాదనను మళ్లీ ధర్మాసనం ముందుంచారు. కేవలం ఒకటి లేదా రెండేళ్లు వేరే చోట చదివినంత మాత్రాన స్థానికులు కాదనడం సరికాదన్నారు. అయితే.. మొత్తం ఎంతమంది విద్యార్థులు ఇలా స్థానికత సమస్యను ఎదుర్కొంటున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. స్థానికత అంశంపై స్పష్టమైన విధానం ఉండాలని పేర్కొంది.


రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకరనారాయణన్‌.. హైకోర్టును ఆశ్రయించిన 135 మంది విద్యార్థులకే కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు గతంలో తాము తెలిపిన ఆమోదం సరికాదేమోనని అభిప్రాయపడ్డారు. దీనికి సీజేఐ.. ‘మీరు అలా ఆమోదం తెలిపినప్పుడు నాకు ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే కోర్టు ముందుకు వచ్చిన కొందరికి మాత్రమే మినహాయింపు ఇవ్వకూడదనిపించింది’ అని పేర్కొన్నారు. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసి.. ‘‘ఇది ఆదేశం కాదుగానీ, మిస్టర్‌ గోపాల్‌.ఎస్‌.. సవరించిన నిబంధనను వచ్చే ఏడాది నుంచి వర్తింపజేయగలరేమో పరిశీలించండి’’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - Oct 01 , 2024 | 03:52 AM