Banswada: ఒకేరోజు ఇద్దరు మునిసిపల్ కమిషనర్ల సస్పెన్షన్
ABN , Publish Date - May 23 , 2024 | 03:29 AM
అక్రమాలకు పాల్పడిన ఇద్దరు మునిసిపల్ కమిషనర్లను సస్పెండ్ చేస్తూ బుధవారం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మల్ పురపాలక సంఘంలో జరిగిన పబ్లిక్ హెల్త్ వర్కర్ల నియామకాలకు సంబంధించి అప్పటి నిర్మల్ మునిసిపల్ కమిషనర్, ప్రస్తుత తుర్కయాంజల్ మునిసిపల్ కమిషనర్ బి. సత్యనారాయణ రెడ్డిని అధికారులు తొలగించారు.
తుర్కయాంజల్, బాన్సువాడ కమిషనర్లపై వేటు
తుర్కయాంజల్ కమిషనర్ సస్పెన్షన్
ఉత్తర్వుల్లో ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ఉటంకించిన అధికారులు
నిర్మల్ ఉద్యోగాల వ్యవహారంలో తుర్కయాంజల్ కమిషనర్‌పై వేటు
నిర్మల్/ హయత్‌నగర్/ బాన్సువాడ, మే 22 (ఆంధ్రజ్యోతి): అక్రమాలకు పాల్పడిన ఇద్దరు మునిసిపల్ కమిషనర్లను సస్పెండ్ చేస్తూ బుధవారం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మల్ పురపాలక సంఘంలో జరిగిన పబ్లిక్ హెల్త్ వర్కర్ల నియామకాలకు సంబంధించి అప్పటి నిర్మల్ మునిసిపల్ కమిషనర్, ప్రస్తుత తుర్కయాంజల్ మునిసిపల్ కమిషనర్ బి. సత్యనారాయణ రెడ్డిని అధికారులు తొలగించారు. 2022లో పారిశుధ్య కార్మికుల నియామకాలకు సంబంధించి నిర్మల్ మునిసిపాలిటీలో 44 పోస్టులను భర్తీ చేశారు. ఈ వ్యవహారంపై 2022 ఫిబ్రవరి 26వ తేదీన ఆంధ్రజ్యోతిలో ‘అడ్డదారిలో ఊడ్చేశారు’ అన్న శీర్షికన కథనం ప్రచురితమైంది.
అలాగే ఈ పోస్టుల భర్తీ అనధికారికంగా జరిగినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులూ అందడంతో స్పందించి విచారణ జరిపారు. విచారణలో అనధికారికంగా ఉద్యోగాల నియామకం చేపట్టిన విషయం వాస్తవం అని తేల్చి సత్యనారాయణ రెడ్డిని సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ ఉత్తర్వుల్లో ఆంధ్రజ్యోతి కథనాన్ని అధికారులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాగే కామారెడ్డి జిల్లా బాన్సువాడ మునిసిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న హలీం గతంలో నిర్మల్ జిల్లా భైంసా మునిసిపాలిటీ కమిషనర్‌గా పనిచేశారు. అక్రమ నియామకాలకు తెర లేపడమే కాకుండా మున్సిపాలిటీ నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వ అక్రమ స్థలాలకు అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులు విచారణ చేపట్టి వాస్తవమేనని తేల్చి హలీంను సస్పెండ్ చేశారు.