Share News

Job Calendar: జాబ్‌ క్యాలెండర్‌కు చట్టబద్ధత!

ABN , Publish Date - Aug 02 , 2024 | 03:01 AM

జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించడమే కాకుండా... దానికి చట్టబద్ధత కూడా కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రతియేటా క్యాలెండర్‌ను ప్రకటించేలా ఒక విధానం తీసుకరావాలని క్యాబినేట్‌ నిర్ణయించింది.

Job Calendar: జాబ్‌ క్యాలెండర్‌కు చట్టబద్ధత!

  • నేడు అసెంబ్లీలో సీఎం రేవంత్‌ ప్రకటన

  • కొత్త రేషన్‌, ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి ఓకే

  • ఎమ్మెల్సీలుగా కోదండరాం,

  • అమీర్‌ అలీఖాన్‌ పేర్లతోనే ప్రతిపాదనలు

  • మూసీ ప్రక్షాళనకు 15 టీఎంసీల గోదారి నీళ్లు

  • నిఖత్‌ జరీన్‌, సిరాజ్‌లకు గ్రూప్‌- 1 ఉద్యోగం,

  • 600 గజాలు.. ఈషాసింగ్‌కు స్థలం

  • రాష్ట్ర క్యాబినెట్‌ భేటీలో నిర్ణయాలు

  • నేడు అసెంబ్లీలో సీఎం ప్రకటన

హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించడమే కాకుండా... దానికి చట్టబద్ధత కూడా కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రతియేటా క్యాలెండర్‌ను ప్రకటించేలా ఒక విధానం తీసుకరావాలని క్యాబినేట్‌ నిర్ణయించింది. శుక్రవారం అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా జాబ్‌ క్యాలెండర్‌పై ప్రకటన చేయనున్నారు. ఎన్ని ఉద్యోగాలను భర్తీచేస్తారనే వివరాలను కూడా సభలోనే చెప్పనున్నారు. సీఎం రేవంత్‌ అధ్యక్షతన గురువారం సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాల్లో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఈ భేటీలో పాల్గొన్నారు. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు.


ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలు, భర్తీచేసే ఉద్యోగాలు, నియామకాలకు నిర్దిష్ట కాలవ్యవధితో కూడిన జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామన్నారు. జాబ్‌ క్యాలెండర్‌పై విపక్షాలు ఇచ్చే సలహాలు, సూచనలు కూడా స్వీకరిస్తామని తెలిపారు. పేదలకు కొత్త రేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు విడివిడిగా జారీచేయాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. కొత్త కార్డుల జారీకి విధివిధానాల కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుచేశారు. ఇందులో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌ చైర్మన్‌గా, మంత్రులు దామోదర, పొంగులేటి సభ్యులుగా ఉంటారు. నెల రోజుల్లో విధివిధానాలు ఖరారుచేయాలని గడువు పెట్టారు. ప్రభుత్వానికి సబ్‌కమిటీ నివేదిక ఇవ్వగానే... రేషన్‌ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ విడివిడిగా ప్రారంభించాలని నిర్ణయించారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకపాత్ర పోషించిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌, సియాసత్‌ ఎడిటర్‌ ఆమెర్‌ అలీఖాన్‌లను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా గతంలో ప్రతిపాదిస్తే.. రాజ్‌భవన్‌ నుంచి ఫైల్‌ తిరిగొచ్చింది. అప్పటి గవర్నర్‌ ఆమోదం తెలపలేదు. తాజా క్యాబినెట్‌ సమావేశంలో మళ్లీ గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల అంశంపై చర్చించారు.


కోదండరామ్‌, ఆమెర్‌ అలీఖాన్‌ పేర్లనే ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ మంత్రివర్గం నిర్ణయించింది. క్రీడాకారులు నిఖత్‌ జరీన్‌, మహ్మద్‌ సిరాజ్‌, ఈషా సింగ్‌లకు 600 గజాల చొప్పున హైదరాబాద్‌లో ఇంటి స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. నిఖత్‌, సిరాజ్‌లకు గ్రూప్‌-1 కేడర్‌ ఉద్యోగాలు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. విధి నిర్వహణలో మృతిచెందిన ఇంటలిజెన్స్‌ డీజీ రాజీవ్‌ రతన్‌ తనయుడు హరి రతన్‌కు మున్సిపల్‌ కమిషనర్‌గా ఉద్యోగం, దివంగత అడిషన్‌ డీజీ పి. మురళి తనయుడికి డిప్యూటీ తహసీల్దారు ఉద్యోగమివ్వాలని నిర్ణయించారు.


గోదావరి జలాలను మల్లన్నసాగర్‌ నుంచి శామీర్‌పేట చెరువుకు తరలించి... అక్కడ నుంచి హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని చెరువులు నింపి తాగునీటి సరఫరా చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ బయట, ఔటర్‌ రింగురోడ్డు లోపల ఉండే అర్బన్‌ ప్రాంతం తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు కేటాయించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో తాగునీటి అవసరాలు తీరుస్తున్న జంట జలాశయాలు హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌తోపాటు మూసీలో నిరంతరం పరిశుభ్రమైన జలాలు ప్రవహించటానికి 5 టీఎంసీలు కేటాయించారు. మొత్తం 15 టీఎంసీల గోదావరి జలాలను తాగునీటి అవసరాలు, మూసీ ప్రక్షాళనకు వినియోగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. హుస్నాబాద్‌ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలు, భూసేకరణ, ఇతరత్రా పనులకు రూ.437 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.


  • నిజాం చక్కెర కర్మాగారం పునరుద్ధరణ

దశాబ్దకాలంగా మూతపడి ఉన్న నిజాం చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇథనాల్‌, విద్యుదుత్పత్తి అవకాశాలు, సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేయాలని సబ్‌కమిటీకి బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ధరణి సమస్యలను పరిష్కరించాలని భేటీలో నిర్ణయించారు. ధరణి పేరును ‘భూమాత’గా మారుస్తారని చర్చ జరుగుతోంది. రైతుభరోసాపై అసెంబ్లీలో చర్చించి, మార్గదర్శకాలను వెల్లడించాలని నిర్ణయిం చారు. కేరళలోని వయనాడ్‌ విపత్తుపై క్యాబినెట్‌ దిగ్ర్భాంతి వ్యక్తంచేసింది. ప్రాణనష్టం, ఆస్తినష్టంతో దెబ్బతిన్న కుటుంబాలకు అండగా ఉండాలని నిర్ణయించింది.


  • ‘గ్రేటర్‌’ శివారు మునిసిపాలిటీల విలీనంపై మంత్రివర్గ ఉపసంఘం

హైదరాబాద్‌, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) లోపలుండే గ్రామాలు, మునిసిపాలిటీల విలీనంపై అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. గురువారం క్యాబినెట్‌ సమావేశంలో ఈ మేరకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఓఆర్‌ఆర్‌ను ఆనుకుని ఉన్న 44 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిలిపేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం. ఈ గ్రామాలను ముందుగా సమీపాన ఉన్న మునిసిపాలిటీలలో విలీనం చేసి.. ఆ తర్వాత ఆయా మునిసిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయనున్నారు. ప్రస్తుతం పురపాలక శాఖ సీఎం వద్దనే ఉన్నందున మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులుగా ఎవరిని నియమిస్తారనే దానిపై ఆ శాఖ అధికారుల్లో చర్చ జరుగుతోంది.


  • గత ప్రభుత్వం ఏ పనులు సరిగా చేయలేదు- మంత్రి పొంగులేటి

గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఆర్భాటాలు తప్ప, ఆచరణలో ఏ పనులు సక్రమంగా చేయలేదని మంత్రి పొంగులేటి అన్నారు. కేసీఆర్‌ పాలనలో పేద ప్రజల కష్టాలు పట్టించుకోలేదని అన్నారు. రేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు కూడా జారీచేయలేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌ను గత ప్రభుత్వం ఎలా గౌరవించిందో ప్రజలు చూశారని అన్నారు. పొన్నం మాట్లాడుతూ... బీసీ కులగణన చేపట్టే పనిలో ఉన్నామని, ఓటర్‌ లిస్టు విడుదలచేస్తామని... పంచాయతీరాజ్‌ శాఖకు ఓటర్ల జాబితా వచ్చిన తర్వాత అన్ని సరిచూసి... స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. జీవో నంబరు- 317, జీవో- 46, 2008 డీఎస్సీ, 1998 డీఎస్సీ... తదితర సమస్యలన్నింటికి ప్రభుత్వం పరిష్కారం చూపిస్తుందని పొన్నం ప్రకటించారు. హుస్నాబాద్‌ ప్రాంతంలో గౌరవెళ్లి ప్రాజెక్టుకు ఈ ప్రభుత్వం రూ. 437 కోట్లు కేటాయించటం హర్షణీయమని అన్నారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టు పనులు పూర్తిచేసి 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని ప్రకటించారు.

Updated Date - Aug 02 , 2024 | 03:01 AM