Kollapur: పోలీసు విచారణకొచ్చిన మహిళ అనుమానాస్పద మృతి..
ABN , Publish Date - Jun 21 , 2024 | 03:30 AM
దొంగతనం కేసులో విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పోలీసుస్టేషన్‌లో గురువారం ఈ ఘటన జరిగింది.
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో ఘటన
ఫిట్స్ రావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించామంటున్న పోలీసులు
విషం తీసుకుందన్న వైద్యులు
మెరుగైన చికిత్సకు తరలిస్తుండగా మరణం
కొల్లాపూర్, జూన్ 20: దొంగతనం కేసులో విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పోలీసుస్టేషన్‌లో గురువారం ఈ ఘటన జరిగింది. కొల్లాపూర్ ఎస్సై రిషికేష్ కథనం ప్రకారం.. జిల్లాలోని చిన్నంబావి మండలం వెంటూరుకు చెందిన లక్ష్మీ.. కొల్లాపూర్‌లోని సాయికృప ఆస్పత్రిలోని మందుల దుకాణంలో పని చేసేది. ఆస్పత్రి నిర్వాహకులు ఆరు నెలల క్రితం లక్ష్మీపై దొంగతనం కేసు పెట్టారు. ఈ కేసు విచారణ నిమిత్తం పోలీసుల పిలుపు మేరకు లక్ష్మి గురువారం కొల్లాపూర్ పోలీసు స్టేషన్‌కు వచ్చింది.
స్టేషన్‌లోకి వచ్చి కూర్చొన్న కాసేపటికే లక్ష్మికి ఫిట్స్ రాగా పోలీసు సిబ్బంది ఆమె చేతిలో తాళం చెవులు పెట్టి అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లక్ష్మిని పరీక్షించిన వైద్యులు ఫిట్స్ కాదని, బాధితురాలు విషం తీసుకుందని అనుమానం వ్యక్తం చేసి జిల్లా ఆస్పత్రికి తరలించాలని సిఫారసు చేశారు. మెరుగైన వైద్యం కోసం నాగర్‌కర్నూల్ తరలిస్తుండగా మార్గమధ్యలోనే లక్ష్మి కన్నుమూసింది. కాగా, లక్ష్మికి భర్త, కుమార్తె ఉన్నారు. ఆస్పత్రి నిర్వాహకులు దొంగతనం కేసులో తనతోపాటు కుటుంబసభ్యుల పేర్లు కూడా చేర్చడంతో లక్ష్మి తీవ్ర మనోవేదనకు గురైందని ఆమె కుటుంబీకులు చెబుతున్నారు.