Suryapet: రూ.99,200 లంచం.. ఏసీబీకి చిక్కిన సూర్యాపేట సబ్‌రిజిస్ట్రార్
ABN , Publish Date - Jun 04 , 2024 | 03:13 AM
ప్లాట్ రిజిస్ట్రేషన్‌కు గజానికి రూ.100 చొప్పున మొత్తం రూ.99,200 లంచం తీసుకున్న సూర్యాపేట సబ్-రిజిస్ట్రార్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నల్లగొండ రేంజ్ ఏసీబీ డీఎస్పీ జగదీశ్‌చంద్ర కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లాకేంద్రానికి చెందిన ఎం.వెంకటేశ్వర్లు తన 1,240 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించేందుకు మూణ్నెల్ల క్రితం సబ్-రిజిస్ట్రార్ బానోత్ సురేందర్‌నాయక్‌ను కలిశారు.
గజానికి రూ.100 చొప్పున డిమాండ్
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ
ఏసీబీ వలలో పరిశ్రమల శాఖ ఏడీ
సూర్యాపేటటౌన్/మేడ్చల్, జూన్ 3(ఆంధ్రజ్యోతి): ప్లాట్ రిజిస్ట్రేషన్‌కు గజానికి రూ.100 చొప్పున మొత్తం రూ.99,200 లంచం తీసుకున్న సూర్యాపేట సబ్-రిజిస్ట్రార్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నల్లగొండ రేంజ్ ఏసీబీ డీఎస్పీ జగదీశ్‌చంద్ర కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లాకేంద్రానికి చెందిన ఎం.వెంకటేశ్వర్లు తన 1,240 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించేందుకు మూణ్నెల్ల క్రితం సబ్-రిజిస్ట్రార్ బానోత్ సురేందర్‌నాయక్‌ను కలిశారు. తన కుమార్తె మానస పేరిట 1,080 చదరపు గజాలను, మిగతా 160 చదరపు గజాలను మేడిపల్లి రవిరాజు పేరిట సేల్‌డీడ్ చేయాలని కోరారు. అప్పటి నుంచి ఆయన సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నారు.
ఆ తర్వాత సబ్-రిజిస్ట్రార్ తాపీగా, తనకు గజానికి రూ.100 చొప్పున లంచం ఇస్తే పనవుతుందని దస్తావేజు రైటర్లు కల్లూరి శ్రీనివాస్, తంగెళ్ల వెంకట్‌రెడ్డి ద్వారా చెప్పించారు. దీంతో వెంకటేశ్వర్లు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు.. సోమవారం ఆ మొత్తాన్ని శ్రీనివాస్, వెంకట్‌రెడ్డికి అందజేశారు. వారిద్దరు ఆ మొత్తాన్ని సబ్-రిజిస్ట్రార్‌కు అందజేయగానే.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కాగా.. సబ్-రిజిస్ట్రార్ సురేందర్‌నాయక్ గతంలోనూ ఏసీబీకి చిక్కారు. 2007లో వికారాబాద్ జిల్లా పరిగిలో, 2018లో మల్కాజిగిరిలో ఏసీబీ అధికారులు అతనిపై కేసులు నమోదు చేశారు. మరోవైపు.. దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం అందించే పథకాల తనిఖీకి రూ.45 వేలు లంచం తీసుకున్న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిశ్రమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కథనం ప్రకారం.. తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఆంత్రప్రెన్యూర్స్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద కూకట్‌పల్లికి చెందిన రమేశ్‌కు రూ.53 లక్షలు మంజూరయ్యాయి. ఆ మొత్తంతో ఆయన ఓ ట్రక్కు(టిప్పర్)ను కొనుగోలు చేశారు. స్కీమ్‌లో భాగంగా ఆయనకు రూ.23 లక్షలు మంజూరయ్యాయి. అయితే.. ఆ మొత్తం విడుదలకు ముందు.. ఏడీ వెంకట్‌నర్సిరెడ్డి తనిఖీ చేయాల్సి ఉంది. ఆ పని చేయడానికి రూ.50 వేలు ముట్టజెప్పాల్సిందేనని వెంకట్‌నర్సిరెడ్డి తేల్చిచెప్పారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు బేరసారాలు చేసి, రూ.45వేలు ఇచ్చేలా వెంకట్‌నర్సిరెడ్డితో ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో జీడిమెట్లలో వెంకట్‌నర్సిరెడ్డి ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్-హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెంకట్‌నర్సిరెడ్డిని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు.