Share News

Hyderabad: డీజే.. డ్రగ్స్‌ జాకీ..

ABN , Publish Date - Jun 18 , 2024 | 03:54 AM

పలు పబ్‌లలో డిస్క్‌ జాకీ (డీజే)గా పనిచేస్తున్న వ్యక్తితో పాటు అతడితో టచ్‌లో ఉన్న ఇద్దరు డ్రగ్స్‌ తీసుకున్నట్లు తేలింది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో (టీజీ న్యాబ్‌) డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య సోమవారం ఈ వివరాలను వెల్లడించారు.

Hyderabad: డీజే.. డ్రగ్స్‌ జాకీ..

  • మత్తు మందు తీసుకుని.. పబ్‌లకు డిస్క్‌ జాకీ

  • అతడితో టచ్‌లో ఉన్న 16 మందికి పరీక్షలు..!

  • డీజే మరో ఇద్దరు డ్రగ్స్‌ తీసుకున్నట్లు నిర్ధారణ

  • విద్యాసంస్థల్లో బ్యాగులన్నీ తనిఖీ చేయాల్సిందే

  • టీజీ న్యాబ్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య స్పష్టీకరణ

  • ఒక్క రోజే.. 349 మంది తాగి దొరికిపోయారు

  • వీరిలో 21 నుంచి 30 ఏళ్లలోపు వారే అధికం

  • మాదాపూర్‌లో అత్యధికంగా 74 మంది పట్టివేత

  • సైబరాబాద్‌లో డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు

  • గంజాయి అలవాటు చేసి.. విక్రేతలుగా మార్చి..

  • ఏపీకి చెందిన తండ్రీ, కుమారుల ఘరానా దందా

  • వారితో సహా 12 మంది అరెస్ట్‌

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, మిర్యాలగూడ, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): పలు పబ్‌లలో డిస్క్‌ జాకీ (డీజే)గా పనిచేస్తున్న వ్యక్తితో పాటు అతడితో టచ్‌లో ఉన్న ఇద్దరు డ్రగ్స్‌ తీసుకున్నట్లు తేలింది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో (టీజీ న్యాబ్‌) డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య సోమవారం ఈ వివరాలను వెల్లడించారు. తమకు ఉన్న సమాచారం మేరకు హైదరాబాద్‌ మాదాపూర్‌, గచ్చిబౌలిలోని పబ్‌లకు తరచూ వెళ్లే 16 మందిని పిలిపించామని చెప్పారు. పరీక్షలు చేయగా డీజే, మరో ఇద్దరు కొకైన్‌, గంజాయి తీసుకున్నట్లు తేలిందన్నారు. వీరిపై మాదాపూర్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని శాండిల్య తెలిపారు. డీజేతో సంబంధాలు ఉన్నవారందరిపై నిఘా పెట్టామని చెప్పారు. డీజే కొంతకాలంగా పెద్దఎత్తున ఎండీఎంఏ డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు నార్కొటిక్స్‌ బ్యూరో గుర్తించింది. గతంలో డ్రగ్స్‌ తీసుకున్నవారి జాబితాలో దొరికిన పేర్ల ఆధారంగా విచారణ నిర్వహించింది. కాగా, మత్తు పదార్థాల కట్టడి చర్యల్లో భాగంగా విద్యార్థుల బ్యాగులను వంద శాతం తనిఖీ చేయాలని విద్యాసంస్థలకు సందీప్‌ శాండిల్య స్పష్టం చేశారు. లాకర్లనూ పరిశీలించాలని సూచించారు.


వేసవి సెలవుల అనంతరం విద్యాసంస్థలు పునఃప్రారంభమైన నేపథ్యంలో పలు కీలక సూచనలు చేశారు. డ్రగ్స్‌ నిరోధానికి సంబంధించి తనిఖీలపరంగా విద్యాసంస్థల సిబ్బందికి ఏవైనా ఇబ్బందులుంటే, విశ్రాంత పోలీసులను నియమించుకోవాలని పేర్కొన్నారు. యాంటీ డ్రగ్‌ కమిటీ (ఏడీసీ)లు మరింత చురుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. విద్యార్థి మత్తు మందుతో దొరికితే.. వారి భవిష్యత్తు దృష్ట్యా వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. జూనియర్లను బెదిరించి సీనియర్లు మత్తు పదార్థాలు సరఫరా చేయించే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంలోనూ నిఘా ఉంచాలని నిర్దేశించారు. విద్యాసంస్థలతో పాటు బయట మరెక్కడైనా మత్తు పదార్థాల వాడకం, విక్రయాలపై సమాచారం ఉంటే టీజీ న్యాబ్‌ కంట్రోల్‌ రూమ్‌ నెంబరు 8712671111 కు సమాచారం ఇవ్వాలని సందీప్‌ శాండిల్య కోరారు. కాగా, తనిఖీలు పెరగడం, కౌన్సెలింగ్‌ ఇస్తుండడంతో డ్రగ్స్‌ వాడకందారుల్లో మార్పు వస్తోందని తెలిపారు. కొద్ది నెలల క్రితం పట్టుబడ్డ యువతి పరివర్తన చెందిందని చెప్పారు.


తప్పతాగి వాహనాలు నడుపుతూ..

మద్యం మత్తులో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నిరోధించడానికి, తాగి వాహనాలు నడుపుతున్నవారిని అడ్డుకునేందుకు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో పెద్దఎత్తున యువత పట్టుబడ్డారు. కమిషనరేట్‌ పరిధిలో గత శనివారం శనివారం సాయంత్రం 6 గంటల నుంచి అర్థరాత్రి 2 వరకు 349 కేసులు నమోదైనట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. అత్యధికంగా మాదాపూర్‌ స్టేషన్‌ పరిధిలో 74 మంది పట్టుబడినట్లు వెల్లడించారు. వీరిలో 21-30 ఏళ్లలోపు వారు 172 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తర్వాత 31-40 ఏళ్లలోపు వారు 104 మంది, 41-50 ఏళ్లలోపు వారు 44 మంది ఉన్నారు. 11 మంది కనీసం స్టీరింగ్‌ పట్టుకునే స్థితిలో లేరు. 301 నుంచి 500 పాయింట్లు వచ్చిన మందుబాబులు 11 మంది ఉండడం గమనార్హం. 18-20 ఏళ్లలోపు వారు ఐదుగురు, 51-60 ఏళ్లలోపు వారు 18మంది, 60 ఏళ్లు దాటినవారు ఐదుగురు చిక్కారు. మత్తులో రోడ్డు ప్రమాదాలు చేస్తే.. ఎవరైనా మరణిస్తే.. ఐపీసీ సెక్షన్‌ 304 పార్టు-2 కింద కేసులు నమోదు చేస్తున్నామని, నిందితులకు పదేళ్ల జైలు శిక్ష పడుతుందని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ జోయల్‌ డేవిస్‌ హెచ్చరించారు.


గంజాయి అలవాటు చేసి.. విక్రేతలుగా మార్చి

యువతకు గంజాయి అలవాటు చేసి.. వారినే ఏజెంట్లుగా మార్చుకుని విక్రయిస్తున్న ఏపీకి చెందిన తండ్రీ కుమారులతో పాటు మరో పదిమందిని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. డీఎస్పీ రాజశేఖరరాజు వివరాల మేరకు.. ఏపీలోని గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన సాకేటి పోలినాయుడు(46) వ్యవసాయ కూలీ. అతడి కుమారుడు తిరుపతి నారంనాయుడు అలియాస్‌ దాదు (28) డ్రైవర్‌. వారికున్న పరిచయాలతో విశాఖ జిల్లా పాడేరుకు చెందిన బాబీ వద్ద 10 కిలోల గంజాయిని కొని రైలు, బస్సుల్లో పల్నాడు జిల్లా దాచేపల్లికి తరలిస్తారు. చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి తెలంగాణ సరిహద్దు మండలాల యువతకు విక్రయిస్తున్నారు. తర్వాత వారికే విక్రయం బాధ్యత అప్పగిస్తున్నారు.


గంజాయి అమ్మేందుకు పోలినాయుడు, తిరుపతి సోమవారం దామరచర్ల మండలానికి వచ్చారు. బొత్తలపాలెం శివారులోని రైల్వే అండర్‌పాస్‌ వద్ద వీరిద్దిరితో పాటు 10 మందిని వాడపల్లి ఎస్‌ఐ రవికుమార్‌ అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటు కొంగ ప్రకాష్‌ (19-అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యం), నందిపాటి నవీన్‌ (23-పాలకవీడు మండలం శూన్యపహాడ్‌), సిగపట్ల మహేష్‌ (22-దామరచర్ల), కలిమెల కిశోర్‌ (23-దామరచర్ల మండలం వాడపల్లి), వీరభద్రాపురం తురక రమేష్‌ (27), మిర్యాలగూడ షాబునగర్‌ సంగోజు కార్తీక్‌ (19), రెడ్డికాలనీ జగతికుమార్‌ (25), ఈదులగూడెం జగతి కోటేష్‌ (24), షాబునగర్‌ షేక్‌ఖాజా (24), శాంతినగర్‌ ముడావత్‌ రమేష్‌ (24)ను అదుపులోకి తీసుకుని, రూ.90వేల విలువైన 6 కిలోల గంజాయి, రూ.46 వేల నగదు, 3 బైక్‌లు, 12 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Jun 18 , 2024 | 03:54 AM